అసెంబ్లీలో ఈ రోజు చంద్రబాబు బీజేపీ పై విరుచుకు పడ్డారు. మోడీ, అమిత్ షా చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. బీజేపీ, వైసీపీల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు చంద్రబాబు. ఈ సందర్భంగా, తిరుమల కొట్టేయటానికి, మోడీ పన్నిన పన్నాగం గురించి వివరిస్తూ, మోడీని హెచ్చరించారు. తిరుమల పై కూడా రాజకీయాలు చేస్తున్నారు, ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడే కలియుగ దైవం. ఆయన జోలికి వస్తే, ఆయనే చూసుకుంటాడు. కాలియుగ వేంకటేశ్వరస్వామితో ఎవరైనా ఆడుకోవాలని అనుకుంటే ఆయన వారితో ఆడుకుంటాడు. వచ్చే జన్మదాకా ఆగాల్సిన అవసరం లేదు. ఆయన ఈ జన్మలోనే చూసుకుంటాడు. ఈ విషయంలో నాకు బాగా నమ్మకం ఉంది’ అని తెలిపారు.
హిందువులను రక్షిస్తామని చెప్పే బీజేపీ నేతలు, టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇటీవల కోర్టులకు వెళ్లడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కేరళలో శబరిమల విషయంలో, ఎలా రచ్చ చేసి రాజకీయ రంగు పులిమింది చెప్పారు. అక్కడ లాగే, ఇక్కడ కూడా చేద్దామని చూసారని, కాని వారి ఆటలు ఇక్కడ సాగలేదని అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాకేశ్ అస్థానా ఇంటెలిజెన్స్ డీజీగా ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని మోదీ ఇప్పుడు సీబీఐలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారని విమర్శించారు. అందుకే సీబీఐకి ఆంధ్రప్రదేశ్ లో సమ్మతి ఉత్తర్వులను రద్దుచేశామని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పెట్టించిన కొత్త ప్రపోజల్ పేరే ఫెడరల్ ఫ్రంట్ అని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ ఫెడరల్ ఫ్రంట్ వేదికగా కేసీఆర్, జగన్ కలిసి ఇక్కడ రాజకీయం చేయబోతున్నారని విమర్శించారు. తాను యూటర్న్ తీసుకున్నానని విపక్షాలు ఆరోపిస్తున్నాయనీ, తనది ఎన్నటికీ రైట్ టర్నేనని వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తున్నది ధర్మపోరాటమనీ, అందులో అంతిమం విజయం తమదేనని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు మాట్లాడిన చంద్రబాబు.. కేంద్రంతో పాటు వైసీసీ, టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. జగన్ పై నమోదయిన కేసులను బీజేపీ నీరుగార్చబోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క జగన్ మాత్రమే కాకుండా ఆర్థిక నేరగాళ్లందరినీ కాపాడేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇప్పుడు నోటీసులు పంపించి వేధిస్తున్నారని విమర్శించారు. కోడి కత్తి కేసులో ఎన్ఐఏకు జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఎన్ఐఏ చట్టాన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు.