రాజకీయం, వ్యాపారం, సినిమా.. ఈ మూడు కలిసిపోయి ఉంటాయి మన దేశంలో. వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, సినిమాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లోకి రావటం సర్వ సాధారణం. అలా అని వచ్చిన ప్రతి ఒక్కరూ క్లిక్ అవుతారా అంటే లేదు. ఉదాహరణకు అన్న ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే, మిగతా సినిమా హీరోలు రాజకీయల్లో చతికిల పడ్డారు. అలాగే కొంత మంది వ్యాపారస్తులు, వరుసగా ఎంపీలు అవుతుంటే, కొంత మంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ప్రజల మనసులు గెలవ లేక పోతున్నారు. అయితే ప్రజల మనసు గెలిచి, వరుసగా గెలుస్తున్న వాళ్ళు, రాజకీయాల్లో నిలదొక్కుకున్న సినిమా వారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే ఇలా గెలిచిన వారిని, బలహీన పరిచే కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఒకరు. అమర్ రాజా కంపెనీల వారసుడిగా ఉన్న గల్లా, రాజకీయల్లోకి వచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యారు. అంతే కాదు, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంచుకుని, పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీని, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఏపి తరుపున ధైర్యంగా మాట్లాడారు కూడా.
ఇప్పుడు గల్లా పై మరో ప్రచారం మొదలు అయ్యింది. గల్లా జయదేవ్ కంపెనీ అమర్ రాజా సంస్థతో తైవాన్ కంపెనీ సలోమ్ పార్టనర్ షిప్ కుదుర్చుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్లు పెట్టుబడి పెట్టటానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా, తన పెట్టుబడులు వ్యాప్తి చేస్తూ, తైవాన్ సంస్థ సలోమ్ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం, చిత్తూరులో అమర్ రాజా ఆటోమొబైల్ బ్యాటరీ ఉత్పత్తి కంపెనీతో, 100 కోట్లు పెట్టుబడి పెట్టటానికి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 800 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఈ వార్త బయట పడగానే, వైసీపీ ఆక్టివ్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ రావటం లేదు అని ప్రచారం చేస్తున్నారని, వైసీపీ అంటుంది.
గత 5 ఏళ్ళలో గల్లా రూపాయి పెట్టుబడి పెట్టలేదని, చంద్రబాబు మీద నమ్మకం లేదని, ఇప్పుడు జగన్ మీద నమ్మకంతో పెడుతున్నారని వైసీపీ ప్రచారం చేసింది. అయితే అలా ప్రచారం చేస్తుంటే, మరో పక్క టిడిపి ఎంపీనే ఇప్పుడు, మా జగనన్న పై నమ్మకంతో, పెట్టుబడి పెడుతున్నారు అంటూ, కొత్త ప్రచారం మొదలు పెట్టింది. మా జగనన్న అంటే అది అంటూ, గల్లాని ట్యాగ్ చేస్తూ రచ్చ చేసింది వైసీపీ. అయితే దీని పై అదే స్థాయిలో గల్లా రియాక్ట్ అయ్యారు. అమర్ రాజా గ్రూప్, గత 5 ఏళ్ళలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రూ.1800 కోట్లు పెట్టిందని, 6 వేల మందికి ఉపాధి ఇస్తుందని, భవిష్యత్తులో, 1100 కోట్లు పెట్టుబడి ఏపిలో పెట్టే ఆలోచన ఉందని చెప్పారు. తమ ఫ్యామిలీ ఎప్పుడూ, రాజకీయం, వ్యాపారం వేరేగా చూస్తూ వస్తుందని, స్థానిక యువతకు ఉపాధిని ఇచ్చే అంశంలో, అమర్ రాజా, ఏ ప్రభుత్వం ఉన్నా పెట్టుబడులు పెడుతూనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.