రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు వివిధ రాజకీయ పార్టీలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొనగా, బీజేపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారు. ఈ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, బీజేపీ దొందూ దొందే అని ప్రజలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో జగన్ ఫొటోలు తీసుకోవడం చూసి వైసీపీ, బీజేపీ ఒకటే అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. విశాఖను పాలన రాజధాని అని వైసీపీ ప్రకటించడం స్థానిక ప్రజలకు ఇష్టం లేదని, అందుకే వైసీపీని ఓడించారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలి అని విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు. బీజేపీ నేత వ్యాఖ్యలతో నేడో రేపో టిడిపిలో చేరడం ఖాయం అని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇప్పటివరకూ వైసీపీ పాలనలో ఎన్ని ఘోరాలు జరిగినా, నేరాలు చేస్తున్నా కాపాడుకుంటూ వస్తోంది బీజేపీ పెద్దలేనని..విష్ణుకుమార్ రాజు చెప్పకనే చెప్పేశారు.
news
పట్టభద్రులు టిడిపికే పట్టం కడతారని "అమరావతి వాయిస్" చెప్పిందే నిజమైంది
అమరావతి వాయిస్ రాసిందే నిజమైంది. అమరావతి వెబ్ సైటు విశ్లేషణే అక్షరాలా వాస్తవమైంది. ఉత్తరాంధ్రలో పట్టభద్రులు ప్రభుత్వంపై ఉవ్వెత్తున విరుచుకుపడుతున్నారు. ఆంధ్రాలో అరాచక పాలనపై ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా టిడిపి వైపు చూస్తున్నాయి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళి చూస్తుంటే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏ రేంజులో ఉందో అర్థం అవుతోంది. విశాఖ రాజధాని అని ఊరిస్తున్నా ఉత్తరాంధ్రులు నమ్మడంలేదు. కర్నూలు న్యాయరాజధాని అని ఆశ పెట్టినా సీమవాసులు కరుణించలేదు. అమరావతి ఆగ్రహజ్వాలలు సరేసరి. లక్షలాది మంది నిరక్షరాస్యులని పట్టభద్ర ఓటర్లుగా చేర్పించామని, కోట్లు ఖర్చు చేశామని, ఎన్నికల వ్యవస్థని మేనేజ్ చేశామని సంబరపడుతోన్న అధికార వైసీపీకి ప్రజలు షాకిచ్చారు. మూడు స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులకి మద్దతుగా నిలిచారు. ఎన్నికలకి ముందు అమరావతి వాయిస్ పట్టభద్రులు తెలుగుదేశానికి పట్టం కట్టబోతున్నారని రాసిన కథనం లింక్ ఇది.. https://www.amaravativoice.com/avnews/news/mlc-elections-tdp-edge
ఏపీలో వైసీపీ ధీమా సడలుతోందా? వైనాట్ 175 మేకపోతు గాంభీర్య నినాదమేనా? పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనపడటంతో వైసీపీ పెద్దల్లో ఆందోళన నెలకొంది. దింపుడు కల్లం ఆశలు దొంగ ఓట్లపై పెట్టుకోవడం వైసీపీ తిరోగమనానికి సంకేతం అని అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడబలుక్కుని మరీ వైసీపీని ఓడించాలని తమ గ్రూపులలో నేరుగానే సందేశాలు పంపేశాయి. ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో పట్టభద్రులలో తీవ్ర నిరాశానిస్పృహలు అలుముకున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ నమోదైంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాద్యాయులు ఇంత వ్యతిరేకంగా ఉన్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశంలేదు. కానీ వైసీపీ ఇటువంటి ప్రజావ్యతిరేకతని ఊహించే భారీగా దొంగ ఓట్లు చేర్పించింది. ఇప్పుడు గెలుపు ధీమా అంత ఆ దొంగ ఓట్లపైనే పెట్టుకుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు సోమవారం పోలింగ్ జరగ్గా ఉపాధ్యాయ ఓటర్లు 91.40శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఉపాధ్యాయులు కానివారిని, ప్రైవేటు స్కూళ్లలో పనిచేసిన వారిని వైసీపీ తమ వాలంటీర్ల ద్వారా ఓటర్లుగా చేర్చిందని ఉపాధ్యాయసంఘాలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారే లేడు. ఈ దొంగ ఓట్లపైనే వైసీపీ గెలుపు ఆశలు పెట్టుకుంది. పట్టభద్రులు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా 69.23 శాతం మంది, ఎండలో గంటల తరబడి నిలుచుని మరీ తమ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడం, అందులోనూ యువత, ఉద్యోగులు పోటెత్తడంతో ప్రభుత్వంపై కోపంతోనే ఓటింగ్‌కి వచ్చారని, ఇది కచ్చితంగా వైసీపీకి ఓటమి ఎదురు కావొచ్చని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే తిరుపతి, రాయలసీమలో దొంగ ఓట్లని, ఉత్తరాంధ్రలో తాము పంచిన తాయిలాలు, డబ్బులనే నమ్ముకుని వైసీపీ గెలుపు అంచనాల్లో ఉంది.
