నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గడువులోగా పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, మరో 28 ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో ఆయన సోమవారం సమీక్షించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా (గొల్లపల్లి రిజర్వాయర్ పరిధిలో) మడకశిర బ్రాంచి కెనాల్, చిత్తూరు జిల్లా హంద్రీ-నీవా రెండో దశలో భాగమైన అడవిపల్లి ప్రాజెక్టు, కె.ఎల్ రావు పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాన్ని గండికోట సిబిఆర్ లిఫ్టు పనులను నవంబర్‌లోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు జిల్లా సంగం రిజర్వాయర్ పనులను ఈనెలాఖరుకు పూర్తిచేయాలని కోరారు.

గండికోట సిబిఆర్ లిఫ్ట్, కె.ఎల్ రావు పులిచింతల ప్రాజెక్ట్, ఎస్ హెచ్-31 రోడ్ లను నవంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. మడకశిర బ్రాంచి కెనాల్ పనుల్లో రైల్వే క్రాసింగ్ దగ్గర పనులు, పెన్నానది దాకా ఆకృతుల నిర్మాణం క్లిష్టతరమైనదని విడియో కాన్ఫరెన్స్‌లో అనంతపురం జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అడవిపల్లి రిజర్వాయర్ 99% పూర్తయ్యిందని అధికారులు వివరించారు. మరోవైపు అనంతపురం జిల్లా మరాల రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్ ప్రాజక్టులు నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.

పోలవరం పనులకు వర్షంతో అంతరాయం:
ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టులో 3.43 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మట్టి తవ్వకం పనులు 759 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తిచేశారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ రమేష్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ లైవ్‌లో మాట్లాడారు. వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతోందని ఆయన వివరించారు.

జలసిరికి హారతి తర్వాత 810 టీఎంసీల జలాలు:
రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ప్రజల్లో జల చైతన్య కార్యక్రమంగా నిర్వహించిన ‘జలసిరికి హారతి’ ప్రభావాన్ని చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రవ్యాప్త ఆడిట్ చేశాక 810 టీఎంసీల జలాలు వచ్చాయని తేలిందని, గత ఆరునెలల్లో నిల్వచేసిన నీటిలో ఇది 56%తో సమానమని ఆయన చెప్పారు. జలసిరికి హారతి తర్వాత ప్రాజెక్టులు సహా అనేక చెరువులు నిండాయని అధికారులు ‘జలశోభ’ అనే పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రియల్ టైమ్ వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు పడటంతో రబీసాగుకు రాష్ట్రమంతా పరిస్థితి ఆశాజనకంగా మారిందని చంద్రబాబు అన్నారు.

వర్షాల వల్ల వచ్చిన ఉపరితల జలాలను భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. వర్షాల ప్రభావం ఎలా ఉందో పరిశీలించాలని సూచించారు జలవనరుల శాఖ పనుల ప్రస్తుత స్థితిగతులపై www.apwrims.ap.gov.in కు లాగిన్ అయి వివరాలు పొందవచ్చన్నారు. నిన్నటిదాకా ఇన్ ఫ్లో 4,390 టీఎంసీలు ఉంటే అదంతా వర్షపాతం వల్ల, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వరద నీటి వల్లేనని ఆడిట్ నివేదికలో వివరించారు. రాష్ట్రంలో 600 మి.మి వర్షపాతం నమోదైందని, ఇప్పుడు మొబైల్ ఇరిగేషన్‌కు అనువుగా చెరువులు నిండాయని, 13 జిల్లాలలో 9 జల్లాల్లో గత ఏడాదికంటే బాగా వర్షాలు పడ్డాయని నివేదిక పేర్కొంది. జలసంరక్షణను మరింత సమర్ధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వర్షాలు కొంతకాలం వెనుకపట్టు పట్టి ఆకస్మికంగా కరవు ఏర్పడితే పరిస్థితిని ఎదుర్కోవడానికి జలసంరక్షణ, నీటి యాజమాన్య నిర్వహణతో సంసిద్ధంగా ఉండడాలని ముఖ్యమంత్రి అధికారులకు పిలుపునిచ్చారు.

విద్యార్థులపై తీవ్ర వత్తిడి చూపి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తున్న ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానంలో అవసరమైన మార్పులు తీసుకువచ్చేలా తగు సూచనలిచ్చేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూనే విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే విద్యావిధానాలను ప్రవేశపెట్టడానికి ఈ కమిటీ అవసరమైన సూచనలు, సిఫారసులు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు పలువురు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు.

ఇటీవలి విద్యార్థుల ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికిగల కారణాలను విశ్లేషించి తగు నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులను పిలిపించి సోమవారం వారితో ప్రత్యేకంగా సమావేశం జరిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.మార్కులు, గ్రేడ్ల కోసం ఆరాటపడుతూ విద్యార్థులలలో మానసిక ప్రశాంతతను దూరం చేసి తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్న ‘బట్టీ’ విధానాలను విడనాడాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులను హెచ్చరించారు.

