ఆంధ్రప్రదేశ్ర్ లో ప్రతి రోజు దేవాలయాల పై ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. కొన్నాళ్ళు ఈ దాడులు తగ్గాయని అందరూ అనుకున్న సమయంలో, మళ్ళీ ఒక పది రోజులు నుంచి మొదలయ్యాయి. రామతీర్ధం ఘటన మర్చిపోక ముందే, నూతన సంవత్సరం మొదటి రోజే, మళ్ళీ ఇలాంటి రెండు ఘటనలు నేడు జరిగాయి. అయితే ఏదో అక్కడఅక్కడా తప్పితే, చాలా చోట్ల ఈ దాడులు చేసిన వారిని పట్టుకోవటంలో పోలీసులు విఫలయం అయ్యారు. ముఖ్యంగా అంతర్వేది, కనకదుర్గమ్మ గుడిలో వెండి రధాలు లాంటి పెద్ద ఘటనల్లో ఎలాంటి పురోగతి లేదు. రామతీర్ధం ఘటన జరిగి, నాలుగు రోజులు అవుతున్నా ఎలాంటి పురోగతి లేకపోవటంతో, ఈ ఘటనను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమం రూపొందించారు. ఆయనే నేరుగా రంగంలోకి దిగి, రామతీర్ధం వెళ్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా మారింది. చంద్రబాబు వస్తూ ఉండటంతో, ముందుగానే దీని పై వైసీపీ రాజకీయంగా పైచేయి సాధించటానికి తమ వ్యూహాన్ని అమలు చేసింది. విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. రామతీర్ధం ఘటనలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈ ఘటన వెనక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు, ఘటన జరగటానికి ముందు అక్కడకు వెళ్ళిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, బాధ్యుల పై చర్యలు తీసుకుని తీరుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా విజయసాయి రెడ్డి స్థాయి నేత ఆధారాలు ఉన్నాయని చెప్పారంటే అది సంచలనం అనే చెప్పాలి. అయితే వైసీపీ వ్యూహాన్ని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అంతే దీటుగా బదులు ఇచ్చింది. సహజంగా విజయసాయి రెడ్డి మాటలకు స్పందించని నారా లోకేష్, ఈ విషయంలో స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి, ఏ2 చేత ఇలాంటి ఫేక్ ఆరోపణలు చేపిస్తున్నారని అన్నారు. గతంలో కూడా ఇలాగే పింక్ డైమెండ్ అంటూ ఫేక్ ఆరోపణలు చేపించారని గుర్తు చేసారు. అందుకే ఇంకా ఈ ఫేక్ మాటలు వద్దని, జగన్ మోహన్ రెడ్డిని సింహాచలం అప్పన్న దగ్గరకు రావాల్సిందిగా లోకేష్ ఆహ్వానించారు. తన పై చేసిన ఆరోపణలు అబద్ధం అని, తాను సింహాచలం అప్పన్న ముందు ప్రమాణం చేస్తానని, ఈ ప్రమాణానికి జగన్ కూడా రావాలని, జగన్ కు వచ్చి ప్రమాణం చేయాలని లోకేష్ సవాల్ విసిరారు. చంద్రబాబు పర్యటన మొదలు కాక ముందే, రాజకీయంగా వేడెక్కింది. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మరి.