ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తుంది. వస్తున్న కేసులు చూస్తే, కరోనా ఎలా వచ్చిందో కూడా అర్ధం కావటం లేదు. విదేశీ ప్రయాణం, ఢిల్లీ ప్రయాణం లేకపోయినా, అలాంటి వారితో కాంటాక్ట్స్ లేకపోయినా, కరోనా పాజిటివ్ వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. మరో పక్క మొన్నటి దాకా, కొంత మంది డాక్టర్లకు కూడా వచ్చిన కరోనా, మొన్న అనంతపురంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇప్పుడు ఏకంగా విజయవాడలో ఒక ప్రాముఖ సీనియర్ ఐఏఎస్ సతీమణికి కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్రంలో, ముఖ్యంగా విజయవాడలో కలకలం చలరేగితోంది. కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో అధికారవర్గాలు ఉలిక్కి పడుతున్నాయి. ఆమె తండ్రి కర్నూల్ లో వైద్యుడుగా పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. కర్నూల్ జిల్లా అంతటా ఆ వైద్యునికి పేదల పెన్నిధిగా పేరుంది. అతి తక్కువ రుసుము తీసుకుని చాలాకాలంగా వైద్యం చేస్తూ ఆదర్శనీయ వ్యక్తిగా గుర్తింపు పొందారు.
అయితే ఇటీవల సదరు వైద్యుడుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కోరానాతో బాధపడుతూ ఆయన కొద్దిరోజుల క్రితమే మృతి చెందారు కూడా. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఆరుగురుకి పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారించారు. తండ్రిని పరామర్శంచ డానికి వెళ్లిన ఐఏఎస్ భార్య కు పరీక్షలు నిర్వ హించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ కు తరలించారు. దీనికి సంబంధించి అన్ని ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఆ ఐఏఎస్ కు మాత్రం కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయన విషయం తెలుసుకున్న వెంటనే, టెస్ట్ చేయించుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ప్రతి రోజు రివ్యూలు చేస్తూ, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు.
ఇక మరో పక్క, విజయవాడలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన, వార్డు సచివాలయ వాలంటీర్ కు కూడా కరోనా వైరస్ పాజిటివ్ తేలినట్టు అధికారులు ప్రకటించారు. ఈ వార్డ్ వాలంటీర్, మహిళ అని తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఇచిన బియ్యం కూడా, పంపిణీ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఆమెకు కోరనా ఎలా వచ్చింది అనే దాని పై, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆమె, అస్వస్థతకు గురి కావటంతో, ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. అక్కడ కరోనా టెస్ట్ చెయ్యగా, పాజిటివ్ అని రిపోర్ట్ రావటంతో, ఆమెను క్వారంటైన్ కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కు తరలించారు. గత 15 రోజులుగా ఆమె ఎవరిని కలిసారు, విధ నిర్వహణలో ఎక్కడెక్కడికి వెళ్లారు అనే దాని పై అధికారులు ఆరా తీస్తున్నారు.