‘ఏపీని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దాలనుకున్నాను కానీ, విద్యార్థులను ఒఠ్ఠి మరమనుషులుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించను’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సంఖ్యను పెంచి వేలాదిమంది వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకున్నది నేనే, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌ను విద్యా, వైజ్ఞానిక గమస్థానంగా మార్చాలని అనుకుంటున్నాను. అందులోభాగంగానే ప్రపంచశ్రేణి విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకువస్తున్నాను. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వీటన్నింటినీ ఏర్పాటు చేయాలన్నదే నా సంకల్పం. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నంత మాత్రాన కార్పొరేట్ కళాశాలలు తమ ఇష్టానుసారం నడుచుకుంటే ప్రభుత్వం ఊరుకుంటుందని అనుకోవద్దు. మీకు స్వీయ నియంత్రణ ఉండాలి. మీ విధానాలు, పద్దతులు మార్చుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలి. వారి పట్ల మీ వ్యవహారశైలిలో ఈ క్షణం నుంచే నాకు మార్పులు కనిపించాలి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఈ మార్పును తీసుకువచ్చే ప్రయత్నాలు ఆరంభం కాకపోతే కఠినచర్యలకు వెనకాడబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రజలకు ఈ మార్పు స్పష్టంగా కనిపించి వాళ్లల్లో సంతృప్తి వ్యక్తమయ్యేవరకు వదిలిపెట్టనని చెప్పారు. ఈ విషయంలో ఎంతటి వారైనా, ఎవరైనా సరే ఉపేక్షించబోనని అన్నారు.

పరిపాలనలో పారదర్శకత పెంచి ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నామని, ఆ సాంకేతికత తప్పుదారి పడితే ఉత్పాతాలు, ఉపద్రవాలు తప్పవని ముఖ్యమంత్రి చెప్పారు. సాంకేతిక ఉపకరణాలకు మనిషి బానిసగా మారడమే అన్నింటికంటే దౌర్భాగ్యమని అన్నారు. ‘మీరు విద్యార్థుల్ని మరబొమ్మలుగా భావిస్తున్నారు. మనుషులకు, మిషన్లకు తేడా ఉంది. మిషన్ అనేది మనిషి తన సౌలభ్యం కోసం తాను తయారు చేసుకున్న ఇన్నోవేషన్. దాన్ని నడిపించేది కూడా మనిషే. ఆ విషయాన్ని మరచిపోయి మీరు విద్యార్థుల్ని మిషన్‌గా మార్చేస్తున్నారు. అతిగా చేస్తే అనర్ధం తప్పదు. ఆహారం కూడా అతిగా తింటే అనారోగ్యం వస్తుంది. విద్యావిధానం జ్ఞానాన్ని అందించేలా ఉండాలి కానీ, విద్యార్థి తన సృజన కోల్పోయేలా చేయరాదు. ఏదైనా హద్దు మీరితే ప్రమాదం’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని సంతోష సూచికను తీసుకువచ్చామని చెబుతూ, దీనికి విరుద్ధంగా భావిభారత పౌరులను ఆనందానికి దూరం చేసే విధానాలతో వారిలో వత్తిడి పెంచడం భావ్యం కాదని అన్నారు.

ఇకనుంచి విద్యార్థుల సామాజిక సేవ (సోషల్ వర్క్)కు 5 శాతం మార్కులు తప్పనిసరి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. ఫిజికల్ లిటరసీ ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు, కళాశాలల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్ని ప్రకృతితో మమేకం చేయడం, జల వనరుల పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛాంధ్ర దిశగా నడిపించడం తప్పనిసరి చేస్తున్నామన్నారు. వీటిని ఒక ప్రాజెక్టుగా తీసుకుని వాటికోసం కృషి చేసే విద్యార్థులను మార్కులిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న కమిటీ ఈ అంశాలను మరింత సమర్ధంగా అమలు చేసేలా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నెలకు ఒకసారి ఈ కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో సమీక్ష చేస్తానని చెప్పారు. సమావేశంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ నండూరి సాంబశివరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ఉన్నత విద్యా కార్యదర్శి శ్రీమతి ఉదయలక్ష్మి పాల్గొన్నారు.

ఒక పక్క కాంట్రాక్టర్ నాటకాలు.. ఇంకో పక్క కేంద్రం కాంట్రాక్టర్ ను మార్చేది లేదు అని తెగేసి చెప్పటంతో, ఇప్పుడు చంద్రబాబు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు... పోలవరం ప్రాజెక్టు విషయంలో, కాంట్రాక్టరును మార్చే ప్రసక్తే లేదు అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పటంతో, చంద్రబాబు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు...

షడ్యుల్ లో లేకపోయినా, హుటాహుటిన నాగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు... నిజానికి వైజాగ్ వెళ్లి, తరువాత 10 రోజులు విదేశీ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు ముఖ్యమంత్రి... అయితే, 10 రోజులు దాకా ఈ విషయం వదిలేస్తే కుదరదు అని, విశాఖ పర్యటన కుదించుకుని, నితిన్ గడ్కరీని కలవటానికి, నాగపూర్ వెళ్లనున్నారు..

