ఏపీలో శుక్రవారం ఉదయం నుంచి పలుచోట్ల ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. టీడీపీ నేత బీద మస్తాన్‌రావుకు చెందిన వీఎంఆర్ సంస్థలో ఐటీ తనిఖీలు చేయడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే పోతుల రామారావు కుటుంబసభ్యుల కంపెనీల్లో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇదిలా ఉంటే.. విజయవాడలోని సదరన్ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. సదరన్, వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీల్లో ఐటీ సోదాలు చేసింది. జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్ బ్రిక్స్ కంపెనీల్లో ఐటీ దాడులు చేయడం జరిగింది.
అయితే ఏ కంపెనీల్లో అధికారులు ఏమేం గుర్తించారు..? అసలు సోదాల్లో ఏం బయటపడ్డాయి..? ఎందుకు ఇంత సడన్‌గా ఐటీ అధికారులు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు..? అనే విషయాలు తెలియరాలేదు. శుక్రవారంతోనే ఐటీ సోదాలు ముగిశాయా..? లేకుంటే మరో రెండు మూడ్రోజులు దాడులు జరుగుతాయా..? అనే వివరాలు కూడా తెలియట్లేదు. రేవంత్ కేసులో చేసినట్టు, మూడు రోజులు దాడి చేసి, ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్లినట్టు, ఇక్కడ కూడా జరిగినట్టు సమాచారం. ఎందుకంటే, ఐటి అధికారులు ఏమన్నా పట్టుకుంటే, ఈ పాటికే రచ్చ రచ్చ చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, హడావిడి హడావిడి చేసేవారు. అయితే ఈ దాడులు ముగిసాయా, ఈ రోజు కొంసాగుతాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీంతో ఏపీకి చెందిన పలు కంపెనీల యజమానులు, రాజకీయ నేతలు ఎప్పుడేం జరుగుతుందో అని అయోమయంలో పడ్డారని తెలుస్తోంది.
కాగా.. ఏపీలో ఐటీ సోదాలు చేయడంపై శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యవహారంపై సుమారు అరగంటకుపైగా చర్చించి అధికారులు భద్రత కల్పించకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా కేంద్రం.. ఏపీపై వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఐటీ సోదాలు జరపడంపై తెలుగు తమ్ముళ్లు కన్నెర్రజేశారు. మీడియా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదంతా కుట్రపూరితంగా కేంద్రం చేస్తున్న పనేనని విమర్శలు మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.