మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్, జనసేన పార్టీ సభ్యుడు, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన గత కొంత కాలంగా పార్టీ మారుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఆయన వ్యవహార శైలి, జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూర్చాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, జేడీలక్ష్మీనారాయణ ఒకే ఒకసారి, జనసేన సమీక్ష కార్యక్రమంలో పాల్గున్నారు. తరువాత నుంచి ఆయన పార్టీలో ఎక్కడా కనిపించలేదు. అయితే మొన్న ప్రకటించిన జనసేన పార్టీ కమిటీల్లో, ఎక్కడా లక్ష్మీనారయణకు, పవన్ చోటు ఇవ్వలేదు. లక్ష్మీనారాయణ లాంటి నేతకు ఎందుకు చోటు ఇవ్వలేదో ఎవరికీ అర్ధం కాలేదు. దీంతో, ఆయన పార్టీ మారతారనే సమాచారం ఉండాబట్టె, పవన్ కళ్యాణ్ ఆయనకు ఏ కమిటిలో కూడా చోటు ఇవ్వలేదని ప్రచారం జరిగింది.
మరో పక్క పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సొంత కార్యక్రమాలకు, సొంత ఇమేజ్ లకు పార్టీని వాడుకుంటే చూస్తూ కూర్చును అంటూ చేసిన వ్యాఖ్యల పై కూడా ఊహగానాలు వచ్చాయి. లక్ష్మీనారయణ పార్టీ కార్యక్రమాలు కాకుండా, తన సొంత కార్యక్రమాలు చేసుకుంటూ, జనసేన కార్యకర్తలను వాడుకుని ఇమేజ్ పెంచుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగి, అందుకే పవన్ అలా అన్నారనే వాదన నడిచింది. ఈ పరిణామాలు అన్నిటి నేపధ్యంలో, నిన్నటి నుంచి, లక్ష్మీనారయణ పార్టీ మారుతున్నారు అంటూ, అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ లో ప్రచారం మొదలైంది. అటు జనసేన వర్గాలు కాని, లక్ష్మీనారాయణ కాని ఖండించకపోవటంతో, ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. ఈ నేపధ్యంలోనే, లక్ష్మీనారయణ ఈ విషయం పై ఘాటుగా స్పందించారు.
తన ట్విట్టర్ లో దీనికి సంబంధించి, ఘాటు వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిరేకులు ఇలాంటి వార్తలు పుట్టిస్తే, ఫూల్స్ ఇలాంటి వాటిని ప్రచారం చేస్తారని, ఇడియట్స్ ఇలాంటివి నిజమే అని నమ్ముతారని, ఘాటుగా బదులిచ్చారు. నా అవసరం పవన్ కళ్యాణ్ కు ఉన్నది అన్నంత వరకు, నేను పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని, లక్ష్మీనారాయణ అన్నారు. ఇలాంటి వార్తల పై కాకుండా, వరద సహాయం చెయ్యటం, చెట్లు నాటటం, యువతను తీర్చిదిద్దటం వంటి పనులు చెయ్యాలని కోరుకుంటున్నా , జై హింద్ అంటూ లక్ష్మీనారయణ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీంతో, ఆయన అన్ని వార్తలకు ఒక్క దెబ్బతో ఫుల్ స్టాప్ పెట్టారు.