పోలవరం విషయంలో ఉన్న సాధకబాధకాలు, కాంట్రాక్టరు వల్ల కలుగుతున్న ఇబ్బందులు నివేదించి, కాంట్రాక్టర్ ను మార్చడానికి ఒప్పించి నాగపూర్ నుంచే అమెరికా పర్యటనకు వెళ్లేలా తన షెడ్యూలును అర్జంటుగా మార్చుకున్నారు.

తెలుగుదేశాన్ని ప్రజలు మళ్లీ గెలిపిస్తేనే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సెప్టెంబరు 11న ప్రారంభించిన కార్యక్రమాన్ని 75 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైన చోట 10,15 రోజులు పొడిగిస్తామని తెలిపారు. ఆయన సోమవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇంటింటికీ తెలుగుదేశం కోసం కొత్తగా రూపొందించిన ఐదు పాటలు, ఇదివరకే ప్రాచుర్యం పొందిన పార్టీ గీతాలు మరో మూడు కలిపి సిద్ధం చేసిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... ఇక్కడ మన పాట్లేవో మనం పడుతుంటే రాష్ట్రంలోనే ఉండనివాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయిందని, మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని, ఇంతవరకు రాష్ట్రానికే రానివాళ్లు రాజకీయం ఎలా చేస్తారని వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్‌ మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చి వెంటనే వెళ్లిపోయారని విలేకరులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో తెదేపానే శాశ్వతంగా ఉంటుందన్నారు.

60 లక్షల కుటుంబాలను కలిశారు..
ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా పార్టీ నాయకులు 60 లక్షల కుటుంబాలను కలిశారని, 45,79,228 ఇళ్లను జియోట్యాగింగ్‌ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఇలా చేయలేదని, ఇది చరిత్రని వివరించారు. ఇంతవరకు ప్రజల నుంచి 20,90,484 వినతులు వచ్చాయని, వాటిలో 19,18,726 వ్యక్తిగత, 1,71,758 సామాజిక సమస్యలున్నాయని చెప్పారు. అత్యధికంగా పురపాలక శాఖకు సంబంధించి 4.71 లక్షల వినతులు వచ్చాయన్నారు. వాటన్నిటినీ ఆన్‌లైన్‌లో ఎక్కించామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించి నిర్వహణ కోసం 16,723 మందికి శిక్షణనిచ్చామని తెలిపారు. మొత్తం 1.39 కోట్ల కుటుంబాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తామన్నారు. వైకాపా మద్దతుదారుల ఇళ్లకు కూడా వెళతారా? అన్న ప్రశ్నకు అందరూ రాష్ట్ర ప్రజలేనని, అందరి సమస్యలు పరిష్కరించడమే తమ ఉద్దేశమని, 80 శాతం ప్రజలు తెదేపాతో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని బదులిచ్చారు.

ఎవరెలా పనిచేస్తున్నారో తెలుస్తుంది..!
‘ఇంటింటికీ తెలుగుదేశం వల్ల పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ బాధ్యులు, ఇతర నాయకుల్లో ఎవరు ఎలా పనిచేశారో నాకూ తెలుస్తుంది. దాన్ని బట్టి దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెదేపా బలంగా ఉండాలి. అన్ని చోట్లా గెలవాలి. పార్టీ నాయకులు ఇదివరకులా తిరగకుండా తిరిగామని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఇంటికీ వెళ్లి జియోట్యాగింగ్‌ చేయాల్సిందే. అధికారులు, నాయకుల పట్ల ఇదివరకున్న వ్యతిరేక భావన పోయింది. వారంటే గౌరవం పెరిగింది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సర్దుబాట్లు తప్పవు..
పోలవరం గుత్తేదారును మారిస్తే నిధులివ్వబోమని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నట్టు వచ్చిన వార్తల గురించి విలేకరులు ప్రస్తావించగా...‘పోలవరం 2019కి పూర్తి కావాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. గుత్తేదారుకు గిట్టుబాటు కానప్పుడు మనం కొట్టినా పని చేయలేడు. చేస్తున్న పనులకు ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు’ అని తెలిపారు. డబ్బుల్లేక మట్టి పనులు కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు ఆకృతులు ఖరారుచేసేందుకు అమెరికా, యూఏఈ, లండన్‌ పర్యటనకు వెళుతున్నట్టు చెప్పారు. తెదేపా బీసీలకు ద్రోహం చేసిందంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన విమర్శలను ప్రస్తావించగా వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా బీసీలను అణగదొక్కారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక కార్యక్రమాలు చేశామని, బీసీలు మొదటినుంచీ తెదేపాకు వెన్నెముకగా నిలిచారని తెలిపారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చామని.. కమిటీని ఏర్పాటుచేశామని, నెలలో మళ్లీ తాను సమీక్షిస్తానని తెలిపారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో ఎప్పుడు చేరుతున్నారన్న ప్రశ్నకు.. చేరినప్పుడు చెబుతామని బదులిచ్చారు. వైకాపా నుంచి ఇంకా ఎవరెవరు వస్తున్నారన్న ప్రశ్నకు ఆ జాబితా గురించి ఆ పార్టీ నాయకుల్నే అడగాలని స్పందించారు.

Advertisements

Latest Articles

Most Read