టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన, ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ల మధ్య సాగుతుంది. నిన్న నారా లోకేష్ నరసరావుపేట పర్యటన అని చెప్పగానే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మీడియా సమావేశం పెట్టి, లోకేష్ ని రానివ్వం అని అన్నారు. సాయంత్రం గుంటూరు ఎస్పీ, డిఐజి ప్రెస్ మీట్ పెట్టి, లోకేష్ పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి వరుస పెట్టి టిడిపి నేతలను అరెస్ట్ చేసారు. వందల మంది పోలీసులను పెట్టి అరెస్ట్ లు చేసారు. అయితే ఈ రోజు లోకేష్ గన్నవరం లో ల్యాండ్ అవ్వగానే, ఆయన వాహనంలో ఎక్కించి, పోలీసులు అటూ ఇటూ వాహనాలు పెట్టి, తరలిస్తున్నారు. అయితే ముందుగా ఆయన్ని గుడివాడ దగ్గర ఉన్న నందివాడకు తీసుకుని వెళ్తారని సమాచారం ఇచ్చారు. వెంటనే మళ్ళీ విజయవాడ వైపు కాన్వాయ్ ని తిప్పారు. ప్రస్తుతం, లోకేష్ ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో చెప్పటం లేదు. ఉండవల్లిలో ఇంటికి తీసుకుని వెళ్తారా, లేక పార్టీ ఆఫీస్ కు పంపిస్తారా, లేదా పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత, పోలీసులు ఆయన్ను చుట్టుముట్టి, మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళటానికి వీలు లేదు, అని చెప్పిన సందర్భంలో లోకేష్ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది.
లోకేష్ పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ, తనని ఎందుకు ఆపుతున్నారు అని అడిగారు. దానికి పోలీస్ వారు, మీకు పర్మిషన్ లేదు అని చెప్పారు. అయితే దానికి లోకేష్ తీవ్రంగా స్పందించారు. నేను మీకు అసలు అనుమతే అడగలేదు, మీరు పర్మిషన్ రద్దు చేయటం ఏమిటి అని అడిగారు. తాను ఒక కుటుంబాన్ని పరామర్శ చేయాలి అంటే, పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. తన రాజ్యాంగ హక్కుని కాలరాసే అధికారం మీకు లేదని అన్నారు. తాను ఏమి ధర్నాలు, ఆందోళనలు చేయటానికి వెళ్ళటం లేదని, కేవలం ఒక కుటుంబాన్ని పరామర్శ చేయటానికి వస్తున్నా అని అన్నారు. తానేమి మీ ముఖ్యమంత్రి లాగా కొట్టండి, కాలర్ పట్టుకోండి అని చెప్పలేదని అన్నారు. తనకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుసని, ఎక్కడా నేను నిబంధనలు ఉల్లంఘించలేదని అన్నారు. ఎక్కడ లేని సమస్య గుంటూరులోనే ఎందుకు ఉందొ అని అన్నారు. గుంటూరు ఎస్పీ అంత చేతకాని వాడా అని ప్రశ్నించారు. మరి లోకేష్ పర్యటన జరుగుతుందో లేదో చూడాలి.