రాజధాని ప్రాంతంలో చెట్లు ఎందుకు కొడుతున్నారు? అది నేరం కాదా? ఆ సమయంలో అక్కడ పోలీసులు ఎందుకున్నారు? అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటి పై కోర్టు వద్ద ఫోటోలు, వీడియోలు ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీటన్నింటినీ సూమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణమూర్తి లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. నవరత్న పధకాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ ( సీఆర్డీయే) అధీనంలోని భూములను పేదల ఇంటి స్థలాలకు నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగింది. ఈ వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.

highcourt 05032020 2

ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరలను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన ఆవుల నందకిషోర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రముఖ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు తన వాదనలు వినిపించా రు. తుళ్లూరు గ్రామానికి చెందిన మరి కొంతమంది రైతులు ఇదే విషయమై దాఖలు చేసిన మరో పిల్‌పై ప్రముఖ న్యాయవాది ఎస్ ప్రణతి వాదించారు. ఇళ్లస్థలాలు ఇచ్చే స్థలాన్ని, చదును చేసేందుకు, పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని, వాటిని ఆపుతూ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్ట్ ను కోరారు. అయితే దీని పై కోర్ట్ స్పందిస్తూ, తాము ఆదేశాలు ఇవ్వలేమని, ఖర్చుచేస్తే సంబంధిత అధికారులు బాధ్యులవుతారని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరుపనున్నట్టు ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.

highcourt 05032020 3

సీఆర్డీయే పరిధిలోని భూములలో తమకు ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయిస్తే కొంతమంది దానిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో లబ్దిదారులు ఇంప్లీడ్ పిటీషన్లు దాఖలు చేశారు. తమను లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లేఖ ఆధారంగా తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన దాదాపు 450 మంది లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనను వినాల్సిందిగా వారంతా కోర్టును అభ్యర్థించారు. స్థలాల కేటాయింపు జరుగలేదు కదా ? ఈ దశలో మీకు ఏవిధంగా సంబంధం ఉంటుంది ? అని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ఆయా పిటీషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

అమరావతి శ్మశానమని, అక్కడ పందులు, గేదెలు తిరుగుతున్నాయి తప్ప, ఎవరూ నివాసముండటం లేదని చెప్పిన ప్రభుత్వపెద్దలు నేడు అదే అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తున్నారో చెప్పాలని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వహయాంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.1100కోట్లను ప్రభుత్వం 9నెలలైనా ఎందుకు చెల్లించడం లేదని ఉమా నిలదీశారు. పేదలు తమవంతు వాటాగా అప్పులు తెచ్చి ఇళ్లు నిర్మించుకుంటే, జగన్ ప్రభుత్వం వారిని రోడ్లపాలుచేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలమైన జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, చివరకు ఉపరాష్ట్రపతిని వేడుకునే స్థితికి దిగజారారన్నారు. ప్రభుత్వం విక్రయిస్తున్న పిచ్చిమందు (లిక్కర్)తాగి జనం చనిపోతున్నారని చెబితే, డిస్టిలరీ కంపెనీలకు జగన్ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని, అవి చెల్లించడంలేదు కాబట్టి, రాష్ట్రంలో పిచ్చిమందు అమ్ముతున్నామని మరో మంత్రి నిస్సిగ్గుగా సమాధానంచెబుతున్నాడని బొండా మండిపడ్డారు.

