నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, తనదైన శైలిలో ముందుకు పోతూనే ఉన్నారు. సొంత పార్టీ నేత అయినా, రాష్ట్రం కోసం, అలాగే తన పార్టీ కోసం అంటూనే, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, అలాగే పార్టీలో కొంత మంది చేసిన నష్టాన్ని, ప్రజలకు వివరిస్తూ, కొన్ని సమస్యల పై న్యాయ పోరాటం కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే రెండు నెలల క్రిందట, సిబిఐ కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి కండీషనల్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, ఆయన సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై అనేక నాటకీయ పరిణామాలు మధ్య సిబిఐ కోర్టులో విచారణ పూర్తయ్యింది. విచారణ అనంతరం, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశం పై, కోర్టు ఈ నెల 25 వ తేదీన తమ అభిప్రాయం చెప్పనుంది. కోర్టు తీర్పు పై అందరికీ ఆసక్తి నేలకుంది. అయితే ఇందులో ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమి లేకపోయినా, ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు, ఈ పరిణామాలు అన్నీ చిరాకు తెప్పిస్తాయి, అలాగే ఆయన ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ప్రజలు మరచిపోతున్న అంశాలు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండటంతో, ఆయనకు ఇబ్బంది అనే చెప్పాలి. దీంతోనే రఘురామరాజు వైసీపీని డ్యామేజ్ చేస్తున్నారు అనుకుంటే, ఇప్పుడు ఆయన మరో బాంబు పేల్చారు.
ఈ సారి రఘురామరాజు , విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారు. విజయసాయి రెడ్డి కండీషనల్ బెయిల్ కూడా రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. విజయసాయి రెడ్డి ఎంపీగా ఉంటూ, కేంద్రం హోం శాఖలో, అలాగే ఆర్ధిక శాఖ కార్యాలయాల్లో అధికారులను తరుచూ కలుస్తూ, తనకు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే విధంగా చిత్రీకరణ చేసి, కేసులో సాక్ష్యులను బెదిరిస్తున్నారని, ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వారిని ప్రభావితం చేస్తున్నారని పిటీషన్ లో తెలిపారు. విజయసాయి రెడ్డి ఎంపీ అవ్వగానే, తన పదవిని అడ్డం పెట్టుకుని, తన కేసులు విచారణ చేస్తున్న సిబిఐ జేడీని పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి లేఖలు రాసారని, ఇది విచారణకు విఘాతం కలిగించిందని అన్నారు. అలాగే అతనికి న్యాయస్థానాల పట్ల గౌరవం లేదని, మాన్సాస్ విషయంలో కోర్టు జడ్జిమెంట్ ఇస్తే, దొడ్డి దారిన ఉత్తర్వులు తెచ్చుకున్నారు అంటూ కోర్టులను అగౌరవ పరిచారు అంటూ తన పిటీషన్ లో పేర్కొన్నారు. మరి కోర్టు ఈ పిటీషన్ పై ఏమంటుందో చూడాలి.