కరోనా వైరస్ దేశంలో, రాష్ట్రంలో విజృంభిస్తూ.. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. ప్రజా ప్రతినిధులు మాత్రం రాజకీయానికే ప్రాధాన్యమిస్తున్నారు. పబ్లిసిటీ కోసం విపత్తులో ప్రారంభోత్సవాలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజాప్రతినిధుల పబ్లిసిటీ స్టంట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ భయంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని ఇళ్లల్లో గడుపుతుంటే.. నేతలు మాత్రం తమ పబ్లిసిటీ పిచ్చితో చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉన్నాయి. కరోనా వైరసను ఎదుర్కొనేందుకుఅందరం ఇంట్లో ఉండాలి అంటూ, చేతులు ఎత్తి జగన్ దండం పెట్టి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఇవేవీ తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిదుల తీరుపై జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుంటే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు, సూచనలు చేస్తుంటే.. ప్రజాప్రతినిధులు మాత్రం వీటిని ఆచరించకపోవడం శోచనీయం.

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు పబ్లిసిటీ స్టంట్ల కోసం ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని ఐసోలేషన్ వార్డులకు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో అధికార యంత్రాంగానికి అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలను చేయడం పట్ల ప్రజానీకం మండిపడుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లకు రిబ్బన్లు కట్టి మరీ ప్రారంభించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి. అలాగే పేదలకు ఇచ్చే వెయ్యి రూపాయలు కూడా, జగన్ ఇచ్చాడు, వచ్చే స్థానిక సంస్థల్లో మాకే ఓటు వెయ్యండి అంటూ, కొంత మంది అడుగుతూ ఉన్న వీడియోలో బయటకు వచ్చాయి.

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలే గుంపులు గుంపులుగా చేరి అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ రాష్ట్రంలో కోరలు చాపుతూ రోజురోజుకూ తీవ్రతను చూపుతున్న తరుణంలో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వైకాపా నేతలు పార్టీ గుర్తుతో మాస్కులు తయారు చేసి, వాటిని పంపిణీ చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. పలు చోట్ల వైకాపా రంగులతో ముద్రించిన మాస్కులు కనిపిస్తున్నాయి. ఇలాంటి కనీవినీ ఎరుగని విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రజలను ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని, ముఖ్యమంత్రి చెబుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం అట్టహాసానికి పోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులే ఇష్టానుసారంగా లాక్ డౌన్లో బయట తిరుగుతున్నారని, అలాంటిది ప్రజలకు వారు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్రంలో ధాన్యం క్రయ, విక్రయాలకు సంబంధించి రైతులు ఇబ్బండి పడకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో రైతుల పక్షపాతిగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాజ్ భవన్లో శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తొలి విడతగ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశమై లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ పనులు ఆగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తికి విఘాతం కలిగితే భవిష్యత్ లో పలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయదారులతో వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత రబీ సీజన్ లో పౌరసరఫరాల సంస్థ 32.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు గవర్నర్ కు వివరించారు.

వ్యవసాయ క్షేత్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు కంప్యూటరీకరణ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ వివరించారు. గ్రామాలను యూనిట్ గా తీసుకొని మార్కెటింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా చూడాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మార్కెటింగ్ శాఖ నుంచి సమగ్రమైన కార్యాచరణ అమలు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. సమీక్షా సమావేశాల్లో పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సూర్య కుమారి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

కరోనా కట్టడికి లాక్ డౌన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పాటించినప్పుడే అడ్డుకట్ట వేసేందుకు వీలుంటుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. లాక్ డౌన్ విషయంలో చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మతపరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని గవర్నర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రజలకు మత పెద్దలు తగిన సూచనలు చేయాలని ఆయన పిలుపిచ్చారు. మతపరమైన కార్యక్రమాల వలన సమూహాలు ఏర్పడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదన్నారు. కరోనా కట్టడికి నిమగ్నమైన వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరి విధులను అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొంటూ ఈ తరహా ఘటనలు ఏమాత్రం వాంఛనీయం కాదన్నారు.క రోనా కట్టడికి నిరంతరం కష్టపడుతున్న వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు.

