రాష్ట్రమంతా వైసీపీ నేతల అధికార బలానికి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతుంటే, విచిత్రంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మాత్రం వైసీపీ నేతల బారి నుండి, సొంత పార్టీలో గెలిచిన వారిని క్యాంప్ కు తరలించాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. మునిసిపల్ ఎన్నికలు తరువాత జంగారెడ్డి గూడెంలో రాజకీయాలు సొంత పార్టీలోనే రోజు రోజుకీ మలుపు తిరుగుతున్నాయి. సాధారణంగా చైర్మెన్ పదవి లాంటివి దక్కించుకోవాలి అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు గొడవ పడతూ ఉంటాయి. అయితే ఇందుకు భిన్నంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు చైర్మెన్ పదవి కోసం పోటీ పడటం జంగారెడ్డి గూడెంలో జరుగుతుంది. ముఖ్యంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ , ఎమ్మెల్యే ఎలిజాలి, వీరిద్దరూ తమ అభ్యర్ధులకే చైర్మెన్ పదవి దక్కేలా పావులు కదుపుతున్నారు. దీంతో జంగారెడ్డి గూడెంలో రసవత్తరమైన రాజకీయం నడుస్తుంది. ముఖ్యంగా జంగారెడ్డి గూడెంలో 29 మంది మునిసిపల్ సభ్యులు ఉంటె, నలుగురు టిడిపి వాళ్ళు, జనసేన సభ్యులు అయితే, మిగిలిన వారందరూ వైసీపీ సభ్యులే. అదే 25 మందిలో, 15 మంది వైసీపీ ఎమ్మెల్యే వర్గం కాగా, పది మంది ఎంపీ వర్గీయులు. అయితే మునిసిపల్ చైర్మెన్ పదవి తమ వర్గానికే దక్కాలని, రెండు వర్గాలు వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ కౌన్సెలర్లు చేజారి పోకుండా, ఎవరికి వారు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అయితే ఎమ్మెల్యే మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, నిన్న రాత్రికి రాత్రి మొత్తం 15 మంది తన వర్గం సభ్యులను జంగారెడ్డి గూడెంలోని ఒక రిసార్ట్ కు తరలించారు. అయితే ఈ రోజు ఎందుకో కానీ, మళ్ళీ అక్కడ నుంచి వేరే రహస్య ప్రాంతానికి తరలించారు. అయితే వాళ్ళు అందరూ విశాఖలోని అరకకు తరలించినట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తీ సమాచారం రావలసి ఉంది. అయితే అధికార పార్టీలో ఇరు వర్గాలు ఇలా రోడ్డున పడటం మాత్రం విచిత్రంగా ఉంది. తమ వర్గానికే అంటూ, రెండు వర్గాల వారు పట్టుదలగా ఉందటంతో అధిష్టానం ఈ విషయం పై దృష్టి సారించింది. ఈ వివాదానికి తెర దింపే విధంగా చేయటానికి అధిష్టానం రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని వైసీపీ ఇబ్బంది పెడుతుంటే, ఇక్కడ మాత్రం వైసీపీ నేతలే వైసిపీ వారిని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ క్యాంప్ రాజకీయాలు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాల్సి ఉంది.