విశాఖ ఉక్కును కాపాడుకుంటామని జాతీయ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరు శాతం ప్రైవేట్‌పరం చేస్తామన్న కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ఆధ్వర్యంలో ఉక్కునగరం త్రిష్ణా మైదానంలో నిర్వహించిన ఉక్కు కార్మిక గర్జన పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ఈ భారీ బహిరంగ సభకు దేశవ్యాప్త జాతీయ యూనియన్ ప్రముఖులు ఇంటర్ నుంచి జి సంజీవరెడ్డి, సిఐటియు నుంచి తపస్‌సేన్, ఏఐటియుసి నుంచి అమర్ జిత్ కౌర్, హెచ్ఎమ్ఎస్ నుంచి రియాజ్ అహ్మద్, బిఎమ్ఎస్ఎస్ నుంచి డికె పాండే, టిఎన్టియుసి నుంచి జి రఘురామరాజు తదితర జాతీయ కార్మిక నాయకులు ముక్తకంఠంతో ఉక్కు పరిరక్షణ కోసం నినాదించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ యాజమాన్యానికి అమ్మాలనుకోవడం కేంద్రానికి సరికాదని, 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల పేరుతో అమ్మాలని చూస్తున్నారని, సొంత గనులుంటే విశఋఖ ఉక్కు లాభాల బాటలో నడుసుందన్నారు. దేశంలోని కార్మిక సంఘాలన్నీ ఉక్కు పరిరక్షణకు సహకరిస్తాయని బరోసా ఇచ్చారు. ప్రభుత్వ 112 రంగ సంస్థల ప్రైవేటీకరణలో రాజ్యాంగ బద్దంగా వచ్చిన రిజర్వేషన్లను తొలగించే దురాలోచన కేంద్రానికి ఉందని నేతలు విమర్శించారు.
ఇంకా ఈ బహిరంగ సభలో విశాఖ ఉక్కు పరిరక్షణకమిటీ నాయకులు సిహెచ్ నరసింగరావు, జె అయోద్యరాం, మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, వై మస్తానప్ప, విల్లా రామ్మోహన్కుమార్, వరసాల శ్రీనివాసరావు, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, ఉక్కు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఢిల్లీ దగ్గర ఉద్యమం చేస్తున్ రైతు నేతల మద్దతు కోరామని, ఈ నెల 28 నగరంలో జరిగే బహిరంగ సభకు ఆ నేతలు కూడా వస్తారని తెలిపారు. క్షణికావేశంలో ఎవరూ కూడా కర్మాగార పరిరక్షణ కోసం ఆత్మ--హ--త్య--లు వంటి వాటికి పాల్పడవద్దని కోరారు. దైర్యంగా అందరం పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు, ఉక్కునగర వాసులు అందరూ అధిక సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రదర్శించిన ఒక ఫోటోతో, వైసీపీ నేతలు షాక్ తిన్నారు. నిన్నటి వరకు, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, నేతలు తమ చుట్టూ తిరిగారని, ఎన్నికలు అయిన తరువాత, ఒక్కడు కూడా అడ్డ్రెస్ లేరు అంటూ, తమ ఎంపీలు కనిపించటం లేదు అంటూ, ఫ్లెక్సీ ప్రదర్శించారు.