ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య తీవ్ర ఆగాధం ఏర్పడింది. ప్రభుత్వం తమను మోసం చేసింది అంటూ, ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉద్యోగులు సమ్మె చేస్తాం అని చెప్పటం అంటే, ప్రభుత్వం ఎంత విఫలం అయ్యిందో తెలుసుకోవచ్చు. పీఆర్సీ పేరుతో తమను మోసం చేసారని, ఈ రోజు కలక్టరేట్ ముట్టడి కూడా చేసారు ఉద్యోగులు. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితి మధ్య నిరసనలు నడుస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే, ఈ రోజు ఉద్యోగులు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ సంఘం ఈ సంఘం అని లేకుండా, అన్ని సంఘాలు కలిసి ఒకే ఐక్య వేదికగా ఏర్పడాలని, అన్ని అభిప్రాయ బేధాలు పక్కన పెట్టి, పని చేయాలని, కలిసి ఉద్యోమాలు చేయాలని, ఎవరికి తోచిన విధంగా వారు కాకుండా, అందరం ఒక మాట మీద ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి, ఈ రోజు సాయంత్రం ఒక మీడియా సమావేశం పెట్టి, జగన్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేయనున్నారు. మరి ఉద్యోగుల ఒత్తిడికి జగన్ దిగి వస్తారో, మొండిగా వెళ్తారో చూడాలి.
news
కేంద్రం నిర్ణయంతో, ఏపి ప్రభుత్వం షాక్.. విడుదల చేసిన రూ.320 కోట్లు వెనక్కు తీసుకున్న కేంద్రం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా జరీ చేసిన బిల్లులుకు సంబంధించి, దాంట్లో రీయింబర్స్ చేస్తామని కేంద్రం సమాధానం చెప్పి, ఆ తరువాత నిధులు ఇవ్వటం లేదు అనే విషయాన్ని తాపీగా చెప్పింది. ముఖ్యంగా పోలవరంలో ఆశించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయటం లేదని, కాంక్రీట్ పనులు కూడా చేయటం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. ఇదే అంశం పై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా, చేపట్టిన పనులకు సంబంధించి 730 కోట్ల రూపాయాలు రీయింబర్స్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి బిల్లులు పంపించింది. అయితే ఇందులో తొలి విడతగా, 320 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటమే కాకుండా, ఏ ఎకౌంటు లో వేయాలో, ఎకౌంటు వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, పోలవరానికి చెందిన ఖాతా నంబర్ కాకుండా, వేరే ఎకౌంటు నెంబర్ ఇవ్వటంతోనే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. దీనికి తోడుగా , పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వెళ్ళిన బిల్లులకు సంబంధించి, 320 కోట్లు మాత్రమే విడుదల చేయాలని భావించారు.
అయితే ఆ మేరకు పనులు అక్కడ చేయటం లేదని, అక్కడ కనపడటం లేదని, కేంద్రం గుర్తించి ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలోనే, ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఇవ్వకపోవటం, అలాగే ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకోవటం , ఈ రెండు పరిణామాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా, ప్రాజెక్ట్ అధికారులు కూడా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కేంద్రం తాను ఎందుకు, ఈ నిర్ణయం తీసుకుంది కూడా స్పష్టంగా పేర్కొంది. నిర్ణీత వ్యవధిలో, ఆశించిన మేరకు పనులు చేయకుండా ఉండటమే, దీనికి కారణం అని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కొర్రీ పెడుతూనే ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయటంలో విఫలం అవుతూ వస్తుంది. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏమి చేస్తుందో చూడాలి మరి.
కొడాలి నానికి బిగ్ షాక్.. క్యాసినో వ్యవహారం పై విచారణకు ప్రత్యేక అధికారి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గుడివాడలో ఏకంగా గోవా తరహా క్యాసినో రావటం పై, ఏపి ప్రజలతో పాటు, పక్క రాష్ట్రాల వారు కూడా షాక్ తిన్నారు. గుడివాడలోని కొడాలి నాని కన్వేషన్ సెంటర్ లో తెరిచిన ఈ దుకాణం పై, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, మీడియాలో కధనాలు వచ్చాయి. అయినా సరే, యధేచ్చగా మూడు రోజులు పాటు కొనసాగాయి. పోలీసులు మీ మూడు రోజులు అటు వైపు చూడలేదు. దీని పైన తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. విషయం పెద్దది కావటం, ప్రజల్లో వ్యతిరేకత రావటంతో, ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అధికారాల్లో కదలిక వచ్చింది. కృష్ణా జిల్లా ఎస్పీ దీని పైన స్పందించారు. అయితే స్థానిక పోలీసులు అయితే, ఒత్తిడికి తలొగ్గుతారని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను, ఈ అంశం పై విచారణ అధికారిగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ నియమించారు. అయితే ఈ విచారణ మొత్తం నిజంగా వాస్తవాలు బయటకు తీస్తారా, లేక తూతూ మంత్రంగా ముగిస్తారా అనేది చూడాల్సి ఉండి. మొత్తం మంత్రి కొడాలి నాని ఇలాకలో ఈ వ్యవహారం జరిగిన విషయం తెలిసిందే. స్థానిక పోలీసులు అందరూ కొడాలి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. అందుకే మూడు రోజుల పాటు, అంత పెద్ద ఎత్తున జరిగినా, అటు వైపు ఎవరూ వెళ్ళే సాహసం కూడా చేయలేదు.