డిస్టిలరీలకు చెల్లించాల్సిన రూ.1600కోట్లను వాడుకున్న ప్రభుత్వం, ఆమొత్తం రుణంగా ఇవ్వమంటూ ప్రపంచబ్యాంక్ ని అడగటం సిగ్గుచేటన్నారు. ఇటువంటి దారుణాలు ఈ రాష్ట్రంలో తప్పమరెక్కడా ఉండవని, ఇటువంటి తుగ్లక్ చర్యలను కూడా మరెక్కడా చూడబోమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేదలకు ఇవ్వడానికి ఏజిల్లాలో ఎంతెంతభూమి కొన్నదో, ఎన్ని వేలఎకరాలు పంచిందో వెల్లడించాలని బొండా డిమాండ్ చేశారు. 26లక్షల మందికి ఇవ్వడానికి అవసరమైన 25వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలేమిటో, ఎకరం ఎంతచొప్పున కొని, పేదలకు పంచుతున్నారో పూర్తివివరాలు బయటపెట్టాలని, దానిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని ఉమా తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వం సాగిస్తున్న మద్యం మాఫియాపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడించడానికే, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీమద్యం సీసాలను తాము విలేకరుల సమావేశంలో చూపించామని బొండా స్పష్టంచేశారు. తాము అడిగిన వివరాలపై సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చిగా రోజానో, మరొకరో మాట్లాడితే వాస్తవాలు అవాస్తవాలు కావన్నారు. జే-ట్యాక్స్ వసూలు తట్టుకోలేక ప్రధానమైన డిస్టిలరీ కంపెనీలన్నీ మద్యం సరఫరా చేయకుండా చేతులెత్తేశాయన్నారు.

చీప్ లిక్కర్ పై క్వార్టర్ కు అదనంగా వసూలుచేస్తున్న రూ.100రూపాయలు ఎవరి జేబులోకి వెళుతోందో వైసీపీ మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని ఎక్సైజ్ మంత్రి సెక్రటేరియట్ లో, మందు బాటిళ్లుచూపి విలేకరులతో మాట్లాడాడన్నారు. మద్యం వ్యాపారాన్ని నియంత్రించాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని మహిళా సిబ్బందితోనే మందు అమ్మిస్తున్న ప్రభుత్వనిర్వాకంపై రోజా ఏం సమాధానం చెబుతుందని ఉమా నిలదీశారు. పక్కరాష్ట్రాల నుంచి వస్తున్న ఎన్ డీపీ లిక్కర్ ని వాలంటీర్లే డోర్ డెలివరీ చేస్తున్నారని, అదిచాలక గ్రామాల్లో నాటుసారా విక్రయాలు యథేచ్చగా సాగిస్తున్నారని, వీటన్నింటిపై నోరువిప్పే, దమ్ము, ధైర్యం రోజాకుగానీ, ఇతర మంత్రులకుగానీ లేదన్నారు. సిగ్గులేకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని తాగుబోతులకోసం ప్రపంచబ్యాంక్ రుణమిస్తుందని చెప్పడం జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వలోపాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసినంత మాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతాయని భావిస్తే, అంతకంటే ఆత్మవంచన మరోటి ఉండబోదన్నారు. ప్రతిపక్షం ఎత్తిచూపిన తప్పులు సరిదిద్దుకోకుండా, కేసులుపెడతాం.. అంతుతేలుస్తామంటూ సొల్లు కబుర్లు చెప్పి, డాంభికాలుప్రదర్శిస్తే భయపడేవారెవరూ లేరని బొండా తేల్చిచెప్పారు.

