ఒక్కసారి ప్రభుత్వం మీద, ప్రజలకు నమ్మకం పోతే, ఏమి జరుగుతుందో చెప్పే సంఘటన ఇది. ఈ రోజుల్లో సెంటు భూమి ప్రభుత్వాలు, ప్రజల నుంచి తీసుకోవాలి అంటేనే, అది ఒక పెద్ద తలనొప్పి. అలాంటిది, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి అనే నగర నిర్మాణానికి, అమరావతి రైతులను ఒప్పించి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 33 వేల ఎకరాలు ఒక్క చిన్న సంఘటన జరగకుండా తీసుకున్నారు. రైతులు కూడా అలా సహకరించారు. అయితే అక్కడ భూములు ఇచ్చింది ఏపి ప్రభుత్వానికి, చంద్రబాబుకి కాదు అని మర్చిపోయిన, తరువాత వచ్చిన పాలకులు, అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో, అమరావతిని మూడు ముక్కలు చేసారు. దీంతో అమరావతి రైతులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా, అమరావతి రైతుల దీన గాధలు విని, ప్రభుత్వాలను నమ్మి భూములు ఇస్తే, తరువాత వచ్చే ప్రభుత్వాలు వాటిని నిలిపివేస్తే ఏమి అయిపోతాం, మన వ్యవసాయం ఏదో మనమే కిందా మీద పడి చేసుకుందాం అనే స్థాయికి వచ్చేశారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఈ రోజు ఇదే ఆంధ్రప్రదేశ్ లో, అదే అమరావతిలో, అదే ప్రభుత్వానికి జరిగింది. రైతులు నుంచి వచ్చిన వ్యతిరేకత చూసి, ప్రభుత్వ అధికారులు కూడా ఏమి చెయ్యలేక వెనక్కు వచ్చేసిన పరిస్థితి. ప్రభుత్వం అనేది నమ్మకాన్ని ఇవ్వాలి అనేది ఇందుకే.
ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వ హయంలోనే, గోదావరి-పెన్నా నదుల అనుసందానం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం భూమి పూజ కూడా చేసారు. ప్రాజెక్ట్ కు అవసరం అయిన భూమిని సమీకరించాలని, రైతులకు డబుల్ రేటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులు కూడా కొంత మంది దీనికి ఒప్పుకున్నారు. అయితే ప్రభుత్వం మారింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, మళ్ళీ ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ రోజు గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కోసమని, భూసేకరణ కోసం, గుంటూరు జిల్లా అమరావతి మండలంలో ఉన్న, ధరణికోట, వైకుంఠపురం, లింగాపురం తదితర గ్రామాల్లో, అధికారులు గ్రామ సభలు పెట్టి, ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మించే కాలువల కోసం, భూములు ఇవ్వాలని రైతులని విజ్ఞప్తి చేసారు. అంతే కాదు, ఎక్కువ రేటుకు భూములు తీసుకుంటాం అని, మీకు అన్ని విధాలుగా లాభం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అంతే ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మీరు ఇచ్చే డబ్బులు వద్దు, ఏమి వద్దు, మేము సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వం అంటూ, రైతులు ఎదురు తిరిగారు. రాజధాని అమరావతి కోసం, రైతులు 34 వేల ఎకరాలు ఇస్తే వారిని నట్టేట ముంచారని, ఇప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వలేమని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. మా భూములు త్యాగాలు చేసి, కోట్ల రూపాయల విలువ చేసే భూమి, ప్రభుత్వాన్ని నమ్మి, మేము ఇవ్వలేము అని రైతులు అన్నారు. ఒక పక్క అమరావతి రైతులు ఆందోళన చూస్తూ, ఎవరిని నమ్మి భూములు ఇస్తాం అని అన్నారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని, కానీ ఇప్పుడు ఎవరిని నమ్మి ఇవ్వాలని ? ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటే, వచ్చే ప్రభుత్వం వచ్చి మేము చెయ్యం అని, ఇప్పుడు చేసినట్టే చేస్తే, మా పరిస్థితి ఏమిటని ? ఎటూ ఉపయోగం లేని మా భూములు చూసి, వాళ్ళు 250 రోజులుగా ఏడుస్తున్న ఏడుపులు చూసి కూడా ఎలా ఇస్తాం అని అన్నారు. అంతే కాదు అధికారులు గో బ్యాక్ అంటూ, నినాదాలు చేసారు. దీంతో చేసేది ఏమి లేక అధికారులు వెనుదిరిగారు.