ఈ అంశం దృష్టిలో పెట్టుకునే, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను విచారణ అధికారిగా వేసారు. అయితే శ్రీనివాసులు వాస్తవాలు బయటకు తెస్తారో లేదో చూడాలి. అసలు అక్కడ ఏమి జరిగింది ? మంత్రి కళ్యాణమండపంలోనే ఎలా ఏర్పాటు చేసారు ? దీని వెనుక ఉన్న బడా బాబులు ఎవరు ? నిర్వాహకులు ఎవరు ? పోలీసులు అటు వైపు ఎందుకు వెళ్ళలేదు ? ఎంత వసూలు చేసారు ? ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ జరిగాయి, ఇలా అనేక అంశాలు బయటకు వస్తాయో రావో చూడాల్సి ఉంది. మధ్య తరగతి ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున నష్టపోయారని వార్తలు వస్తున్నాయి. మరో పక్క ఈ విషయం పై ఇప్పటికే కొంత మంది హైకోర్టు కూడా ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో, ఇది పెద్దది అవుతున్న నేపధ్యంలో, తమ పైకి తప్పు రాకుండా, ఎస్పీ ముందుగానే అలెర్ట్ అయ్యారు. విచారణ అధికారిని నియమించారు. మరి వాస్తవాలు బయటకు వస్తాయా ? దీని వెనుక ఉన్న పెద్దలను బయటకు లాగుతారా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో.
కేసీఆర్ ఇంటి గేటు ముందే, జేసీ దివాకర్ రెడ్డికి అవమానం...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయుకుడు జేసీ దివాకర్ రెడ్డి, ఈ రోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వచ్చారు. కేసీఆర్ ని కలిసేందుకు ప్రయత్నం చేసారు. అయితే ప్రగతి భవన్ లోకి వెళ్ళాలి అన్నా, కేసీఆర్ ని కానీ, కేటీఆర్ ని కానీ కలవలాన్నా, అప్పాయింట్మెంట్ తప్పనిసరి కావలసిన పరిస్థితి ఉంది. అయితే జేసీ మాత్రం ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా, యాన్ ప్రగతి భవన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేసారు. అయితే ప్రగతి భవన్ సిబ్బంది, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది జేసీ దివాకర్ రెడ్డిని వారించారు. అనుమతి లేనిదే తాము ఎట్టి పరిస్థితిలో కూడా లోపలకు అనుమతించ లేమని, దయ చేసి అర్ధం చేసుకోవాలని, లేదా ప్రగతి భవన్ లోని పెద్దల నుంచి ఫోన్ చేసినా పంపిస్తామని అన్నారు. అయితే జేసీ మాత్రం, తనకు అపాయింట్మెంట్ ఇచ్చేది ఏమిటి, లోపలకు వెళ్తానని ఆయన వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ ని కాకపోయినా, కేటీఆర్ తో అయినా కలుస్తానని, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మాత్రం, అపాయింట్మెంట్ లేనిదే తాము అనుమతి ఇవ్వలేమని, అర్ధం చేసుకోవాలని అన్నారు. దీంతో జేసీ ఏమి చేసేది లేక, వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
జేసీ దివాకర్ రెడ్డి, ఈ మధ్య తరుచూ తెలంగాణా అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీకి, అలాగే తెలంగాణాలో ఉన్న గాంధీ భవన్ కు వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాల గురించి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం, ఇవన్నీ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే అప్పట్లో ఆయన తాను కేసీఆర్ ని కలుస్తానని, అనేక విషయాలు చర్చిస్తామని చెప్పారు. అయితే ఇదే తరహాలు ఇప్పుడు ఆయన, ఏకంగా కేసీఆర్ ఇంటికి అపాయింట్మెంట్ లేకుండా, రావాటం తో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్ తో అయినా కలుస్తానని ఆయన చెప్పినా కూడా, పోలీసులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి తప్పక ఇక వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి తరుచూ ఇలాంటి సంచలనాలు చేస్తూ ఉంటారు. ఆయనది వేరే స్టైల్. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆయన ప్రగతి భవన్ కు రావటం, కేసీఆర్ ని కలవటం చేయలేదు. మరి ఈ విషయం తెలిసి, కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో చూడాలి.