తిత్లీ తుపాను బీభత్సంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. తుపాను తీరం దాటి 24 గంటలు దాటినా జిల్లావాసులు దాని ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఎటువైపు చూసినా నేలకొరిగిన చెట్లు, కూలిన ఇళ్లు, నీట మునిగిన రహదారులు.. ఇలా పరిస్థితి భీతావాహంగా ఉంది. తుపాను ముప్పు తప్పినప్పటికీ.. వరద పోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ‘తిత్లీ’ పెను తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో బాధితులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.
తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని, విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని చంద్రబాబు స్థానికులతో చెప్పారు. తితలీ తుఫానుతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర సాధారణ స్థితికి వచ్చేదాకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు శ్రీకాకుళం రావాలని ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు కోలుకునేదాకా ఉన్నతాధికారులంతా అక్కడే ఉండాలన్నారు.
బుధవారం రాత్రి నుంచి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం.. గురువారం రాత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గం గుండా శ్రీకాకుళం చేరుకున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులకు 50కేజీల చొప్పున, ముంపు గ్రామాల్లో 25 కేజీల చొప్పున బాధితులకు తక్షణం బియ్యం అందిస్తామని తెలిపారు. పార్టీ యంత్రాంగం, ప్రజలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆర్ అండ్ బీకి చెందిన 22 రహదారులను శుక్రవారంనాటికే బాగుచేయాలన్నారు. విద్యుత్తు సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. వంశధార ఫేజ్-2 రిజర్వాయర్‌లోకి వరద నీటిని మళ్లించాలన్నారు. ముందస్తు చర్యల ద్వారా ప్రాణనష్టం తగ్గించగలిగామంటూ... జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను నష్టానికి సంబంధించి చిత్రాలను సీఎం చూశారు. మరణించిన వారికి నష్టపరిహారం తక్షణమే అందించాలని అధికారుకు ఆదేశించారు.