రాష్ట్రంలో ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగడాలు పెంచుతూ, పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరును తీవ్రతరం చేస్తున్నది. ఇప్పటికే పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసిన ఆయన చివరి ఘట్టంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ప్రజా సంకల్పయాత్రకు ఈ నెల 14న శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్ట వద్ద నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు, విభేదాలు జగన్ లక్ష్యానికి, పార్టీ పటిష్ఠానికి అడ్డంకిగా మారుతున్నాయని కొంతమంది నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాదయాత్రకు ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో తీవ్రస్థాయిలో నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా వున్న అభిప్రాయ భేదాలు పార్టీ అధినేత రాకకు ముందు, తర్వాత కూడా బయటపడుతున్నాయి.
రెండు రోజుల క్రితం (శనివారం) పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం కోటవురట్ల మండలం తంగేడులో జరిగింది. ఆ సమావేశంలో పార్టీ కోటవురట్ల మండల అధ్యక్షుడు పైలా రమేష్‌కు, తంగేడు రాజులకు మధ్య వున్న విభేదాలు బయటపడ్డాయి. విజయసాయిరెడ్డి సమక్షంలోనే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడడం గమనార్హం. వైసీపీ నాయకుల గొడవను చిత్రీకరించిన పత్రికా విలేఖరుల వద్ద నుంచి విజయసాయిరెడ్డి వర్గీయులు కెమెరాలు లాక్కొని బలవంతంగా ఆ చిత్రాలను తొలగించారు. అదేవిధంగా ఆదివారం జరిగిన ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో వైసీపీ నాయకులు కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో విజయసాయిరెడ్డి కంగుతిన్నారు. ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పార్టీ అధినేత జగన్‌ను కూడా ఇందులోకి లాగడం, తాను ఆయనకు భారీగా డొనేషన్ ఇచ్చానంటూ కన్నబాబురాజు పేర్కొనడం కలకలం రేపింది.
వైసీపీలో విభేదాలు లేవని, అంతా మీడియా సృష్టి అని, కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఈ నెల 13న నర్సీపట్నంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల సమావేశాలతో ఆయనకు వాస్తవమేమిటో అర్థమయ్యిందని పార్టీ నేతలు అంటున్నారు. ఇక విశాఖ జిల్లాలో తొలుతగా పాదయాత్ర ప్రారంభించి ఏకంగా వారం రోజులు పాటు జగన్ సమయం కేటాయించిన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా పాదయాత్ర అనంతరం పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేవిగా మారాయి. పాదయాత్రలో జగన్ గానీ, పార్టీ సీనియర్లుగానీ తమకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు నాయకులు బహిరంగంగా, మరికొందరు నిగూఢంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడుకు గట్టి పోటీ ఇచ్చిన గణేష్‌కే మళ్లీ టిక్కెట్టు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే నియోజకవర్గంలో వారం రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన జగన్ కనీసం నర్సీపట్నం బహిరంగ సభలో కూడా గణేష్‌ను అభ్యర్థిగా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది.