గత 300 రోజులుగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు మరియు గ్రామస్తులు ఉద్యమం చేస్తున్నారు. వారికి బాసటగా రాష్ట్రవ్యప్తంగా అన్ని ప్రాంతాలలలో అమరావతి ఉద్యమానికి మద్దతు లభిస్తుంది. ఎన్నికల ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పారు. గతంలో రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నామని, అందుకు 30 వేల ఎకరాలు అవసరం అందరికంటే ముందే అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రివర్యులు జగన్మోహనరెడ్డి గారు చెప్పి ఇప్పుడు రైతుల త్యాగాలను అవమాన పరుస్తున్నారు. గత 300 రోజులుగా అమరావతి రైతులు, మహిళలు, ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా, ప్రతి రోజు పోరు బాట పట్టారు. క-రో-నా సమయంలో కూడా ఉద్యమం చేసారు. అయినా ప్రభుత్వం కనికరించలేదు. కనీసం వారి సమస్య పై ఇప్పటి వరకు వారి వద్దకు చర్చకు రాలేదు. రాకపోగా, వారిని అవమాన పరుస్తున్నారు. వారిని బూతులు తిడుతున్నారు, రియల్ ఎస్టేట్ మాఫియా అంటున్నారు, పైడ్ ఆర్టిస్ట్ లు అంటున్నారు, స్మశానం అని, ఏడాది అని ఇలా అనేక విధాలుగా, వారిని అవమాన పరుస్తూనే ఉన్నారు.

ఈ రోజు 300వ రోజు ఉద్యమం చేస్తుంటే ఈ రోజు కూడా వారిని అవమానిస్తూ బొత్సా మాట్లాడారు. ప్లాప్ సినిమా ఫంక్షన్ కు, వంద రోజులు చేసి, డప్పు కొడుతున్నట్టు ఉందని, అక్కడ ఏముందని 300 రోజులు ఉద్యమం అంటున్నారు, అక్కడ ఉన్నది అంతా పైడ్ ఆర్టిస్ట్ లే కదా, చంద్రబాబు నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ ఉద్యమమే కదా అంటూ, రాజధాని మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమాన్ని, 300 వ రోజు కూడా హేళన చేస్తూ మాట్లాడారు మంత్రులు. ఎక్కడైనా ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తుంటే, కనీసం ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరుపుతుంది, కానీ ఇక్కడ రివర్స్ వారిని మరిన్ని బూతులు తిడుతూ హేళన చేస్తున్నారు. అయితే బొత్సా మాట్లాడిన మాటల పై రైతులు మండి పడుతున్నారు. మాట్లాడే మాటలు ఇక్కడకు వచ్చి మాట్లాడాలని, ఎవరు పైడ్ ఆర్టిస్ట్ లు అనేది తెలుస్తుందని వాపోతున్నారు. రాజధాని ఉద్యమం అంత చులకనైది అయితే, రాష్ట్రంలో ప్రజా తీర్పు కోరదామని, పోనీ బొత్సా ఒకరే రాజీనామా చేసే మళ్ళీ ఎన్నికలకు రావాలని, అప్పుడు ఎవరిదీ ఫ్లాప్ షో నో అర్ధం అవుతుందని, రాజధాని రైతులు చాలెంజ్ చేస్తున్నారు.

