ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే 88 వేల కేసులు వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో లక్ష కేసులు దాటిన రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ రికార్డులకు ఎక్కుతుంది. రోజుకు 8 వేల కేసులు వస్తున్నాయి. కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 5వ స్థానంలో ఉంది. అలాగే ఆక్టివ్ కేసుల్లో 4వ స్థానంలో ఉంది. గత పది రోజులుగా కేసులు పెరుగుదల శాతంలో ఒకటవ స్థానంలో ఉంది. ఈ నేపధ్యంలో, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా, కరోనా కట్టడి చెయ్యాలని, ఆలోచిస్తున్నాయి. మరిన్ని ఆంక్షలు పెడతాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేస్తుంది. మద్యం షాపులు తెరిచే సంయమాన్ని పెంచుతూ ఎక్ష్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలు ఇక నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచుకుంటాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధం అంటుంది. ఇది పక్కన పెట్టేసారు. ఇక మరో పక్క, ఇప్పుడు కరోనా సమయం. అదీ కాక, కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో, మద్యం దుకాణాల సమయం తగ్గించాలి కానీ, ఇక్కడ వెరైటీగా పెంచేసారు.
అసలు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసి ఉన్నంత వరకు, ఏ గోల లేదు. కేసులు కంట్రోల్ లో ఉన్నాయి. పరిస్థితి అదుపులో ఉంది. అయితే, ఎప్పుడైతే, మద్యం దుకాణాలు తెరిచారో, అప్పుడే కరోనా విలయతాండవం రాష్ట్రంలో మొదలైంది. అయితే ఇప్పుడు రోజుకు 8 వేల కేసులు వస్తున్న సమయంలో, మద్యం షాపులు మూసివేయటమో, నియంత్రించటమో చెయ్యాలి కాని, ఇక్కడ మాత్రం వెరైటీగా, ఎక్కువ సమయం తెరిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం విస్మయం కలిగించే అంశం అనే చెప్పాలి. ఈ విషయం పై, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి లోకేష్ ఘాటుగా స్పందించారు. ఒక పక్క ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే, వైద్యం సమయానికి అందక, 108లు రాక ఇబ్బందులు పడుతుంటే, డాక్టర్లు, నర్సులు సరైన సదుపాయాలు లేవని ఆవేదన చెందుతుంటే, వారి గురించి పట్టించుకోకుండా, ఇంకా కేసులు పెరిగేలే ఈ నిర్ణయం ఏమిటని నిలదీశారు. జేటాక్స్ వసూలు కోసం, మద్యం షాపులు ఇంకా ఎక్కువ సేపు తెరిచేలా నిర్ణయం తీసుకోవటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.