ఏషియన్ పెయింట్స్, మన రాష్ట్రానికి గుడ్ న్యూస్ వినిపించింది. వాటర్ బేస్డ్ పెయింట్ల ఉత్పత్తి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దగ్గర ఏర్పాటు చేసే ప్లాంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అందు బాటులోకి రానుందని ఏషియన్ పెయింట్స్ వెల్లడించింది. రూ.1,785 కోట్ల పెట్టుబడితో ఏటా ఐదు లక్షల కిలో లీటర్ల వార్షిక ఉత్పత్తి సామ్ధ్యంతో కంపెనీ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. రూ.2,300 కోట్ల పెట్టుబడితో మైసూర్ దగ్గర ఆరు లక్షల కిలో లీటర్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే యూనిట్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే పూర్తవుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెబిఎస్ ఆనంద్ వెల్లడించారు. అయితే తొలి దశలో ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం మూడు లక్షల కిలో లీటర్లు మాత్రమే. కరెన్సీ మారకం సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మార్కెట్లు పెద్దగా కలిసి రాలేదని కంపెనీ పేర్కొంది.
ముఖ్యంగా ఈ రెండు సమస్యలతో ఈజిప్టు, ఇథోపియా, శ్రీలంక దేశాల్లో సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపింది. పెద్దగా అమ్మకాలు లేకపోవడంతో కరేబియన్ దేశాల మార్కెట్ నుంచి కంపెనీ పూర్తిగా తప్పుకుంది. మరో పక్క, నెల్లూరులో ప్రభుత్వ రంగ సంస్థ నాల్కోతో కలిసి ఏర్పాటు చేయనున్నఅల్యూమినియం అల్లాయ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవివరమైన నివేదిక ఆరు నెలల్లో సిద్ధం కానుందని ప్రభుత్వ రంగంలోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ) వెల్లడించింది. ప్రతిపాదిత ప్లాంట్‌కు సంబంధించిన కసరత్తు అంతా కొలిక్కి వచ్చిందని, రానున్న కొద్ది నెలల్లో ప్రాజెక్ట్ నివేదిక రెడీ కానుందని మిధానీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్ లిఖి తెలిపారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న మిధానీ..స్పెషల్ స్టీల్, సూపర్ అల్లాయ్స్, టైటాటియం అల్లాయ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ప్రత్యేకమైన మెటల్స్‌లో భారత్ ఎవరిపై ఆధారపడకుండా ఉండేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మిధానీ చిన్న కంపెనీ అయినప్పటికీ భారీ లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే కీలకమైన ఉత్పత్తులకు సంబంధించి పలు ప్రభుత్వ రంగ సంస్థలతో జట్టు కట్టినట్లు దినేశ్ తెలిపారు. నాల్కోతో కలిసి నెల్లూరులో అల్యూమినియం అల్లాయ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవగా మరొక ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్‌తో కలిసి వియత్నాంలోని టంగ్స్టన్ గనిలో మైనారిటీ వాటాను చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వియత్నాంతో పాటు మరికొన్ని స్నేహపూర్వక దేశాల్లో ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.