పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు అవినీతి చేసారని చెప్తూ, ఇప్పటికి అయుదు నెలలు దాటినా, ఇప్పటి వరకు రూపాయి కూడా అవినీతిని బయట పెట్టలేదు. అయితే, అవినీతి సాకుతో, పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్రం చెప్పినా వినకుండా, పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పటి వరకు, అద్భుతంగా పని చేసి, పోలవరం ప్రాజెక్ట్ కాంక్రీట్ విషయంలో కూడా, వరల్డ్ రికార్డు నెలకొల్పి, పని చేసిన నవయుగని తప్పించింది. కొత్త టెండర్ పిలవగా, కేవలం ఒక్కటంటే ఒక్క కంపెనీ మాత్రమే, రివర్స్ టెండరింగ్ లో పాల్గంది. ఆ కంపెనీ పేరే, మేఘా. మేఘా వేసిన రివర్స్ టెండర్ తో, పోలవరం సాగునీటి ప్రాజెక్టు, హైడల్ ప్రాజెక్ట్ లో, రూ.628 కోట్లు ఆదా అయ్యింది అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టింది. అయితే, ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే, రివర్స్ లోనే, రివెర్స్ వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.
మేఘ సంస్థ కోట్ చేసిన మొత్తానికి, అదనంగా మరో 500 కోట్లు ఇవ్వటానికి, రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్ట్ పనులను నవంబర్ ఒకటిన ప్రారంభించింది. అయితే, ఇప్పుడు పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే, ఇలా 500 కోట్లు పెంచటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఇంకా ఎన్ని అదనపు చెల్లింపులు చేస్తారో అని, గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలవరం హెడ్‌వర్క్స్ ప్రాజెక్ట్ లో మిగిలిన పనులుతో పాటు, హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కలిపి రూ.4,987.55 కోట్లకు ప్రభుత్వం రివర్స్ టెండర్లు పిలిచింది. అయితే కేవలం మేఘా సంస్థ మాత్రమే పాల్గున్న ఇక్కడ, రూ.4,359.11 కోట్లకు పనులు పూర్తీ చేస్తామని చెప్పి, రూ.628 కోట్లు ఆదా అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ అదనపు చెల్లింపులకు కారణం, ఇసుక. గతంలో ఇసుక ఉచితంగా వచ్చేదని, ఇప్పుడు తన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని, దీనికి జీఎస్టీ అధికం అని, ఇది టెండర్ డాక్యుమెంట్ పరిధిలోకి రాని పని అని, అందుకే అదనంగా 500 కోట్లు ఇవ్వాలని మేఘా లేఖ రాయగా, పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకరబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే మేఘా టెండర్ వేసే సమయానికే, ఉచిత ఇసుక పాలసీ రద్దు అయ్యిందని, ఇప్పుడు ఇలా అదనపు చెల్లింపులు తీసుకోవటం దారుణమని నిపుణులు అంటున్నారు. దీని పై లోకేష్ వ్యంగ్యంగా స్పందించారు. "రివర్స్ రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరకు చిప్ప మిగిల్చేట్టు ఉంది. ఒక పక్క 628 కోట్లు ఆదా చేసాం అని చెప్పుకుంటూ మరో పక్క ఇసుక ఖర్చు పెరిగింది అని 500 కోట్లు చెల్లించడం చూస్తుంటే డిప్ప గొరిగి విగ్గు పెట్టి మళ్ళీ గొరిగినట్టు ఉంది." అంటూ ట్వీట్ చేసారు.