విజయనగరం సంస్థానం వ్యవహారాల్లో కూడా జగన్ ప్రభుత్వం తలదూర్చిందని, 1958లో ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను, గజపతిరాజుల సంస్థానానికి మూలపురుషుడైన పీ.వీ.జీ. రాజు తన తండ్రి గారైన మహారాజా అలక్ నారాయణ గజపతి (మాన్సాస్ ట్రస్ట్) పేరుతో స్థాపించడం జరిగిందని, ఆనాడు ఆయనస్థాపించిన ట్రస్ట్ కొన్ని విధివిధానాలు, నియమనిబంధనల ప్రకారం నేటికీ నిర్వహించడం జరుగుతోందని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మరోమాజీ మంత్రి కాలవశ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ట్రస్ట్ ను స్థాపించినప్పుడే పీ.వీ.జీ.రాజు ట్రస్ట్ చైర్మన్ గా ఉండి, తన కుమారులైన ఆనందగజపతి రాజు, అశోక్ గజపతిరాజులను మెంబర్లుగా నియమించడం జరిగిందన్నారు. వారు నెలకొల్పిన అనేక విద్యాసంస్థలనుకూడా ట్రస్ట్ అధీనంలోకి తీసుకొచ్చి, దాని నిర్వహణకోసం 13వేల ఎకరాలను దాతృత్వంగా ట్రస్ట్ కు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నిప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ఎవరూకూడా విజయనగరం రాజుల అధీనంలోఉన్న మాన్సాస్ ట్రస్ట్ జోలికి, దాని అధీనంలో ఉన్న విద్యాసంస్థలజోలికి వెళ్లలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తొలిసారి రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రముఖనేత, ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందులోభాగంగానే ఆనందగజపతిరాజు రెండోకుమార్తె అయిన సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. అప్పటికప్పుడు రహస్యంగా జీవో ఇచ్చి, సంచితను ఛైర్మన్ గా నియమించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందో, తరతరాలుగా వస్తున్న రాజకుటుంబం సంప్రదాయాలకు విరుద్ధంగా ఎందుకు నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేలా కొనసాగిస్తున్న తన చర్యలను జగన్మోహన్ రెడ్డి, విజయనగరం రాజుల కుటుంబంలోకి తీసుకెళ్లడంపై, విజయనగరం వాసులతో పాటు, మాన్సాస్ ట్రస్ట్ దయతో విద్యాబుద్ధులు నేర్చుకున్నవారందరూకూడా తీవ్రంగా తప్పుపడుతున్నారని టీడీపీనేత స్పష్టంచేశారు. ప్రజలసమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం, రాజకుటుంబీకుల వ్యవహారాల్లో వేలుపెట్టడం ఎంతవరకు సమంజసమని కళా నిలదీశారు. పీ.వీ.జీ.రాజు కుమారుల్లో ఒకరైన ఆనందగజపతిరాజుకి అబ్బాయిలు లేరని, అందువల్లే ఆయనకు తమ్ముడైన అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు కలుగచేసుకుందో ప్రజలకు చెప్పాలన్నారు. నెలరోజుల క్రితం ఢిల్లీలో సంచితను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి, సాక్షి టీవీలో ప్రసారంచేశారని, తర్వాత సాక్షిపత్రికలో అదే ఇంటర్వ్యూ కథనాన్ని ప్రచురించారన్నారు. ఇవన్నీ జరిగిన 15రోజుల తర్వాత సింహాచలం దేవస్థానానికి కమిటీవేసిన ప్రభుత్వం, అశోక్ గజపతిరాజుని ఛైర్మన్ గా, సంచిత గజపతిరాజుని మెంబర్ గా నియమించడం జరిగిందన్నారు. ఇది జరిగాక మాన్సాస్ ట్రస్ట్ లోవేలుపెట్టిన ప్రభుత్వం, దానికింద ఉన్న రూ.లక్షా30వేలకోట్ల విలువచేసే 13వేల ఎకరాల భూమిపై కన్నేసిందన్నారు. రాజకుటుంబం మధ్యన చిచ్చుపెట్టి, ట్రస్ట్ నడవడంలేదని చెప్పి, ఆభూములు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే, సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు.
ఏపీలో తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయమైన సింహాచల దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు కొనసాగుతుంటే, 3వతేదీన మరో కొత్తజీవో ఇచ్చి, సంచిత గజపతిరాజునే ఆలయ ఛైర్మన్ గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

20 రోజుల్లోనే అశోక్ గజపతి రాజుస్థానంలో సంచితను ఎందుకునియమించారు.. ప్రభుత్వంలోని ఆ కీలకనేత రాజకుటుంబం వ్యవహారాల్లో ఎందుకు కలగచేసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, తిరిగి ప్రశ్నలేస్తూ కట్టుకథలు చెబుతూ తప్పించుకుంటోందన్నారు. సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న 9వేల ఎకరాల భూములపై కన్నేసిన జగన్ సర్కారు, రూ.9లక్షలకోట్ల విలువచేసే ఆ భూమికి ఎసరు పెట్టిందన్నారు. ఎప్పటినుంచో ఉన్న వంశపారంపర్య ధర్మకర్తనుకాదని, 30ఏళ్ల వయసుకూడాలేని సంచితను తెరపైకి తీసుకురావడం వెనుక ప్రభుత్వం పెద్ద కుట్రే చేస్తోందని కళా తెలిపారు. రాజకుటుంబం వ్యవహారాల్లో వేలుపెట్టి, లక్షలకోట్ల విలువైన ఆస్తులను కొట్టేయాలన్న ఆలోచన ఉండబట్టే, 20రోజుల వ్యవధిలోనే దేవస్థానం మెంబర్ గా ఉన్న సంచితను ఛైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. ఇవన్నీ చూస్తుంటే, జగన్ ప్రభుత్వం కావాలనే ట్రస్ట్ వ్యవహారాల్లో, దేవస్థానం విషయాల్లో జోక్యం చేసుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజుల కుటుంబాన్ని విచ్ఛిన్నంచేయాలన్న దుర్భుద్ధి జగన్ ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వం జారీచేసిన జీవో చూస్తే ఆ విషయం బోధపడుతోం దన్నారు. ఒడిస్సాలోని రాజులుకూడా సింహాచలం దేవస్థానానికి భూములు ఇచ్చారని, హిందూ మత విశ్వాసాలపై జగన్ ఎందుకు దాడిచేస్తున్నారో ప్రజలే ఆలోచించాలన్నారు.

