కర్ణాటక సీఎం కుమారస్వామి ఈ ఉదయం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఆయనకు మంత్రులు, ప్రొటోకాల్ అధికారులు, పలువురు అభిమానులు స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఆయన ఇంద్రకీలాద్రి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కుమారస్వామి రాక సందర్భంగా దుర్గ గుడి వద్ద భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శ్రావణ శుక్రవారం కావడంతో కొండపై భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉంది. అయితే, కుమారస్వామి చంద్రబాబును కలుస్తారో లేదో క్లారిటీ లేదు.
ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పల్లిలో అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కేంద్రానికి కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తేనెబండలో కాపు కార్పొరేషన్ భవనానికి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. మరో పక్క, నిన్నటితో కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామి, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటక ప్రభుత్వం ప్రశాంతంగా నడుస్తోందన్నారు కుమారస్వామి. వందరోజులు పూర్తికావడంతో క్రికెట్ లో సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరంగా పాలన కొనసాగుతోందన్నారు కర్ణాటక సీఎం. అలాగే కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు కుమారస్వామి. కర్ణాటకలో చదువుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల సమస్యలపై చర్చించినట్టు చెప్పారు.