ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మార్పు వార్తల పై, గత వారం రోజులుగా, వార్తలు నడుస్తూ ఉన్నాయి. కృష్ణా నది వరదలు వచ్చిన సమయంలో, కావాలనే అమరావతిని ముంచాలని ప్లాన్ చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసినట్టే, తరువాత రోజే జగన్ ప్రభుత్వంలో, కీలక మంత్రిగా ఉన్న బొత్సా సత్యన్నారాయణ అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి పై మా ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, మరో వారం రోజుల్లో ప్రభుత్వం తరుపున ప్రకటన వస్తుందని చెప్పారు. అమరావతి నిర్మాణం ఖర్చు డబల్ అవుతుందని, అమరావతికి వరదలు వచ్చి మొత్తం మునిగిపోతుందని, దాని కోసం, డాంలు, కాలువులు తవ్వాలని, అందుకే ఇక్కడ రాజధాని గురించి చర్చ చేస్తున్నామని బొత్సా అన్నారు.
ఈ విషయం పై తెలుగుదేశం పార్టీతో పాటు, బీజేపీ, జనసేన కూడా తీవ్రంగా స్పందిచాయి. రాజధాని రైతులు కూడా అన్ని రాజకీయ పార్టీలను కలిసి, వారి బాధను చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలోనే, బీజేపీ రాజ్యసభ ఎంపీ టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయం పై జగన మోహన్ రెడ్డి, ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. బీజేపీ అధిష్టానమే, జగన్ అమరావతి మార్పు పై చర్చలు జరిపిన విషయం తనకు చెప్పిందని అన్నారు. అయితే, అమరావతి మార్పు తధ్యం అని, ఇదే సందర్భంలో, ఎక్కడా లేని విధంగా, నాలుగు రాజధానులను జగన్ ప్రకటించే అవకశం ఉందని, దీని పై ఇప్పటికే ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయని అన్నారు.
విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానులు కాబోతున్నాయని, ఇది నూటికి నూరు పాళ్ళు నిజం అని, టిజి వెంకటేష్ అన్నారు. అలాగే పోలవరం టెండర్ల రద్దు విషయం పై కూడా టిజి వెంకటేష్ స్పందించారు. విజయసాయి రెడ్డి, అనవసరంగా ప్రధాని మోడీ పేరు ఈ విషయంలో లాగారని, ఇప్పటికే ఆయన్ను ప్రధాన మంత్రి కార్యాలయం పిలిపించిందని అన్నారు. ఇలాంటి పనులు ప్రధాని మోడీ ఆశీర్వాదంతో జరుగుతున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలవరం విషయంలో ఏమైనా తేడా జరిగితే, జగన్ మోహన్ రెడ్డి, చేతులారా చంద్రబాబుకి మళ్ళీ అధికారం ఇచ్చినట్టే అని టిజి అన్నారు. కేసీఆర్ ని గుడ్డిగా నమ్మకుండా, జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.