కడపలో స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకుంది. మరో పక్క దీక్షకు దిగిన ఎంపీ సీఎం రమేస్, బీటెక్ రవి ఆరోగ్యం విషమిస్తోంది. గత వారం రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఇరువురి షుగర్ లెవల్స్ తగ్గుతున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతోనూ రమేష్, బీటెక్ రవి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అయితే స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం దిగివచ్చే వరకు దీక్ష విరమించబోమని సీఎం రమేష్ స్పష్టం చేశారు. వీరి దీక్షలకు మద్దతుగా రేపురాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. మరో వైపు రాష్ట్రం నలుమూలల నుంచీ రమేష్, బీటెక్ రవిల దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తూ పెద్ద సంఖ్యలో జనం దీక్షా శిబిరం వద్దకు చేరుకుంటున్నారు.
అయితే వీరి దీక్ష పై అటు కేంద్రం, గవర్నర్ ద్వారా ఆరా తీస్తుంది. ముందుగా ఈ దీక్షకు పెద్దగా ప్రజల్లో మద్దతు లేకపోయినా, రోజులు గడుస్తున్న కొద్దీ, వీరు చిత్తశుద్ధితో ఉన్నారనే అభిప్రాయంతో, ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఇదే విషయం గవర్నర్ కేంద్రానికి చెప్పినట్టు తెలుస్తుంది. రమేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నా, రవి ఆరోగ్యం మాత్రం ఆందోళనగా ఉందని, ఆయన షుగర్ పేషెంట్ కావటంతో చాలా జాగ్రత్తగా ఉండాలని, జరగరానిది ఏమైనా జరిగితే ఇబ్బంది అని గవర్నర్ చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో వీరి దీక్షకు ఎంత తొందరగా ముగింపు పలికితే అంత మంచిది అని, అవసరం అయితే సెంట్రల్ ఫోర్సు రంగంలోకి దించి దీక్ష భగ్నం చెయ్యమని, కేంద్రం, గవర్నర్ కు చెప్పినట్టు తెలుస్తుంది.
అయితే, అన్నీ గమనిస్తున్న చంద్రబాబు, పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసరంగా కడపకు వెళ్లాలని మంత్రి గంటా శ్రీనివాస్ ను చంద్రబాబునాయుడు ఆదేశించారు. వీరి దీక్షలు ముగిసేవరకూ కడపలోనే ఉండాలని కూడా గంటాను చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. దీక్ష చేస్తున్న ఇద్దరితో చర్చించి, అలాగే డాక్టర్ ల సూచనలు తీసుకుని, వారు ఆసుపత్రికి వెళ్లేలా చూడాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. ప్రాణం కంటే విలువైనది ఏది లేదని, ఒత్తిడి తేవటం కోసం దీక్ష చేసాం, దేశంలో అన్ని పార్టీలు గుర్తించాయి, కేంద్రం పై వివిధ మార్గాల్లో ఒత్తిడి తీసుకువద్దాం అంటూ చంద్రబాబు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 8 రోజులు అయ్యింది అని, ఇక ఆరోగ్యం సహకరించే అవకాసం ఉండదని, ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, చెప్పినట్టు సమాచారం. సీఎం ఆదేశాలను అందుకున్న మంత్రి గంటా, ఈ ఉదయం కడపకు బయలుదేరారు.