తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దృష్టి సారించారు. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని ఏపి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం వరకు కలిసి ఉన్న రాష్ట్రం 2014లో విడిపోయింది. అప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. తాజాగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నానని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలతో తెలంగాణ ఎన్నికలకు ఎన్నికల సంఘం జెండా ఊపింది. దీంతో తెలంగాణలో రాజకీయ కాక రగిలింది. గత నెల రోజులుగా రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేపట్టాయి. కేసీఆర్ తెలంగాణాకు ఏమి చెయ్యలేదని, మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పాటై ఉమ్మడిగా పోరాడుతున్నాయి.
తొలుత ప్రజాకూటమి నిలుస్తుందా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే కూటమిలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఉమ్మడి పోరుకు పార్టీలు సిద్ధం కావడంతో పోరు ఉద్ధృతం కానుంది. ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. విభజన చట్టం, హామీల అమలులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నమ్మక ద్రోహం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తూ కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అక్కడి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కీలక భూమిక పోషించారన్న వార్తలు వచ్చాయి. ఇదే తరహాలో తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి ఆ పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్న టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేయాలని చంద్రబాబు పిలుపునివ్వనున్నారు.
ఇప్పటివరకు చంద్రబాబు ఈ విషయంపై మాట్లాడకపోవడానికి కారణం బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ కలిసి వస్తారన్న నమ్మకంతోనేనని టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు. అయితే ఆయన నుంచి అలాంటి సంకేతాలు ఏవీ లేకపోగా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ వ్యక్తిగత దూషణలకు దిగడంతో తెలంగాణాలో స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడానికి బాబు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రధానంగా టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లో ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రజాకూటమిలోని ఇతర పార్టీలు కోరితే అక్కడ ప్రచారం చేసే అంశంపై కూడా చంద్రబాబు ఆలోచించవచ్చని తెలుస్తోంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైకాపా అధినేత జగన్‌లు తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పోటీ చేయడం లేదని స్పష్టమైంది. రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్‌పై, విభజన చట్టం, హామీల అమలు విషయంలో బీజేపీపై ఆగ్రహంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాదు నగరంలో టీడీపీ ప్రభావం గణనీయంగా ఉందని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. సుమారు 40 స్థానాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి టీడీపీకి ఉందని వారు విశ్వసిస్తున్నారు.