సొంత పార్టీ నేతలే మంత్రి పదవి ఇవ్వకపోతే, నాయకుడుని దుమ్మెత్తి పోసే రోజులు ఇవి... అలాంటిది, చంద్రబాబు నిర్ణయం వల్ల, తమ మంత్రి పదువులు కూడా పోయినా, వారు మాత్రం వెళ్తూ వెళ్తూ చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో చెప్పి వెళ్లారు... అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన భాజాపా నేతలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఎపి బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు తదనంతరం శాసనసభలో తమ రాజీనామాల విషయమై మాట్లాడారు.
సీఎం చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బాబు లాంటి నాయకులుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను మంత్రిగా సఫలం అయ్యాయని చెప్పారు. తాను మంచి స్నేహితులను సంపాదించుకున్నానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేశారని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి వెంకయ్యనాయుడు, బీజేపీ నాయకత్వం కారణమన్నారు. అలాగే రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు అభివృద్ది పధంలో పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. తన వైద్య శాఖలో కూడా చంద్రబాబు సహకారంతో ఎన్నో సంస్కరణలు చేశానని, తద్వారా దేశంలోనే స్పూర్తి దాయకమైన రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దగలిగామని అన్నారు.
మంత్రిగా అవకాశం ఇచ్చి సహకరించిన చంద్రబాబుకు మంత్రి మాణిక్యాలరావు ధన్యవాదాలు తెలిపారు. రెండు పుష్కరాలు నిర్వహించే అదృష్టం తనకు దక్కిందని, దేవాదాయశాఖలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు. గతంలో స్మార్ట్ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియదని...చంద్రబాబు స్ఫూర్తితో కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నా అని అసెంబ్లీలో మాణిక్యాలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధతకు పోటీ లేదని మంత్రి మాణిక్యాలరావు ప్రశంసలు కురిపించారు. సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే ఏపీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని, పోలవరం ముంపు మండలాలు సాధించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సమర్ధత, కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏపీకి బీజేపీ శత్రువు కాదు.. మిత్రుడే అని మాణిక్యాలరావు తెలిపారు.
మరోవైపు వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ తరపున ఎంపికైన ఇద్దరు మంత్రులు సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. కృష్ణా, గోదావరి పుష్కరాలను మంత్రి మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని, వైద్య ఆరోగ్యశాఖలో కామినేని శ్రీనివాస్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కితాబిచ్చారు. ఓ ముఖ్యమంత్రిగా వారి సమర్థవతమైన సేవలను అభినందిస్తున్నానని బాబు వ్యాఖ్యానించడంతో.. అసెంబ్లీలో కేబినెట్ సహచరులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.