అసెంబ్లీలో బుల్లెట్టు భాషతో బాగా ఫేమస్ అయ్యారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య..బుల్లెట్టు దిగిందా లేదా అంటూ పోకిరి డైలాగులు కొట్టి చివరికి మంత్రి పదవి పీకేయడంతో కనుమరుగు అయ్యాడు. రాష్ట్ర కేబినెట్లో ఉంటూ హల్చల్ చేసిన అనిల్ నోటిపారుదల మంత్రిగా, ఇరిటేషన్ మంత్రిగా కూడా పేరుపడ్డారు. చివరికి మంత్రి పదవి పోవడంతో నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. ఇక్కడా మనశాంతిగా ఉండటానికి వీల్లేకుండా వైసీపీలో పెద్దలు చేశారు. ఆర్థికంగా బలవంతుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆల్రెడీ రాజ్యసభకి పంపారు జగన్. ఇప్పుడు ఆయన తన భార్యకి అనిల్ సీటు అడుగుతున్నారు అనే ప్రచారం ఉంది. ఇదీ ఓకే అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్‌తో బాగా సన్నిహితంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరం అయ్యారు. అనిల్ ఆనుపానులన్నీ తెలిసిన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కూడా అబ్బాయ్ తో విభేదాలు మొదలయ్యాయి. మంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలోని రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలతో అనిల్ కి సఖ్యత లేదు. మంత్రి పదవి పోయాక అనిల్ పేరు వింటేనే ఆ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వేమిరెడ్డి నెల్లూరు సిటీ సీటుపై కర్చీఫ్ వేసేశారు. ఇది తెలిసిన నుంచి అనిల్ తనలో తానే రగిలిపోతున్నాడు. తాజాగా మీడియా ముందుకొచ్చి తన అక్కసునంతా వెళ్లగక్కేశాడు. అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తు న్నాడు.. రాసుకోండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో పోలవరం డిసెంబర్ 2020 అని డేట్ ఫిక్స్ చేశాడు. 2023 డిసెంబర్ రాబోతోంది కానీ పోలవరం పూర్తి కాలేదు. ఆ పోలవరం చాలెంజ్ మాదిరిగానే ఈ సీటు చాలెంజ్ కూడా అని నెల్లూరు టాక్. అంతే కాదు, తాను జగన్ కు తప్ప ఎవరికీ తల వంచను అని, నేను పెద్దోడిని నా ముందు తల వంచాలి అంటే కుదరదని, నెల్లూరులో వైసీపీ పెద్దలకు చెప్పకనే చెప్పారు. అనిల్ కు ఈసారి ఎన్నికల్లో టికెట్ లేదని సిటీ నియోజ కవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుండడంతో పోటీచేసేది తానే రాసి పెట్టుకోండంటూ అనిల్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. అయితే అనిల్ కి వైసీపీ మార్క్ బుల్లెట్టు దిగి చాలా రోజులవుతోందని, మనిషి కొంచెం ఫిట్‌గా ఉండడం వల్ల తెలియడంలేదని పంచ్ డైలాగులు వైసీపీ క్యాంప్ నుంచే పేలుతున్నాయి. మరి జగన్ ని ఇంతలా నమ్ముకున్న అనిల్ ను, జగన్ ఏమి చేస్తారు, మళ్ళీ నెల్లూరు సీటు ఇస్తారా, ఎక్కడైనా సర్దుబాటు చేస్తారా అనేది చూడాలి మరి.