పట్టిసీమ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి మూడేళ్లుగా కృష్ణా డెల్టాకు కరవు రాకుండా కాపాడిన విషయాన్ని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ సమీక్షలో ప్రస్తావించారు. నార్లు పోసుకోవాలని రైతాంగానికి పిలుపునిచ్చామని, జూన్ నెలాఖరుకే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా డెల్టా కర్షకులకు భరోసా ఇచ్చామని గుర్తు చేశారు.
ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటి కోసం ఎదురు చూడటం వల్ల ఏటా ఒక పంట నష్టపోయిన చేదు అనుభవాలు, పంటలు పండినా నవంబరులో తుఫానులతో దెబ్బతిన్న పీడకలలున్నాయని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలతో ఈ సమస్యలు అధిగమించామని చెప్పారు.ఆక్వా రంగంలో యాంటీ బయోటిక్స్ వాడటంతో సమస్యలు వస్తున్నాయని, వాతావరణ కాలుష్యం లేకుండా చేయాలని, రాష్ట్రాన్ని ఆక్వాహబ్ గా తీర్చిదిద్దేందుకు విశ్వవ్యాప్తంగా ఉన్న మేలిమి పద్ధతులను రాష్ట్రానికి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇస్రో సేవలను వినియోగించుకోవాలి
వర్ష సూచనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అందిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీలో పైర్లు వేసిన 98% భూమిని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జియో ట్యాంగింగ్ చేయడం విశేషమని ముఖ్యమంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌లో 76% మాత్రమే జియో ట్యాంగింగ్ చేయగలిగామని చెప్పారు. సాంకేతికతను ఎలా ఉపయోగించుకుంటున్నారు? ప్రభావం ఏమిటి? ఏ మేరకు దిగుబడులు ఆశిస్తున్నారు? ఎంత ఉత్పాదకత ఉంటుంది? పైర్లు ఎటువంటి చీడపీడలు లేకుండా పచ్చగా ఉన్నాయా? అనే అంశాల నిర్ధారణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అందిస్తున్న సమాచారాన్ని సమర్ధంగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలను అనుసరించి పంటల దిగుబడి ఉంటుందని వివరించారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల ప్రభావం వాస్తవికంగా ఎంత ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవటం మీద రైతాంగానికి అవగాహన కలిగించాలని చెప్పారు.
తరచూ కరవు బారినపడే ప్రాంతాలలో సురక్షిత నీటి ద్వారా సస్య రక్షణకు సదుపాయం ఏర్పాటుచేశామని, తేమ ఇంకిపోయిన 810 ఎకరాల్లో రెయిన్ గన్స్ వినియోగించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరువందల సెన్సర్ల సహాయంతో పక్కా ప్రణాళికతో 15 సంస్థలు ఇందులో పాల్గొన్నాయని అధికారులు ఆయనకు వివరించారు. పంటలు ఎండిన జిల్లాలలో రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలో సత్వరం మళ్లీ సేద్యానికి నూరు శాతం రాయితీతో విత్తనాలు ఇస్తున్నామని, 1.4 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయడానికి ఆగస్టులో ఉత్తర్వులు జారీచేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే 20% అధికంగా నమోదయ్యిందని, మిగిలిన జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదయ్యిందని చెప్పారు. ఖరీఫ్ సాగు విస్తీర్ణ లక్ష్యం 42.07 లక్షల హెక్టార్లు కాగా, 40.47 లక్షల హెక్టార్లలో పైర్లు వేశారని, తద్వారా 89% లక్ష్యాన్ని సాధించామని, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలలో వరుసగా 100%,101% భూమిలో పంట వేశారని ముఖ్యమంత్రి తెలిపారు.
ఖరీఫ్‌లో సాగుకాని భూమిని రబీలో కచ్చితంగా సాగులోకి తేవాలని, రబీకి సాగు నీటి కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటువంటి భూమిని వ్యవసాయ అనుబంధ రంగమైన ఉద్యాన రంగాన్ని, సామాజిక వనాల ప్రోత్సాహానికి కేటాయిస్తున్నామన్నారు. ఉద్యానానికి, సామాజిక వనాలకు 0.20 లక్షల హెక్టార్లు, చేపల చెరువులకు 0.25 లక్షల హెక్టార్లు, పోలవరం ప్రాజెక్టుకు 0.04 లక్షల హెక్టార్లు మళ్లించినట్లు తెలిపారు.
సబ్సిడీ మీద ఈ ఏడాది పంపిణీ చేసిన విత్తనాలు గత ఏడాదికంటే స్వల్పంగా తక్కువ అని, పొడి వాతావరణం, జూన్,జూలై మాసాల్లో తక్కుం వర్షపాతం నమోదుకావడం ఇందుకు కారణమన్నారు. అందువల్ల వేరుశనగ, వరి, పప్పుధాన్యాల పంటల సాగు విస్తీర్ణం తగ్గిందని వివరించారు. రాయితీపై విత్తన సరఫరా లక్ష్యం 11.58 లక్షల క్వింటాళ్లు కాగా, 6.86 లక్షల క్వింటాళ్లను పంపిణీ చేశామన్నారు.
భూసార పరిరక్షణతో అధికోత్పత్తి
అధిక దిగుబడులను సాధించి రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు భూసార పరీక్ష, సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం మూడేళ్ల క్రితమే ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. భూసార పరీక్షల వల్ల ఏఏ సూక్ష పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలకు అవకాశం ఉందని, పంటదిగుబడి తగ్గకుండా, రైతు నష్టపోకుండా సూక్ష్మపోషకాలు తోడ్పడతాయని చంద్రబాబు తెలిపారు. సూక్ష్మ పోషకాల పంపిణీ గత ఖరీఫ్ సీజన్ కంటే ఈ ఏడాది 22% ఎక్కువ అని చెబుతూ ఈ అంశంలో నిర్దేశిత లక్ష్యసాధనకంటే అత్యధికమని చెప్పారు. 7.42 లక్షల హెక్టార్లలో భూసార పరీక్షలు చేయించి ఆధార్ అనుసంధానంతో 71,447 మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలను పంపిణీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. వ్యవసాయ యంత్రీకరణను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.