ఇప్పటికే స్కూల్స్ ప్రారంభం అయ్యాయి.. కాని, ఆ గవర్నమెంట్ స్కూల్ లో మాత్రం, ఇప్పటికీ దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రవేశం కోసం రోజంతా పాఠశాల ప్రాంగణంలో పడిగాపులు పడుతున్నారు. ‘బాబ్బాబు.. ఒక్క సీటూ..’ అన్న విజ్ఞప్తులు, ‘మాకు తెలిసిన ఫ్యామిలీ అది. కాస్త చేసి పెట్టండి’ అన్న రికమండేషన్ ఫోన్లతో రోజంతా హడావుడిగానే ఉంటుంది. ఇంతా చేసి ఈ స్కూలు ఏదో ప్రైవేటు లేక కార్పొరేట్ స్కూలు కాదు. అదొక ప్రభుత్వ బడి. అయితే, కార్పొరేటును తలదన్నేలా సిద్ధమవుతుండటం, అదేస్థాయిలో టీచర్లు వినూత్న ప్రచారం చేపట్టడమే ఇప్పుడు ఈ స్కూలుకు డిమాండ్‌ను పెంచేసింది.
ప్రకాశం జిల్లా చీరాలలోని కొత్తపేటలో ప్రస్తుతం ఈ స్కూలు నిర్మాణంలో ఉంది. ఈ నెల 19వ తేదీన ఒకమేరకు నిర్మాణ పనులను పూర్తిచేసుకొని క్లాసులు జరుపుకోవడానికి సిద్ధమైంది. ‘మా దగ్గర సీట్లు అయిపోయాయి. ఇక రావద్దు’ అని చెబుతున్నా, ఈ జెడ్పీ స్కూలుకు పోటెత్తె తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 1000 మంది ప్రవేశాలకు అవకాశం ఉండగా, ఇప్పటికే 1500 దరఖాస్తులు వచ్చాయట! ఇంతలా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న విషయం ఏమిటీ? ఎకరా 20 సెంట్లలో దాదాపు రూ.రెండు కోట్ల వ్యయంతో ఈ నూతన పాఠశాల సిద్ధమవుతోంది. పదిరకాల క్రీడలను ఒకేసారి నిర్వహించగలిగినంత విశాలమైన మైదానాన్ని, కోర్టులను సిద్ధం చేస్తున్నారు. ఆరు లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో బోధించనున్నారు.
ఇక్కడి డైనింగ్ హాల్లో ఒకేసారి 450మంది పిల్లలు భోజనం చేయొచ్చు. దూర ప్రాంతాలనుంచి వచ్చే వారికి ఉచిత రవాణా. విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందించనున్నారు. అంటే ఈ స్కూలులో అడ్మిషన్ పొందితే చాలు, ఏ సౌకర్యం, వసతికి విద్యార్థులు వెతుక్కోనక్కర్లేదు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన కుమారుడికి ఎనిమిదో తరగతి కోసం ఈ స్కూలులో అడ్మిషన్ తీసుకోవడం మరో విశేషం. కొత్తపేటలోని యూపీ స్కూళ్లను అప్‌గ్రేడ్ చేసి అన్ని హంగులతో హైస్కూలును ఏర్పాటుచేస్తే బాగుంటుందని అనుకొన్నారు. ఈ ఆలోచన చేసిన వారంలోపే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత ఏప్రిల్ 26వ తేదీన పనులు మొదలయ్యాయి. ఈ విషయంలో టీచర్లు పూర్తిగా సహకరించారు. మరోవైపు, మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, కలెక్టర్ వినయ్‌చంద్, డీఈవో సుబ్బారావు అన్నివిధాల కలిసివచ్చారు. దాతలూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.