మాజీ రాష్ట్రపతి, భారత రత్న దివంగత డా. అబ్దుల్ కలాం పేరు చెప్తే, ప్రతి విద్యార్ధిలో ఎంతటి స్పూర్తి వస్తుందో, అందరికీ తెలిసిందే. ఆయన దేశానికి నిస్వార్ధంగా చేసిన సేవ, విద్యార్ధులకు ఒక మార్గదర్శిగా ఉండటంతో, ఆయన ఎంతో మందికి ఆదర్శం అయ్యారు. విద్యార్ధులకే కాదు, చంద్రబాబు లాంటి మహా మహా రాజకీయ నాయకులకు కూడా ఆయన మార్గదర్శం. అందుకే, ఆయన్ను రాష్ట్రపతిగా ప్రతిపాదించి, ఆనాటి ప్రధాని, వివిధ మిత్రపక్షాలను, చివరకు ప్రతిపక్షాన్ని కూడా ఒప్పించి, డా. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసారు. అంతే కాదు, చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత, డా. అబ్దుల్ కలాంను స్పూర్తిగా తీసుకోవాలని, ప్రతి నిత్యం విద్యార్ధులకు చెప్తూ ఉండేవారు. ఆయాన చనిపోయిన తరువాత, విశాఖపట్నంలో, డా. అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, విద్యార్ధులకు స్పూర్తి నింపే ప్రయత్నం చేసి, దేశ వ్యాప్త ప్రశంసలు అందుకున్నారు.
అలాగే 10వ తరగతి పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతి ఏటా అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు నాడు ప్రతిభ అవార్డులు కింద విద్యార్థులకు "Dr. A. P. J Abdul kalam Pratibha Puraskar" అవార్డులు ఇస్తూ, చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత రెండు ఏళ్ళుగా అది సాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. 2019లో చంద్రబాబు దిగిపోయి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి ఎక్కారు. గతంలో చంద్రబాబు గుర్తులు ఏమి కనిపించకుండా, అన్నీ చెరిపేస్తూ వస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలు, ప్రతి చోట రంగులు మార్చేస్తూ, చివరకు ఒక చోట జాతీయ జెండా రంగాలు కూడా మార్చేసి, వైసీపీ రంగులు వేసుకుంటూ, జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
ఈ క్రమంలో భాగంగానే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు ప్రవేశపెట్టిన, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార్ అవార్డును రద్దు చేసారు. రద్దు చేస్తే చేసారు, పోనీ అంతటి మేధావి పేరు మీద ఈ, అవార్డు ఇస్తున్నారా అంటే, లేదు. ఒక రాజకీయ నాయకుడు పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ పేరు చెరిపేసి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఈ పురస్కారం ఇస్తున్నట్టు, కొత్త ప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మారుస్తూ, నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని, ప్రధమ పౌరుడిగా విశ్వఖ్యాతిని గడించిన ఓ గొప్ప దార్శనికుడి పేరు మీద, విద్యార్ధుల్లో స్ఫూర్తిని నింపడానికి ఇచ్చే ప్రతిభా పురస్కారాల పై రాజకీయ నీలినీడలు కమ్ముకోవడం దురదృష్టకరం.