సోమవారం రాత్రి సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సంబంధించి, వరదలకు సంబంధించి జరుగుతున్న విషయాలు చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ పూర్తి అయిన తరువాత, ఒక విలేకరి ఓ ప్రశ్న అడిగారు ? ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటున్నారు, మరి కొత్తగా ఎన్నివేల ఎకరాలు భూమి స్థిరీకరణ జరిగింది అని ప్రశ్నించారు. దానిపై ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ "కొత్తగా స్థిరీకరణ సంగతి పక్కన పెట్టండి, పట్టిసీమ ప్రాజెక్టు కట్టకపోతే, కృష్ణాడెల్టా పరిస్థితి ఏమిటో, ఒకసారి ఆలోచించండి. పట్టిసీమ వల్ల, గత మూడేళ్ల నుంచి జూన్‌లోనే, ఈ ప్రాంతానికి నీరు ఇచ్చి, దాదాపు 13లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిన సంగతి తెలుసుకదా..? అదే పట్టిసీమ కట్టకపోతే, ఈ ప్రాంత రైతుల జీవితాలన్నీ గాల్లో దీపాలే కదా ? అంటూ సమాధానం చెప్పారు.
ఇప్పటి వరకు 9 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తం 90వేల కోట్ల వ్యయంతో 29 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలనేదే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం రూ. 33వేల 720 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మరో ఆరువేల కోట్ల ఖర్చుతో గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా పెండింగ్‌లో ఉన్న 57 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా కరవును అధిగమించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫలితంగా రెండుకోట్ల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, మరో కోటి ఎకరాల మేర ఉద్యానవన పంటలను సాగులోకి తీసుకు వస్తామన్నారు. ప్రస్తుతం కోటీ పది లక్షల ఎకరాలకు నీరందుతోందని తెలిపారు.
జలవనరుల నిర్వహణ ద్వారా 2.3 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. స్మార్ట్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో ప్రజలకు జల భద్రత కల్పిస్తామన్నారు. వంశధార నుంచి ఐదు నదులు అనుసంధానం చేసి మహా సంగమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. రాయలసీమ ప్రాంతానికి గతంలో కంటే ఈ సారి ఎక్కువ నీరందించ గలిగామన్నారు. అసాధారణ పరిస్థితులను సాధ్యం చేయగలిగామనే తృప్తి మాకు ఉందన్నారు. వర్షం ఎక్కువగా కురిసే జిల్లాతో పాటు పేదరికం, వలసలు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని అలాంటి జిల్లాను సస్యశ్యామలం చేయగలిగిన ఘనత తమకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండి నీరు ప్రవహిస్తోందని వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని వివరించారు.