విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదు రోజైన ఆదివారం దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీసంఖ్యలో తరలిరానున్నారు. మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ముఖ్యమంత్రి దుర్గగుడికి రానున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మళ్లీ శ్రీకాకుళం వెళతారు. మరో రెండు మూడు రోజులు అక్కడే ఉండి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తారు.
మీడియా పాయంట్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు అందించే సాంప్రదాయం ఉందని ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం దుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. శ్రీకాకుళంలో తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న కుటుంబాలు, ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వెళ్లారన్నారు. నవరాత్రి ఉత్సవాలలో ఇప్పటివరకు మూడు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, ఆదివారం మూలా నక్షత్రం సందర్భంగా ఒక్కరోజునే మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేశామన్నారు.
అందుకు తగినట్లుగా ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు, పాలకమండలి సభ్యులు సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారని మంత్రి అభినందించారు. గత సంవత్సరం దసరా ఉత్సవాలలో 15 నుండి 16 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని ఈ సంవత్సరం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.