ఉదాత్తమైన ఆశయాలతో నిర్వహింపబడుతున్న మాన్సాస్ ట్రస్ట్ పై కన్నేసిన జగన్ ప్రభుత్వం, అశోక్ గజపతిరాజుపై కక్షతీర్చుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తున్న ప్రభుత్వం, లక్షలకోట్ల విలుచేసే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న దుర్భుద్ధితోనే అశోక్ గజపతిరాజు కుటుంబ వ్యవహారం లో వేలుపెట్టిందన్నారు. 1958లో పీ.వీ.జీ రాజు ట్రస్ట్ ను ఏర్పాటుచేసినప్పుడే తన తదనంతరం ఎవరు ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఎవరైతే కుటుంబానికి వారసుడిగా ఉంటాడో, అతనే ట్రస్ట్ కు ఛైర్మన్ గా ఉంటాడని నిబంధనల్లో పేర్కొనడం జరిగిందని, దానిప్రకారమే 16ఏళ్లపాటు, ఆనంద గజపతి రాజే ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించారని కాలవ తెలిపారు. 20-02-2020న జీవో నెం-252 విడుదలచేసిన జగన్ ప్రభుత్వం, సింహాచలం ఆలయట్రస్ట్ బోర్డుని 16 మంది సభ్యులతో ఏర్పాటు చేసిందన్నారు. ఆ జీవో ప్రకారం అశోక్ గజపతిరాజుని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా పేర్కొని, సంచితను 16మందిలో ఒక మెంబర్ గా నియమించిందన్నారు. 29వ తేదీన జరగాల్సిన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి3వతేదీకి వాయిదాపడటంతో, ఉన్నపళంగా సంచిత ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం జరిగిందన్నారు. అధికారికంగా అందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ బయటపెట్టకుండా, ట్రస్ట్ వ్యవస్థాపకులైన పీ.వీ.జీ రాజు నిబంధనల్లో వారసుడు అనిచెప్పినప్పటికీ దాన్నికాదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మాన్సాస్ ట్రస్ట్ అధీనంలో ఉన్న 13వేల ఎకరాలతోపాటు, ఉత్తరాంధ్రలో ఉన్న లక్షలఎకరాలను కాజేయాలన్న ఆలోచన విజయసాయికి ఉండబట్టే, ట్రస్ట్ వ్యవహారాల్లో వేలుపెట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు.

గత 24 ఏళ్ళుగా, బీసీలకు, 34 శాతం రిజర్వేషన్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, హైకోర్ట్ లో సరిగ్గా వాదనలు వినిపించకుండా, రిజర్వేషన్ ను 59 శాతం నుంచి 50 శాతానికి పరిమితం అయ్యేలా చేసారు. దీంతో బీసీలకు ఉండే రిజర్వేషన్ 34 శాతం నుంచి, 24 శాతానికి పడిపోయింది. దీంతో, 16 వేల మంది బీసీలు, వార్డు మెంబెర్లుగా, పంచాయతీ ప్రెసిడెంట్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా అవకాసం కోల్పోనున్నారు. నిజానికి హైకోర్ట్ లో కేసు కొట్టేస్తే, సుప్రీం కోర్ట్ కు వెళ్ళవచ్చు. అయితే జగన్ మాత్రం, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం లేదు. గతంలో ఇలాగే హైకోర్ట్ కొట్టేస్తే, అప్పటి ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి, సుప్రీం కోర్ట్ కు వెళ్లి, 60 శాతం రిజర్వేషన్ కు ఒప్పించారు. అయితే, ఇప్పుడ జగన్ మాత్రం, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం లేదు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంటే, జగన్ సుప్రీంకు వెళ్ళకుండా అన్యాయం చేస్తున్నారు అనే భవన ఉంది. తన కేసుల్లో కాని, మూడు రాజధానులు విషయంలో కాని, 5 కోట్లు పెట్టి లాయర్ ను తెచ్చారు, మరి ఇక్కడ ఎందుకు తేవటం లేదు అనే ప్రశ్న వస్తుంది.

