సినీనటుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. హరికృష్ణ ప్రమాద వార్త తెలియగానే చంద్రబాబు, లోకేశ్ హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో నల్గొండ బయల్దేరారు. కాసేపటి క్రితమే నల్గొండ వచ్చిన చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆసుపత్రికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతికకాయానికి, చంద్రబాబు లోకేష్ నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు, హరికృష్ణ కొడుకులు, తారక్, కళ్యాణ్ రాం లకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
అనంతరం అక్కడున్న వారితో ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కాగా.. పోస్టుమార్టం పూర్తవడంతో పార్ధీవదేహాన్ని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా అంబులెన్స్‌తోపాటు మరో వాహనంలో చంద్రబాబు, లోకేశ్ కూడా రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు వస్తున్నారు. హరికృష్ణ భౌతికకాయం వెంట బాలకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఉన్నారు. హరికృష్ణ పార్ధీవదేహాన్ని తీసుకువస్తున్న అంబులెన్స్ వెంటే చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ కూడా వేరే వాహనంలో రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు వస్తున్నారు.
హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. తొలుత తీవ్రగాయాలకు గురైన హరికృష్ణను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలు కావడం, పరిస్థితి విషమించడంతో చికిత్స మొదలుపెట్టేలోపే హరికృష్ణ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మొయినాబాద్ మండలం ముర్తుజగూడలోని నందమూరి కుటుంబసభ్యుల వ్యవసాయక్షేత్రంలో రేపు హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.