కియా. ఎవ‌రు తెచ్చిన‌ద‌యా. అంటే చ‌దువుకోని పిల్లాడిన‌డిగినా ఠ‌క్కున చెబుతాడు చంద్ర‌బాబు తెచ్చాడ‌ని. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కియా కార్ల కంపెనీని అనంత‌పురం జిల్లాలో స్థాపించ‌డంలో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుదే. టిడిపి కియా తెచ్చిన‌ప్పుడు వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడుబోని కార్ల కంపెనీ కియా అని, కమీషన్ల కోసం చంద్రబాబు ఆంధ్రకు తెచ్చాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జగన్ రెడ్డి కూడా ‪‬చంద్రబాబు కియాని తెచ్చి రైతుల పొట్ట కొడతన్నాడ‌ని, దీనిని అడ్డుకుని తీర‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఏపీలో కియా తెచ్చిన టిడిపి స‌ర్కారు ఓడిపోయింది. వైసీపీ స‌ర్కారు వ‌చ్చింది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కియా వాళ్ల‌ను క‌మీష‌న్ల కోసం వైసీపీ నేత‌లు బెదిరించారు. దీంతో అనుబంధ ప‌రిశ్ర‌మ‌లు క‌ర్ణాట‌క‌కి త‌ర‌లించుకుపోయేందుకు కియా సిద్ధ‌మైంది. కియా చంద్ర‌బాబు తేలేద‌ని, దివంగ‌త మ‌హానేత రాజ‌శేఖర్ రెడ్డి బతికి వున్న‌ప్పుడు లేఖ రాయ‌డం వ‌ల్లే వ‌చ్చింద‌ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న అసెంబ్లీ చెప్పిన బుర్ర‌క‌థ ఇప్ప‌టికీ నెట్టింట న‌వ్వులు పంచే ట్రోల్. తాజాగా కియా ఇండియ‌న్ కార్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 అవార్డు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి నాలుక మ‌డ‌తేసి ట్వీట్ తిర‌గేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. నేడు కియా కార్ల ప‌రిశ్ర‌మ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్న ట్వీటుతోనే నాడు అమ్ముడుబోని కార్ల కంపెనీ క‌మీష‌న్లు ఇచ్చి ఏపీకి వ‌స్తోంద‌ని ట్వీటారు. విజ‌య‌సాయిరెడ్డి ఇంత‌లా నాలుక మ‌డ‌తేయ‌డం ప్ర‌తీసారీ అలవాటే అయినా కియా విష‌యంలో ట్వీటు మార్చి మ‌రింత అభాసుపాల‌య్యారు.

త‌మ ఇంటి ప‌ని చేసేవారు ఒక స‌ల‌హాదారుడు. త‌మ వంట ప‌నిచేసేవాడు మ‌రొక స‌ల‌హాదారుడు. సాక్షి జీత‌గాళ్ల‌కు ప్ర‌జాధ‌నం దోచిపెట్ట‌డానికి స‌ల‌హాదారుల పోస్టులు క‌ట్టబెట్టిన వైసీపీ ప్ర‌భుత్వం హైకోర్టు వ్యాఖ్య‌ల‌తో భ‌యం ప‌ట్టుకుంది. లెక్కలేనంత మంది స‌ల‌హాదారుల్ని వేసుకుని జ‌నం సొమ్ము దోపిడీకి దారులు వేసిన వైసీపీ స‌ర్కారుకి ఎంత మంది ఉన్నారో తెలియ‌క‌పోవ‌డం షాక్ కి గురిచేస్తోంది. దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్, ఉద్యోగుల సంక్షేమ‌ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి నియామకాలపై హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై వాద‌న‌ల సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ధ‌ర్మాస‌నం.  చివ‌రికి ఉద్యోగుల‌కు డీఏ ఇవ్వ‌డం కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఐఏఎస్ అధికారులు ఉండగా శాఖలకు సలహాదారులు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్దతను తేలుస్తామని, ఎంత మంది స‌ల‌హాదారులున్నారో..వారి విధులు, జీత‌భ‌త్యాలు తెలియ‌జేయాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో తాము ఎడాపెడా నియ‌మించిన స‌ల‌హాదారులు ఎంత‌మంది  రాష్ట్రంలో ఉన్నారో వారి వివరాలు ప్ర‌భుత్వం సేక‌రిస్తోంది. శాఖలవారీగా సలహాదారుల వివరాలు వెంటనే పంపాలని అన్ని శాఖలకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. సలహాదారుల పేర్లు, హోదా, ఎప్పట్నుంచి ఉన్నారనే వివరాలు పంపాలని, ఇవి హైకోర్టుకు సమర్పించాల్సి ఉంద‌ని కోరింది.