చంద్రబాబు చెప్పిందే నిజం అయ్యింది... ఈ లెక్కలు చూస్తే జగన్ పని అయిపోయిందని అర్ధమవుతుంది
ఉత్తరాంధ్రలో ప్రజా వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసిపడింది. జగన్ అరాచక పాలనపై రాయలసీమ రగులుతోంది. ఆంధ్రాలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీనికి మూడు ప్రాంతాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. ఓటమికి వైసీపీ ఏ కారణాలైనా వెతుక్కోనీయండి. దొంగ ఓట్లు, డబ్బు, బెదిరింపులు, అధికారయంత్రాంగం వైసీపీకి పనిచేసినా గెలుపు దక్కలేదు. ఉమ్మడి 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. 175 నియోజకవర్గాలకి గానూ మూడు ప్రాంతాల్లోనూ 108 నియోజకవర్గాలలో ఎన్నికలూ మెజారిటీ ఎక్కువ తక్కువైనా ప్రభుత్వ వ్యతిరేక వైఖరినే వెల్లడించాయి. పట్టభద్రులు ఓటర్లుగా డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాద్యాయులు ఉంటారు. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఈ వర్గాలు సంకోచించలేదు. ప్రజల మూడ్‌ని పసిగట్టిన మాజీ సీఎం చంద్రబాబు ప్రతీసభలో చెబుతున్నట్టు జగన్ పని అయిపోయింది అనే దానికి ఈ ఎన్నికలు నిదర్శనం. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర (నెల్లూరు, ప్రకాశం) రాయలసీమల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. ఉత్తరాంధ్రలో వైకాపా కంటే తెలుగుదేశానికి 14.39 శాతం ఓట్లు ఆధిక్యం రావడంతో వైసీపీ షాక్‌కి గురైంది. ఉత్తరాంధ్రకి రాజధాని తీసుకొస్తున్నామని, 2024 ఎన్నికలకి సైమీఫైనల్స్ అని వైసీపీ పెద్దలు చెప్పినా..ఓటర్లు తమ ఓటుతో మీ రాజధానీ వద్దు, మీరూ వద్దని చెప్పకనే చెప్పారు. ఉత్తరాంధ్రలో టిడిపికి 43.88 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 29.49 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తూర్పు రాయలసీమలో వైసీపీకి 34.52 శాతం ఓట్లు పోలవగా, టిడిపికి 45.30శాతం వచ్చాయి. వైసీపీ కంటే 10.78 శాతం ఓట్ల ఆధిక్యం తెలుగుదేశం సాధించింది. వైసీపీ కంచుకోటగా భావించే పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోనూ టిడిపి అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. అంగ, అర్థ, అధికార బలమున్నా వైకాపాకు ప్రతికూల పవనాలు వీయడం..ముమ్మాటికీ ప్రజావ్యతిరేకతే అని స్పష్టం అవుతోంది.
ఎమ్మెల్సీ ఓటమి మర్చిపోక ముందే, అనురాధ రూపంలో జగన్ కి మరో టెన్షన్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో మూడు సీట్లు గెలిచేసిన టిడిపి మద్దతుదారులు మంచి జోష్ లో ఉన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనూరాధని నిలిపిన టిడిపి జగన్ రెడ్డికి పంచుమర్తి మార్క్ పంచ్ ఇవ్వడం ఖాయమం అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ నుంచి పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలను అభ్యర్థులుగా ప్రకటించారు. ఏకగ్రీవం అయినట్టేనని వైసీపీ భావించగా సడెన్‌గా టిడిపి కూడా పంచుమర్తి అనూరాధని తమ అభ్యర్థిని దింపింది. దీంతో పోటీ అనివార్యమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం నేపథ్యంలో వైసీపీ అలెర్టయ్యింది. ఓట్లు చెల్లకపోవడం పెద్ద సమస్యగా మారుతాయని ఎమ్మెల్యేలకు ఓట్లు ఎలా వేయాలో శిక్షణ ఇచ్చారు. ఒక్కో మంత్రికి 20 మంది ఎమ్మెల్యేలను అప్పగించారు. మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకి మార్చి 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు సరిపోతాయి. టిడిపి తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, నలుగురు వైసీపీ పంచన చేరారు. వారిని కూడా ఇరకాటంలో పెట్టేందుకా అన్నట్టు టిడిపి చివరి నిమిషంలో తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. విప్ జారీ చేయడం ద్వారా జంపింగ్ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థి అనూరాధకి ఓటు వేయకపోతే నలుగురిపై క్రమశిక్షణ చర్యలు కోరవచ్చు. ఒకవేళ ఈ నలుగురూ వైసీపీకే వేసినా..వైసీపీలో ఉన్న కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తారు. దీంతో పంచుమర్తి అనూరాధ గెలుపు పక్కా అని ఫిక్స్ అయ్యారు. 23న జరిగే ఎన్నికల్లో పాల్గొని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలని టిడిపి ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి విప్ జారీ చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అటు జంపింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వడంతోపాటు ఎమ్మెల్సీ స్థానం గెలిచి జగన్ రెడ్డికి షాక్ ఇవ్వనుంది టిడిపి అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.