త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించనున్న వ్యూహానికి సంబంధించిన నివేదికను ఆర్ఎస్ఎస్ పెద్దలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని టీటీడీ కల్యాణ మండపంలో మూడ్రోజుల ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్‌లు శుక్రవారం మొదలయ్యాయి. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు 32 సంఘ్ పరివార్ సంస్థలకు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగానే పార్టీ నివేదికను అందజేసినట్లు సమాచారం. మోదీ ప్రభుత్వ పనితీరుపై విమర్శనాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ లక్ష్య సాధనకు మోదీ సర్కారు ఎంత మేరకు తోడ్పడిందో చర్చిస్తారని తెలిసింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు కలిసికట్టుగా, మరింత సమన్వయంగా పనిచేసేందుకు అవసరమైన వ్యూహ రచనను ఈ భేటీలో ఖరారు చేస్తారని అనుకొంటున్నారు. అయితే ఈ సమావేశాలు రాజకీయ చర్చలకు వేదిక కాదని విలేకరులతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ అరుణ్‌కుమార్ చెప్పారు.
మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు. ఈ సమావేశాలను మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ప్రారంభించారు. భద్రతను కట్టుదిట్టం చేయడంతో అనుమతి లేనిదే ఎవరినీ రానివ్వడం లేదు. సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వారు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.