ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పనున్న మెగా సీడ్ పార్కు కార్యకలాపాలలో తమకు సహకరించాలని ‘పయనీర్’ సంస్థ శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. సీడ్ పార్కులో పయనీర్ సంస్థను భాగస్వామిగా చేసే అంశంపై సమన్వయం చేయాల్సిందిగా ఐయోవా అధికారి దిలీప్‌కు బాధ్యతలను అప్పగించారు. దిగుబడులను పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ఉమ్మడి లక్ష్యమని, ఈ దిశగా పరస్పరం సహకరించుకుని ఇరు ప్రాంతాల రైతాంగ శ్రేయస్సుకు పాటుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన రెండోరోజు ఐయోవాలోని జాన్స్టన్ లో ఉన్న ‘పయనీర్’ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ సందర్శనతో ప్రారంభమైంది. ప్రామాణిక విత్తనాల ఉత్పత్తి, మార్కెటింగ్‌లో ప్రాచుర్యం గడించి, 90 దేశాలకు ఉత్పత్తులను పంపిణీ చేస్తున్న ఈ సంస్థ విశ్వకేంద్రంలోని ఆవిష్కరణల విభాగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి శాస్త్రవేత్తలతో సవివరింగా మాట్లాడారు. ఉత్పత్తుల విశేషాలను, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు.తమ పరిశోధక ప్రాజెక్టుల ప్రత్యేకతలను పయనీర్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ బ్రాడ్ లాన్స్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.
ఐయోవాలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి పర్యటించ హార్వెస్టర్ ను స్వయంగా నడిపారు. విత్తనాలు, వాతావరణం, నేల స్వభావం, యాజమాన్య పద్ధతులు తదితర అంశాలు, ఉత్పాదకత పెంపుపై అవి ఎటువంటి ప్రభావం చూపుతాయో ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలో గరిష్టస్థాయిలో వ్యవసాయ దిగుబడుల పెంపుదల కోసం ఆయా అంశాలలో అవలంభించిన అన్ని పద్ధతులను అందిపుచ్చుకునే అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. తొంభై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో తాము సముపార్జించిన అనుభవాన్ని పయనీర్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తాము గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో విస్తృతంగా పనిచేశామని వివరించిన శాస్త్రవేత్తలు. వ్యవసాయ పరిశోధన, మొక్కల జన్యుశాస్త్రం, పరిశోధనా రంగాలలో తమ అధ్యయనాలపై పయనీర్ శాస్త్రవేత్తలు చంద్రబాబుకు వివరించారు.
అధిక నాణ్యమైన మొక్కజొన్న, సోయాబీన్స్, జొన్న, ప్రొద్దుతిరుగుడు, అల్ఫల్ఫా (పశుగ్రాసం), కనోల (కెనాడాలో అభివృద్ధి చేసిన నూనెగింజలు), గోధుమ, బియ్యం, పత్తి, సజ్జలు (పెర్ల్ మిల్లెట్), ఆవపిండి తదితర విత్తనాలు, పశుగ్రాస మూలాలను అభివృద్ధి చేసి పంపిణీ చేస్తున్నట్టు ‘పయనీర్’ శాస్త్రవేత్తల బృందం ముఖ్యమంత్రికి వివరించింది. అక్కడి క్షేత్రాలలో అధునాతన సాంకేతికతను, యంత్ర పరికరాలతో నవీన సేద్యపు విధానాలను అనుసరిస్తున్న తీరును ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పయనీర్ సంస్థ పరిశోధనశాలను సందర్శించారు. మొక్క జన్యుకణంలోని అనువంశిక పదార్ధాన్ని (డీఎన్ఏ) విశ్లేషించే విధానం, జన్యువులను సవరించే పద్ధతులపై ముఖ్యమంత్రి బృందానికి శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రక్రియలు నిర్వహించే తీరును, సంబంధిత పరికరాలపై సందేహాలకు సమాధానాలిచ్చారు. మొక్కల జన్యు అభివృద్ధి, విత్తనాలు, ఉత్పత్తుల సరఫరాదారుగా బహుళ ప్రాచుర్యం పొందిన సంస్థ పయనీర్. 1926 నుంచి ఐయోవా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘పయనీర్’ ఉత్పాదకత, లాభదాయకత, సుస్థిరత అంశాల్లో గణనీయ ఫలితాలు సాధించింది. రైతాంగ విశ్వాసాన్ని చూరగొన్న సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.