దేశ వ్యాప్తంగా, కరోనా ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్న కేంద్రం, ఆ జాబితాలో మన రాష్ట్రానికి చెందిన విశాఖపట్నంను చేర్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా, 29 హాట్ స్పాట్లను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రోజు రోజుకీ ఈ వైరస్ పెరుగుతూ ఉండటం, పోజిటివ్ కేసులు వేగంగా పెరుగుతూ ఉండటంతో, ఈ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, 8 రాష్ట్రాల పరిధిలోని మరికొన్ని జిల్లాలను ఈ రోజు గుర్తించింది. ఈ కొత్త జాబితాలో, కరోనా హాట్ స్పాట్ గా, విశాఖపట్నం చేరింది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖను హాట్ స్పాట్ జాబితాలో చేర్చిన విషయాన్ని, ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ప్రీతి సూడాన్ తెలిపినట్టు, కధనం వచ్చింది. ఈ రోజు ఇచ్చిన జాబితాలో, విశాఖతో పాటుగా బిహార్‌లోని ముంగేర్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, ఢిల్లీలోని న్యూఢిల్లీ, హరియాణాలోని ఫరీదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూర్ కూడా కొత్తగా కరోనా హాట్ స్పాట్ లు గా చేరాయి. మరో పక్క, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా, వైజాగ్ లో ని కొన్ని చోట్ల, రెడ్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. వైద్య నిపుణులను 24 గంటలు అందుబాటులో ఉంచే పని ఒకవైపు... మరో వైపు లాక్ డౌన్ అమలు వల్ల ఎక్కడా నిత్యావసరాల కొరత రాకుండా చూస్తోంది. క్వారంటైన్, ఐసొలేషన్ వార్డుల ఏర్పాటులో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు అనుమానితులను పరిశీలిస్తున్నాయి. కరోనా తాజాగా నిర్ధారణ అయిన మూడు కేసులు తాటిచెట్లపాలెంలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇది ఇలా ఉంటే, విశాఖపట్నం రెండో సర్కిల్ పరిధిలోని కొన్ని పౌర సరఫరా డిపోల్లో కందిపప్పు లేదని డీలర్లు చేతులెత్తేయడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ నుంచి కందిపప్పు సరఫరాలో ఆలస్యం జరిగిందని.. సోమవారం నాటికి అన్ని డిపోల్లోనూ సరఫరా చేస్తామని పౌర సరఫరాల సహాయ సరఫరా అధికారి ఎమ్.వి.ప్రసాద్ తెలిపారు.

మరో పక్క, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ఇవాళ రాష్ట్రంలో 26 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. శనివారం ఉదయం 10 గంటల వరకు 180 కేసుల నమోదవగా అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో 10 పాజిటివ్​ కేసులను నిర్ధరించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 190కి చేరింది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో, 15 పోజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో, కూడా 15 పోజిటివ్ కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో 19 పోజిటివ్ కేసులు వచ్చాయి. కడపలో 23 పోజిటివ్ కేసులు, గుంటూరులో 26 పాజిటివ్ కేసులు వచ్చాయి.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరింది. రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 23, చిత్తూరు జిల్లాలో 7 కొత్త కేసులు నమోదవగా... ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు... కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ తాజాగా బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 9:00 నుంచి ఇవాళ ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలు లో 2, చిత్తూరు లో 7, కర్నూల్ లో 23, నెల్లూరు లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా, అనంతపురంలో 3, చిత్తూరులో 17, ఈస్ట్ గోదావరిలో 11, గుంటూరులో 30, కడపలో 23, కృష్ణాలో 28, కర్నూల్ లో 27, నెల్లూరులో 34, ప్రకాశంలో 23, విశాఖలో 15, వెస్ట్ గోదావరిలో 15 పోజిటివ్ కేసులు వచ్చాయి. శ్రీకాకుళం, విజయనగరంలో, ఇప్పటి వరకు ఎలాంటి కేసులు రాలేదు. ఇక మరో పక్క, తెలంగాణలో రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 272కు చేరింది. గత రెండు రోజుల్లో ఏకంగా 118 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అత్యధికంగా 490 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తమిళనాడులో 485, దిల్లీలో 445, కేరళలో 306, తెలంగాణలో 269, ఉత్తరప్రదేశ్​లో 227 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాజస్థాన్​లో 200, ఆంధ్రప్రదేశ్​లో 161, కర్ణాటకలో 144, గుజరాత్​లో 105, మధ్యప్రదేశ్​లో 104 కేసులు నమోదవగా.. జమ్ముకశ్మీర్​లో 92, పశ్చిమ బంగాలో 69, పంజాబ్​లో 57, హరియాణాలో 49, బిహార్​లో 30, అసోంలో 24, ఉత్తరాఖండ్​లో 22, ఒడిశాలో 20, ఛత్తీస్​గఢ్​లో 22, లద్ధాఖ్​లో 14 మంది కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. అండమాన్​ నికోబార్​ దీవుల్లో 10, ఛండీగఢ్​లో 10, గోవాలో 7, హిమాచల్​ ప్రదేశ్​లో ​6, పుదుచ్చేరిలో 5 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జార్ఖండ్​, మణిపుర్​లో చెరో రెండు కేసులు, మిజోరాం, అరుణాచల్​ప్రదేశ్​​లో చెరో కేసు వచ్చినట్లు గణాంకాలు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.

భారత్​లో కరోనా వైరస్​ కేసులు 3,374కు పెరిగాయి. ఇప్పటివరకు మొత్తం 77 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3030 కేసులు యాక్టివ్​లో ఉండగా, 26 మందిని డిశ్చార్జి చేశారు. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లిపోయాడు. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మృతి చెందారు. గుజరాత్​లో 10, తెలంగాణలో 7, మధ్య ప్రదేశ్​, దిల్లీలో చెరో ఆరు, పంజాబ్​లో 5 మంది మరణించారు. కర్ణాటక - 4, పశ్చిమ బంగా - 3, తమిళనాడు - 3, జమ్ముకశ్మీర్​, ఉత్తరప్రదేశ్, కేరళలో చెరో రెండేసి మరణాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్​, బిహార్​, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు చనిపోయారు. రాజస్థాన్​లోని జైపూర్​కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. ఫలితంగా ఈ రాష్ట్రంలోని మొత్తం మృతుల సంఖ్య 6కు చేరింది.

Advertisements

Latest Articles

Most Read