‘నేను తీసుకున్నది రైట్ టర్న్! యూ టర్న్ తీసుకున్నది మీరే. కుట్రలు చేసింది మీరే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు’ అని పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలను సూటిగా తిప్పికొట్టారు. ‘‘మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే దేశానికీ మంచిదికాదు’’ అని మొదటి నుంచీ చెబుతున్నానని చంద్రబాబు తెలిపారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులంటే లెక్కలేనితనమా అని కేంద్రాన్ని నిలదీశారు. ‘మేం కూడా ఈ దేశంలో భాగమే’ అని నినదించారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘నగర దర్శిని’ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
‘‘మోదీ దారుణంగా మాట్లాడారు. నేను వైసీపీ ట్రాప్‌లో పడ్డానని చెప్పారు. వాళ్లే వైసీపీ ట్రాప్‌లో పడ్డారని నేను అప్పుడే మోదీకి చెప్పాను. నేను తీసుకున్నది రైట్ టర్న్ అని స్పష్టం చేశాను’’ అని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడ, ఎప్పుడు చెప్పిందో రుజువు చేయాలని సవాల్ విసిరారు. అవినీతిలో మునిగిన వైసీపీని నమ్ముకుంటే ఒకటో, రెండో సీట్లు వస్తాయని బీజేపీ కక్కుర్తిపడిందని మండిపడ్డారు. ‘‘భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా గట్టిగా పోరాడతాను. బీజేపీ మినహా అన్ని పార్టీలు మనకు అండగా నిలిచాయి. వైసీపీ ఒక్కటే బీజేపీ వెంట ఉంది’’ అని తెలిపారు.
శుక్రవారం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇక్కడ కూడా మోడీ చేసిన వ్యాఖ్యల పై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీదే యూటర్న్ తప్ప టీడీపీ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం యూటర్న్ కాదా?...మేనిఫెస్టోలో చెప్పింది చేయక పోవడం యూ టర్న్ కాదా?...పదేళ్లు హోదా ఇస్తామని ఇప్పుడు ఇవ్వం అనడం యూ టర్న్ కాదా?’ అంటూ సీఎం ప్రశ్నించారు. రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్‌కు వీజీఎఫ్ సగం తగ్గించారని..అయితే కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌కు రూ.5,361 కోట్లు ఏపీనే కట్టమనడం యూ టర్న్ కాదా? అని చంద్రబాబు నిలదీశారు. ‘ఢిల్లీ-ముంబై కారిడార్‌కు ఒక న్యాయం?...విశాఖ-చెన్నై కారిడార్ కో న్యాయం? ఇది బీజేపీ యూ టర్న్ కాదా?, థొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి...అమరావతికి అన్యాయం చేయడం యూ టర్న్ కాదా?’ అంటూ సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.