ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలకు అవమానం ఎదురైంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో సమావేశానికి వెళ్లిన టిడిపి ఎంపీలను, గేటు బయటే నిలిపేశారు సెక్యూరిటీ సిబ్బంది. మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు పార్లమెంట్ సభ్యులను అనుమతించలేదు. బీరేంద్ర సింగ్ తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెప్పినా వాళ్ళను గెట్ దగ్గరే ఆపేశారు. దీంతో టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. పిలిచి మరీ ఇలా అవమానిస్తారా అంటూ, ఆందోళనకు దిగారు. దీంతో విషయం పెద్దది అవుతూ ఉండటంతో, కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది కావాలనే ఇలా చేసారని, ఇది మంచి పద్దతి కాదని, కేంద్ర మంత్రి పై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
తరువాత, మంత్రితో భేటీ అయ్యి, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. భేటీ అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి మాట్లాడుతూ 'వారం రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పై ఉక్కు మంత్రి ప్రెస్ నోట్ ఇస్తామన్నారు. కానీ.. స్టీల్ ప్లాంట్ విషయం ఉక్కు మంత్రి చేతిలో లేనట్టు ఉంది' అని అన్నారు. రాజకీయాలతోనే స్టీల్ ప్లాంట్‌ను ఆలస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. నాలుగైదు రోజుల్లో ప్రెస్ నోట్ ఇస్తామని మంత్రి అన్నారని చెప్పారు.
'అనుభవం లేని అనిల్ అంబానీకి రాఫెల్ విమానాల కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు' అని ప్రశ్నించారు. అంతకుముందు ఎంపీ సుజనాచౌదరి నివాసంలో భేటీ అయిన ఎంపీలు పలు అంశాలపై చర్చించారు. టీడీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్న డిమాండ్లు ఇవే: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలి. కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏపీకి అవకాశం కల్పించాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలి. కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అంగీకారమా? కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రైవేట్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అంటూ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.