bc 05032020 2

ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం బీసీలను అన్యాయం చేస్తున్నా, స్పందించకపోవటంతో, తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖాలు చేసింది టీడీపీ. ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ పిటిషన్ వేసారు. జగన్ బీసీల పై కుట్ర పన్నారని, అందుకే పిటీషన్ వేసామని చెప్పారు. మరో పక్క, టిడిపి బీసి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో, అన్ని మండలాల బిసి నాయకులు, బిసి ప్రజా ప్రతినిధులు పాల్గున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, "ఎన్టీఆర్ వల్లే బీసి నాయకత్వం పెంపొందింది. టిడిపి వల్లే బీసి రాజకీయ సాధికారత సాధ్యమైంది. టిడిపి అంటే బీసి..బీసి అంటే టిడిపి. అందుకే బీసిలపై జగన్ కక్ష సాధిస్తున్నారు. జీవో 558ద్వారా బీసిల గొంతు కోశారు. 10%కోత వల్ల బీసిలు 16వేల పదవులు కోల్పోతారు."

bc 05032020 3

"బీసి రాజకీయ సాధికారతకు వైసిపి సమాధి. 10% రిజర్వేషన్ల కోత బీసిలకు కోలుకోలేని దెబ్బ. బీసిల పట్ల వైసిపి ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోంది. పూలె, ఎన్టీఆర్ ఆదర్శాలను వైసిపి కాలరాస్తోంది. బీసి రిజర్వేషన్లు 34%నుంచి 24%కు తగ్గింపు వైసిపి ఉన్మాద చర్య. దీనిపై అన్ని మండల కేంద్రాలలో నిరసనలు తెలపాలి. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు జరపాలి. అటు న్యాయపోరాటం, ఇటు ప్రజా పోరాటం ఉధృతం చేయాలి. బీసి రిజర్వేషన్లు 33ఏళ్లుగా టిడిపి కల్పించిన హక్కు. 1987నుంచి 27% బీసి రిజర్వేషన్లు కల్పించాం. 1994నుంచి 34% బీసి రిజర్వేషన్లు ఇచ్చాం. పోరాడి బీసిలు సాధించుకున్న హక్కు 34% రిజర్వేషన్లు. ఇప్పుడు పోగొట్టుకుంటే మళ్లీ తిరిగిరాదు. దీనిని తాకట్టు పెట్టే అధికారం, పొట్టకొట్టే అధికారం వైసిపికి లేదు. ఇప్పుడు బిసి రిజర్వేషన్లను 24%కు తగ్గింపు దుర్మార్గ చర్య. బీసిల గొంతు నొక్కేందుకే శాసన మండలి రద్దు. బీసిల అసైన్డ్ భూములు లాక్కున్నారు. బీసి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఫెడరేషన్ల నిధులు పక్కదారి పట్టించారు. బీసి కార్పోరేషన్లను నిర్వీర్యం చేశారు. మౌనంగా ఉంటే వైసిపి ఉన్మాదం పేట్రేగిపోతోంది. బిసిల హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలి. దీనిపై ఇప్పటికే బీసి ప్రత్యేక బృందం ఢిల్లీకి పంపాం. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నాం. బీసిలపై వైసిపి కక్ష సాధింపు చర్యలను అడ్డుకోవాలి. బీసీ రాజకీయ సాధికారత కాపాడుకోవాలి. 34% బీసి రిజర్వేషన్లను కాపాడుకోవాలి." అంటూ చంద్రబాబు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read