నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన మంగళవారం రెండో రోజుకు చేరింది. దక్షిణ కొరియాలో ఏడున్నరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. దక్షిణకొరియా పారిశ్రామిక నగరం బూసన్ సందర్శనకు సియోల్ నుంచి స్పీడు ట్రైనులో ముఖ్యమంత్రి బృందం బయల్దేరి వెళ్లింది. బూసన్‌లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ‘డైనమిక్ లీడర్’ అని ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి లాంటి అనేక అంశాలలో పరస్పర సహకారం ఆవశ్యకతను వివరించారు.
‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలలోనే ఆ పని పూర్తిచేయడ విశేషమని, ఆయన క్రియాశీలతకు, వేగవంతమైన పనివిధానానికి ఇదే నిదర్శనమని దక్షిణ కొరియాలో భారత రాయబారి ప్రశంసించారు. ‘కియా మోటార్స్’కు కేటాయించిన అభివృద్ధి పనుల విశేషాలపై బిజినెస్ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల సంస్థ లఘుచిత్రాన్ని ప్రదర్శించింది.
బిజినెస్ సెమినార్‌కు హాజరైన వారిని కొరియన్ భాషలో ‘ఆన్ యోంగ్ హో సే’ (Aan Yong ho sei) అంటూ పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించడంతో వారు హర్షధ్వానాలు చేశారు. మళ్లీ కొరియా వచ్చేప్పుడు కొరియన్ భాషలో ఇంతకంటే మెరుగ్గా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పడంతో కరతాళధ్వనులతో స్వాగతించారు. ఇదిలా ఉంటే తర్జుమా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెజెంటేషన్‌ను బిజినెస్ సెమినార్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలకు కొరియన్ భాషలో అందజేయడం విశేషం. కొరియన్ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి వారి భాషలోనే ఏపీ సానుకూలాంశాలను వివరించడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నించారు.