విజయనగరం పార్లమెంటుపై చంద్రబాబు సమీక్ష చేసారు. ఈ సమావేశంలో టిడిపి ప్రజా ప్రతినిధులు, మండల కమిటీల బాధ్యులు పాల్గున్నారు. ఈ సందర్భంగా, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, జిల్లాలో జరుగుతున్న వాటి పై చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఆయన మాటల్లో "ఉత్తరాంధ్ర జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 2,500ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం అభివృద్దికి టిడిపి శ్రీకారం చుట్టింది. మెయింటెనెన్స్ రిపేర్లు(ఎంఆర్), కార్గోలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉండేవి. వైసిపి వచ్చాక అందులో 500ఎకరాలు తగ్గించారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కు తెరదీశారు. కోజికోడ్ లో జరిగిన విమాన ప్రమా-దంలో అనేకమంది ప్రా-ణా-లు కోల్పోవడం తెలిసిందే. రన్ వే, ఎమ్మార్, కార్గో కుదించి భోగాపురాన్ని ఏం చేద్దామని వైసిపి నాయకులు అనుకుంటున్నారు..? క్లిష్ట పరిస్థితుల్లో విజయనగరం జిల్లా రైతాంగం ఉంది, అన్నివర్గాల ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారు. ఎటువంటి అభివృద్ది ఆలోచనలు వైసిపికి లేవు. విజయవాడ విమానాశ్రయం విస్తరణకు రైతులు 900 ఎకరాలు ఇస్తే వాళ్లకు కూడా అన్యాయం చేశారు. టిడిపి హయాంలో వాళ్లకు అమరావతిలో భూములిచ్చాం, అలాంటిది అమరావతినే నాశనం చేయడంతో భూములిచ్చిన రైతుల భవిష్యత్ అంధకారం అయ్యింది. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయానికి టిడిపి ప్రభుత్వం భూములు ఇచ్చి, ప్రహరీగోడ నిర్మాణం కూడా పూర్తిచేస్తే, దానిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనే దురుద్దేశంతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని అక్కడ నుంచి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. "

"చక్కగా నడిచిపోతున్న మాన్సాస్ ట్రస్ట్ ను అస్తవ్యస్తం చేశారు. మా తండ్రి పివిజి రాజు 1954లో శ్రీకాకుళంలో ఇచ్చిన 345ఎకరాల భూ విరాళంతో విజయనగరం సత్రంలో 450మంది విద్యార్ధులు నాలుగున్నర దశాబ్దాలుగా ఉచిత భోజన వసతి లభిస్తోంది. సత్రం భూములు ఒక జిల్లాలో, లబ్దిదారులు మరో జిల్లాలో, దేవాలయం ఇంకో జిల్లాలో ఉన్నాయి. అలాంటిది వీటిపై నిర్వహణ కలెక్టర్లకు అప్పగిస్తే, భూములకు భద్రత లేక, సత్రం నిర్వహణ అస్తవ్యస్థమై, బడుగు బలహీన వర్గాల విద్యార్ధులకు తీరని నష్టం జరుగుతుంది. ట్రస్ట్ లో డబ్బులు పుష్కలంగా ఉన్నప్పటికీ, గోశాలలో గోవులు చ-ని-పో-వ-డం బాధాకరం. 37 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతుంటే, వాటికి ఆ కొరత లేకుండా ట్రస్ట్ నుంచి తీర్చాం. సామాజిక ధర్మం కోసం పెట్టిన మాన్సాస్ ట్రస్ట్ ను ఇప్పుడు నిర్వీర్యం చేయడం చూస్తుంటే బాధేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ట్రస్ట్ భూముల్లో అవకతవకలు చేస్తున్నారు. ఎండో మెంట్, మైనింగ్, రెవిన్యూ శాఖల మధ్య చెలగాటం ఆడుతున్నారు ...దాతల ఆశయాలను, ట్రస్ట్ లక్ష్యాలకు తూట్లు పొడిచేలా సీఎం జగన్ చర్యలు ఉన్నాయి. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు అటకెక్కాయి. సేద్యం, ఎండోమెంట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేశారు. చంపావతి, గోసాని,తోటపల్లి తాగునీటి పథకాలన్నీ నిర్లక్ష్యం చేశారు. " అని అశోక్ గజపతి రాజు, చంద్రబాబుకు చెప్పారు. అన్ని విషయాల పై గట్టిగా పోరాడాలని, పార్టీ కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు.