బ్రిటిష్ కాలం నాటి (1861) చ‌ట్టంని ఉప‌యోగించి ఏపీ స‌ర్కారు తెచ్చిన జీవో 1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఈ జీవోని హైకోర్టు స‌స్పెండ్ చేయ‌డంతో సుప్రీం కోర్టులో జ‌గ‌న్ స‌ర్కారు వేసిన‌ పిటిషన్‌పై విచారణని ముగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోము అని స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఆధ్వ‌ర్యంలోని ధర్మాసనం స్ప‌ష్టంచేసింది. కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఈనెల 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం దీనిపై విచారణ చేపట్టాలని సిజెఐ ఆదేశించారు. వాద ప్రతివాదులు ఇరువురు అన్ని అంశాలను డివిజన్‌ బెంచ్‌ ముందు ప్రస్తావించుకోవచ్చని  పేర్కొన్నారు. అన్ని అంశాలు ఓపెన్‌గా ఉంచుతున్నామన్న సిజెఐ, కేసు మెరిట్స్‌పై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని తేల్చి చెప్పారు.  శీతాకాల సెలవుల్లో ఉన్న ధర్మాసనం ఈ కేసుని టేక‌ప్ చేయ‌డం, దాని విచారణ పరిధిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంత‌రం లేవ‌నెత్తారు. దీనికి ప్రతివాదుల తరపు న్యాయవాదులు  స‌మాధానం ఇచ్చారు.

టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో 400 రోజుల‌పాటు పాద‌యాత్ర చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై వైసీపీ స్పంద‌న‌లు చాలా విచిత్రంగా వున్నాయి. లోకేష్ పాద‌యాత్ర చేస్తే మాకేంట‌ట అంటూనే రోజుకొక మంత్రి మీడియా ముందుకు వ‌చ్చి నోటికొచ్చిన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పాద‌యాత్ర‌ని ప‌ట్టించుకోన‌ప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు విమ‌ర్శల‌తో విరుచుకుప‌డ‌టం వెనుక భావ‌మేంట‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోప‌క్క పాద‌యాత్ర‌కి ఇప్ప‌టివ‌ర‌కూ అనుమ‌తి ఇవ్వ‌కుండా తాత్సారం చేస్తున్నారు. జీవో1ని హైకోర్టు స‌స్పెన్ష‌న్లో పెట్టినా, దాని అమ‌లు కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కి చీవాట్లు తిని వ‌చ్చారు. ఓ వైపు కోర్టుల ద్వారా ప‌రోక్షంగా ఆప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు. ఇంకోవైపు పోలీసుల‌కు అన్ని స్థాయిల్లో అనుమ‌తుల కోసం ద‌ర‌ఖాస్తులు చేసినా ఎవ్వ‌రూ అనుమ‌తి తిర‌స్క‌రించిన‌ట్టు కానీ..ఇస్తున్న‌ట్టు కానీ ప్ర‌క‌టించ‌కుండా నాన్చుతున్నారు. టిడిపి కార్యాల‌యం నుంచి రిమైండ‌ర్ లేఖ‌లు రాసినా స్పంద‌న శూన్యం. పాద‌యాత్ర కాక‌పోతే పొర్లుదండాలు పెట్టుకోమంటూ మంత్రి రోజా సెటైర్లకి టిడిపి నుంచి గ‌ట్టిగానే కౌంట‌ర్లు ప‌డ్డాయి. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ లోకేశ్ గురించి ఆలోచించాల్సినవసరం లేదంటూనే అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడు. మొత్తానికి లోకేష్ పాద‌యాత్ర అనేస‌రికి వైసీపీలో వ‌ణుకు ప్రారంభ‌మైంద‌ని వాళ్ల ప్ర‌క‌ట‌న‌లు, చ‌ర్య‌ల వ‌ల్ల స్ప‌ష్టం అవుతోంది.

Advertisements

Latest Articles

Most Read