తాను పరుగుతీస్తూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించానని, నాలుగేళ్ళలో దేశం ఏపీ వైపు చూసేలా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రగతిపథంలో పయనించేలా శ్రమించానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో అందరి సహకారం అనివార్యమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని దోనేపూడి గ్రామంలో సోమవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నవ్యాంధ్ర సాధనలో త్యాగాలకు సిద్ధమని, 2004లో జరిగిన తప్పిదాన్ని పునరావృతం చేయొద్దంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఒకసారి ప్రజలు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి పోయిందని తెలిపారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్ అవసరాల దృష్ట్యా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. కుల, మత వర్గ భేదాలకు, అవినీతికి, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనేదే సర్కారు లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ది, ఆనందం, ఆరోగ్యం ఈ మూడు ప్రతి పేదవాని కళ్ళల్లో కనపడాలని, అదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి కట్టించి ఇస్తామన్నారు.
మహిళల ఆత్మ గౌరవాన్ని నిలిపేందుకు చేపట్టి నిర్మించిన మరుగుదొడ్లను ప్రతి ఒక్కరూ వినియోగించాలని అన్నారు. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి చెప్పుకోలేనిదని, వారికి ఆ స్థితి కలుగకూడదనే ఆలోచనతో చంద్రన్న బీమా కింద సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. దోనేపూడి గ్రామంలో పెన్షన్లకు సంబంధించి అందిన 32 దరఖాస్తులను ఆమోదిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై గ్రామ స్థాయి అధికారులు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించారు. తొలుత చౌక దుకాణాల ద్వారా వినియోగ దారులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులపై లబ్దిదారులతోనూ , దుకాణాల డీలర్ల సమక్షంలో సమీక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై స్వయంగా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించారు. వారి ఇళ్ళల్లోకి వెళ్లి కుటుంబాలను పలకరించారు.