అమరావతి విషయంలో కేసులు రోజు వారీ విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, అమరావతిలోని సెక్రటేరియట్, రాజ్ భవన్, అసెంబ్లీ, సియం కార్యాలయం, ఇతర డిపార్టుమెంటులు, కార్పొరేషన్ భవనాలు, విశాఖకు తరలించకుండా, ఇక్కడే ఉంచాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే మిగతా భవనాలు ఇప్పుడు తరలించే ఉద్దేశం మాకు లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే సియం క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా పెట్టుకునే హక్కు మాకు ఉందని, అలాగే వివిధ కార్పొరేషన్ ఆఫీస్ లు ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపింది. పలానా చోటు మాత్రమే క్యాంపు కార్యాలయం ఉండాలని ఎక్కడా లేదని, కోర్టుకు తెలపటంతో, దీనికి సంబంధించిన మొత్తం వివరాలు తమకు సమర్పించాలని, కోర్టు ఆదేశించటంతో, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు నిన్న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సియం క్యాంప్ ఆఫీస్ లు అయినా పెట్టుకునే హక్కు ఉందని అన్నారు. జిల్లాకి ఒకటి అయినా పెట్టుకోవచ్చని ఆయన తన కౌంటర్ లో తెలిపారు. క్యాంప్ కార్యాలయం అమరావతిలోనే ఉండాలి, మరెక్కడా ఉండకూడదు అనే హక్కు పిటీషనర్ కు లేదని ఆయన కౌంటర్ లో తెలిపారు.

క్యాంప్ ఆఫీస్ ఒక్క చోటే ఉండాలనే చట్టం ఎక్కడా లేదని, సిఆర్డీఏ చట్టంలో కూడా, ఈ నిర్వచనం ఎక్కడా లేదని తెలిపారు. ఇప్పుడు ఉన్న చోటు నుంచే ముఖ్యమంత్రి ఉండాలని, అక్కడ నుంచి వేరే చోట పెట్టకూడదు అనే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. అందుకే ఈ పిటీషన్ ను కొట్టేయాలని తమ కౌంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని కోరింది. ఈ పిటీషన్ పై రేపు విచారణ జరగనుంది. ఇక మరో పక్క కార్పొరేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది కాబట్టి, మిగతా కార్యాలయాలు తరలించటం లేదని, కార్పొరేషన్ల విషయంలో, ఇప్పటికే అనేక చోట్ల ఇవి ఉన్నాయి కాబట్టి, వాటికి ఇవి వర్తించదని, గుంటూరు, కృష్ణాలో ఉన్న కార్పొరేషన్ ఆఫీస్ లకే, ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అంటూ, ఆ కార్పొరేషన్ ల లిస్టు ని, హైకోర్టుకు సమర్పించారు. అమరావతి రాజధాని తరలింపు పిటీషన్ల పై రేపు, మరోసారి విచారణ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపటం లేదు అంటూ, గత ఏడాది దాఖలు అయిన పిటీషన్ పై, గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఎన్నికలు జరపమని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల వరకు వెళ్ళింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచం మొత్తానికి క-రో-నా వచ్చి ఇబ్బంది పెట్టటంతో, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ప్రారంభించింది. దీంతో రోజు రోజుకీ ముప్పు ఎక్కువ అవ్వటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేసింది. అయితే ఈ కేసు మరో సారి మొన్న హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్బంగా విచారణ చేసిన హైకోర్టు ఎందుకు ఎన్నికలు జరపటం లేదు అని అడగగా, ప్రభుత్వం తరుపు న్యాయవాది క-రో-నా ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితిలో ఎన్నికలు జరపలేమని తేల్చి చెప్పారు. అయితే దీని పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధం అవుతున్నారు కదా, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలే కదా అంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చి, వారి అభిప్రాయం కోరింది. ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయం చెప్పాలి అంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

దీంతో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ ఏమి చెప్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. ఆయన మేము ఎన్నికలు ఈ సమయంలో జరపలేం అంటే ఇబ్బందే ఉండదు. అదే ఎన్నికలు జరపే అవకాసం ఉందని చెప్తే మాత్రం, మళ్ళీ ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఆసక్తిగా మారింది. మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తమ అభిప్రాయం చెప్పే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గతంలో అంటే వాయిదా కాబట్టి ప్రభుత్వ సహకారం అవసరం లేదు, ఇప్పుడు ఒక వేళ ఎన్నికలు జరపాలి అంటే మాత్రం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ సహకారం అవసరం అవుతుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందా, లేకపోతే పరిస్థితి అంచనా వేసి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధత ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం ఇది ఏమి అవుతుందో.

Advertisements

Latest Articles

Most Read