వైసీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ అనధికార ఒప్పందానికి వచ్చాయా? ఎన్నికల ముగిసిన తర్వాత పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయా? ఇందుకోసం ముందుగానే స్నేహ పూర్వక పోటీ చేస్తాయా అంటే, అవును అనే సమాధానం వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పనులతో, ఇది క్లియర్ గా అర్ధమవుతూ ఉండగా, ఢిల్లీలో విజయసాయి రెడ్డి చేసిన చర్చల గురించి, మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగా, బీజేపీకి కనీసం 15 సీట్లు త్యాగం చెయ్యాలని అమిత్ షా నిర్ణయంతో, జగన్ అంగీకరించినట్టు సమాచారం. 15 చోట్ల లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే, కొన్ని స్థానాల్లో బలమైన నాయకులను తప్పించి, బలహీన నేతలను ఇన్‌చార్జులుగా నియమిస్తున్నాడు జగన్.
నాలుగేళ్లుగా గుంటూరు-2 స్థానంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న బలమైన నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని జగన్ ఆకస్మికంగా తప్పించారు. ఇటీవలే పార్టీలో చేరిన ఏసురత్నానికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఈయనెవరో వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోసమే ఈ మార్పు జరిగిందని, గుంటూరు-2లో ఆయన గెలుపు అవకాశాలు పెంచడం కోసమే అప్పిరెడ్డిని తప్పించారని పేర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు. సుమారు పదిహేను శాసనసభ, మూడు నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి వైసీపీ సహకరించేలా అంతర్గత ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాల్లో సిట్టింగ్‌లతో పాటు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు ఉంటారని చెబుతున్నారు. ఆ ఇద్దరూ కన్నాతో కలిసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం.
కేసుల విషయంలో సహకరిస్తామన్న హామీ కారణంగానే జగన్ ఇలాంటి త్యాగాలకు సిద్ధపడుతున్నారని.. కొందరు బీజేపీ నేతలు పోటీ చేసే ప్రాంతాల్లో బలహీన నేతలను నిలపాలన్న డిమాండ్‌కు అంగీకరించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు.. జగన్ ఆకస్మికంగా ఇన్‌చార్జులను మార్చడంపై వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ స్థానంలో విడదల రజనీని ఇన్‌చార్జిగా నియమించడంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నెత్తిన పాలుపోసినట్లుయిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మైలవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జోగి రమేశ్‌ను కాదని.. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను నియమించారు. విజయవాడ తూర్పులో నాలుగేళ్లు ఇన్‌చార్జిగా ఉన్న భవకుమార్‌ను తప్పించి, కొద్దినెలల క్రితం పార్టీలో చేరిన యలమంచిలి రవికి బాధ్యత అప్పగించారు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణను విజయవాడ సెంట్రల్ నుంచి అక్కడకు వెళ్లాలని సూచించారు. ఇవన్నీ కేవలం, బీజేపీని గెలిపించటానికి, జగన్ చేసే ప్రయత్నాల అని, ఈ సీట్లు జగన్, బీజేపీకి సహాయం చేస్తారని తెలుస్తుంది.