ప్రధాని నరేంద్ర మోదీ ప్రవర్తన దేశంలో అనేక సమస్యలకు దారి తీసిందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ, అమిత్‌షా ఇద్దరూ కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. గహ్లోత్‌తో భేటీలో దేశ రాజకీయాలతో పాటు తమ ఉమ్మడి అజెండాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కీలకంగా చర్చించారు. శనివారం సాయంత్రం అమరావతిలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌తో భేటీ అనంతరం వారిద్దరూ కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తొలుత చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థలు నిబంధనల్ని పాటించడంలేదన్నారు.
ప్రమాదంలో పడిన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను కాపాడి వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి నాయకులపై ఉందన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ అవినీతిలో కూరుకుపోయే పరిస్థతి ఏర్పడిందని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాదే బాధ్యతన్నారు. ఆర్బీఐ కూడా స్వయంప్రతిపత్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈడీ, ఐటీ వ్యవస్థలను ప్రత్యర్థులపై కక్షసాధింపులకు, రాజకీయ లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదన్నారు. నోట్ల రద్దును స్వార్థం కోసమే చేశారు కాబట్టే ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన దారుణపరిస్థితి ఏర్పడిందన్నారు.
దేశంలో ఇప్పుడు రెండే కూటములు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఒకటి బీజేపీ అనుకూల కూటమి అయితే.. రెండోది బీజేపీ వ్యతిరేక కూటమి అని పేర్కొన్నారు. ఎవరు ఏ కూటమిలో ఉంటారో పార్టీలు ఆలోచించుకోవాలన్నారు. కలిసి నడుద్దామని కేసీఆర్‌ను కోరినా.. ముందుకు రాలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ కూటమిలో ఉంటుందో తేల్చుకోవాలన్నారు. తమతో చేతులు కలుపుతారో, లేదో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించుకోవాలని అన్నారు. మహాకూటమిలో చేరని పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అన్ని పార్టీలతో సమావేశమై.. ప్రతి అంశంపై చర్చిస్తామన్నారు. అప్పుడే కూటమిపై స్పష్టత వస్తుందన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాజకీయంగా కలిసి నడవడం కుదరదని అన్నారు.