కడప స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిననిరవధిక దీక్షఆరో రోజుకు చేరుకుంది. కాగా గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నరమేష్, బీటెక్ రవిల ఆరోగ్యం క్షీణించింది. సుగర్ లెవెల్స్ పడిపోయాయి. వైద్యులు సూచించినా వారు వైద్య చికిత్సకునిరాకరిస్తున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యే వరకు తమ దీక్షను మాత్రం ఆపేదే లేదని ఈ ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆదివారం వీరిని పరీక్షించిన వైద్యులు రమేశ్, రవి ఇద్దరూ బరువు తగ్గారని...చాలా నీరసంగా ఉన్నారని...షుగర్ లెవల్స్, బీపీ పడిపోయాయని తెలిపారు. మరోవైపు దీక్షతో వీరి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మరో పక్క, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి గవర్నర్ నరసింహన్ కొద్ది సేపటి క్రితం ఫోన్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్షకు దిగిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి పై నరసింహన్ వాకబు చేశారని సీఎం కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించకముందే ఆసుపత్రికి తరలించాలని గవర్నర్ సూచించినట్టు సమాచారం. ఈ విషయంలో వైద్యుల బృందం ఇచ్చే రిపోర్టునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు నరసింహన్ సూచించారు.
కాగా, తాను కూడా నిత్యమూ వారి ఆరోగ్యం గురించి అధికారులతో మాట్లాడుతున్నానని, వారి దీక్షకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని, ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం కడప వాసుల కలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో, కేంద్రంతో మాట్లడండి అంటూ గవర్నర్ కు, చంద్రబాబు చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమ పై, కేంద్రం కావాలని ఆలస్యం చేస్తుందని, మీరు కేంద్రంతో మాట్లాడి, ఇక్కడ జరుగుతున్న ఆందోళనలు,కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రబాబు కోరారు. అయితే గవర్నర్ మాత్రం, ఇది నా చేతిలో లేదని చెప్పినట్టు తెలుస్తుంది.