మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత తీసుకున్న ఒక నిర్ణయం, ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. విజయనగరం మహారాజా కోటలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభానికి తరలించలాని, ఆమె ఆదేశాలు జారీ చేసారు. విజయనగరం గజపతి రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ కు, విజయనగరం జిల్లాకు విడదీయరాని సంబంధం ఉంది. ఈ ట్రస్ట్, విజయనగరం జిల్లాలో పలు విద్యా సంస్థలు నడుపుతుంది. తాజాగా ట్రస్ట్ ను విజయనగరం నుంచి విశాఖపట్నంకు మార్చటమే కాక, ట్రస్ట్ ఉద్యోగులను కూడా అక్కడికే రామ్ముంటున్నారని సమాచారం. మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుతం విజయనగరం మహా రాజా కోటలో, 5800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం ఉంది. ఇక్కడే 25 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఇది ప్రస్తుత కార్యకలాపాలకు ఇరుకుగా ఉందనే నెపంతో, విశాఖకు మారుస్తున్నారు. మహా రాజా కోటలో ప్రస్తుతం, ఆరు విద్యా సంస్థలు, ఒక గర్ల్స్ హాస్టల్ నడుస్తున్నాయి. ఇప్పటికే వేరే కారణాలు చెప్పి, విశాఖ జిల్లా పద్మనాభంలో ఉన్న గర్ల్స్ హాస్టల్ ను మూసేసారు. 3.5 ఎకరాల్లో ఉన్న ఈ కాలేజీ బిల్డింగ్ లోకి మాన్సాస్ ట్రస్ట్ ను మార్చాలని, ఈ నెల 26న నిర్ణయం తీసుకున్నట్టు, సంచయత సంతకంతో ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, ఒకవేళ ప్రస్తుతం ఉన్న కార్యాలయం ఇరుకుగా ఉంటే, అక్కడ మరొక కార్యాలయం కట్టుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
కేవలం ఈ వంకతోనే, మాన్సాస్ కార్యాలయాన్ని విజయనగరం నుంచి విశాఖ తరలించటాన్ని విజయనగరం వాసులు ఖండిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఢిల్లీలో ఉంటున్న సంచయతను తీసుకుని వచ్చి, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా విజయసాయి రెడ్డి కూర్చోబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీని పై ప్రస్తుతం అంతకు ముందు చైర్ పర్సన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు కోర్టు లో కేసు వేసారు. కేసు నడుస్తూ ఉండగానే, సంచయిత పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం, కార్యాలయాలు తరలించటం వంటివి చేస్తున్నారు. ఆమెకు విజయనగరంలో ఎక్కువ సేపు గడపటం ఇష్టం లేక, కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తున్నారని, అదీ కాక విశాఖలో అయితే అధికార పార్టీ నేతలు అందుబాటులో ఉంటారు కాబట్టి, అన్నిటికీ అండగా ఉంటారని, ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని, పలువురు ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. అయితే సంచయిత తీసుకున్న నిర్ణయం పై, అదితి గజపతిరాజు తీవ్రంగా స్పందించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. భూములు రికార్డులు తారు మారు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.