ఎన్నికల్లో గెలవలేమని 6 నెలల ముందే మోదీ, జగన్‌కు తెలుసని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారంతా ఎన్ని వేల కోట్లు వెదజల్లినా ప్రజాతీర్పును మాత్రం మార్చలేరని చెప్పారు. మోదీ, అమిత్ షాకు వ్యవస్థల నాశనంతో సంతృప్తి లేదన్నారు. అందుకే ఇప్పుడు ఏకంగా ఈసీకే తూట్లు పొడిచే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థల మనుగడకే బీజేపీ పెను ప్రమాదంగా మారిందన్నారు. అందుకోసమే సేవ్ డెమోక్రసీ-సేవ్ కానిస్టిట్యూషన్ ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా అన్యాయాలను ఎదుర్కోవాల్సింది ప్రజలేనని పిలుపునిచ్చారు. అలాగే జగన్, కేసీఆర్ కుట్రలను భగ్నం చేయాల్సింది కూడా జనమేనని తెలిపారు. భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నామని, ఈ ధర్మపోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేయాలని కోరారు.
ఇంటలిజెన్స్ డీజీకి ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉంటుందా..? , నిఘా విభాగాధికారిని బదిలీ చేయడం ఏపీపై కక్ష సాధింపేనన్నారు. జగన్ కోరేదే మోదీ చేస్తాడు...జగన్ అడిగిందే కేసీఆర్ ఇస్తాడని స్పష్టంచేశారు. మోదీ, అమిత్‌షా, కేసీఆర్, జగన్ ఏపీకి దుష్టచతుష్టయమని వెల్లడించారు. మూడు పార్టీలకు పోయేకాలం దాపురించిందన్నారు. అందుకే ఇన్ని దుర్మార్గాలు-దాష్టీకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరానికి టీఆర్ఎస్ అడ్డుపుల్లలు, పదేపదే కొర్రీలు పెడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని వివరించారు. ఏపీ రైతుల్లో ఆనందం చూసి కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమ చెరువుల్లో నీళ్లు చూసి ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు.
అలాగే వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు సమాధి చేసే కుట్ర జరుగుతుందన్నారు. సిట్ నివేదిక బయటకు రాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని వివరించారు. హంతకుల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు. గొరిల్లా యుద్ధంలో జగన్ సిద్ధహస్తుడు.. దొంగ దెబ్బ తీసి పారిపోవడం జగన్‌కు అలవాటేనన్నారు. నిన్న ఏ-1 జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో పత్తాలేడని ఎద్దేవాచేశారు. ఏ-2 విజయసాయి రెడ్డి నిన్న కలుగులో నక్కాడన్నారు. అంటే ఎక్కడో కుట్రలకు స్కెచ్‌లు వేసినట్లేనని చెప్పారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్ పెత్తనానికి ఓటేసినట్లేనని వివరించారు. దేశానికి నరేంద్రమోదీ ఒక విపత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు జగన్మోహన్ రెడ్డి తీవ్ర విపత్తుగా అభివర్ణించారు.