కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) కింద పని చేస్తున్న కూలీలకు వేతనాల చెల్లింపుల పై ప్రభావం చూపుతోంది. గత 25 రోజుల్లో చేసిన పనులపై రూ.413.64 కోట్ల బకాయిలు చెల్లించాలి. వారం నుంచి పది రోజులకు మించి బకాయిల్లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలున్నా నిధుల కొరతతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. నరేగా అమలులో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎంతో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇటీవలే గత ఏడాది (2017-18) వేతన బడ్జెట్ వ్యయంపై కేంద్రానికి యూసీ పంపింది. అంతేకాక ఈ ఏదాది (2018-19) ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య చేసిన ఖర్చుపైనా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు అధికారులు ఆడిట్ నివేదిక పంపారు.
దీనిపై తదుపరి ఆరు నెలలకు (అక్టోబరు నుంచి మార్చి) కేంద్రం నిధులు కేటాయిస్తుంది. నివేదికపై కేంద్రం ఈసారి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తదుపరి నిధుల విడుదలకు ప్రతిబంధకమైంది. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యమైనపుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సర్దుబాటు చేసిన సందర్భాలున్నాయి. కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యే విధానం అమలులోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా సర్దుబాటు చేసినా తిరిగి వాటిని రాబట్టుకోవడం కష్టమవుతోంది. గతంలో ఇదే విధంగా సమకూర్చిన రూ.700 కోట్లకు ఇప్పటికీ ఠికానా లేదు. దీంతో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే పరిస్థితి.
గత అనుభవాల దృష్ట్యా అధికారులు కూడా ప్రభుత్వం ముందు ఇలాంటి ప్రతిపాదనలు పెట్టడం లేదు. ఆడిట్‌పై కేంద్రం వ్యక్తం చేసిన అంశాలపై సమగ్ర వివరాలు పంపామని, నాలుగైదు రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్,. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏయే అంశాలపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్న విషయాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. నరేగాలో వేతన కార్మికులు: 63.62 లక్షలు.. వీరిలో పురుషులు: 23.56 లక్షలు ... మహిళలు: 35.06 లక్షలు... ఈ ఏడాది పని దినాల లక్ష్యం: 23.54 కోట్లు.. ఇప్పటివరకు కల్పించినవి: 18.14 కోట్లు... వేతన బడ్జెట్ ఖర్చు: రూ.3,627.22 కోట్లు...