అంతా అనుకున్నట్టే జరుగుతుంది. అమరావతిలో లాగే, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా, జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎలా ఉంటుంది ? కేంద్రం ఏమంటుంది ? పనులు జరుగుతాయా లేదా ? ఇవన్నీ తెలియాలి అంటే, కొన్ని రోజులు ఆగాల్సిందే. చంద్రబాబు సియంగా ఉండగా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, పోలవరం పనులు సరిగ్గా చెయ్యటం లేదని, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వారికి చేసే సత్తా లేదని గ్రహించారు. కేంద్రం దగ్గరకు వెళ్లి, విషయం చెప్పారు. నవయుగ కంపెనీకి ఉన్న సామర్ధ్యం గ్రహించి, వారికి కాంట్రాక్టు ఇవ్వాలని కోరారు. కేంద్రం కూడా అన్నీ బేరీజు వేసుకుని, నిర్ణయం తీసుకుంది. నవయుగకు గతంలో కంటే 14 శాతం తక్కువకే పనులు అప్పచెప్పారు. కేంద్రం ఆమోదంతో, పోలవరం కీలక పనులు అన్నీ నవయుగ చేతికి వెళ్ళాయి.
అంతే అప్పటి నుంచి పోలవరం రాత మారిపోయింది. నవయుగ కంపెనీ, పనులను పరుగులు పెట్టించింది. చూస్తూ ఉండగానే, రెండేళ్ళలో, పోలవరం ప్రాజెక్ట్ కు ఒక రూపు వచ్చింది. గడ్కరీ కూడా జరుగుతున్న పనులను అభినందించారు. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్, కూడా ఇంత స్పీడ్ గా పనులు జరగలేదు. అయితే, అనూహ్యంగా ప్రభుత్వం మారింది. చంద్రబాబు ప్లేస్ లో జగన్ వచ్చారు. అంతే సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మూడు నెలల నుంచి ఒక్క పని జరగటం లేదు. గత 15 రోజులుగా వరదలు వచ్చేసాయి. వరదల వల్ల ప్రాజెక్ట్ ఎక్కడా దెబ్బ తినకుండా, నవయుగ కంపెనీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలాంటి టైంలో, జగన్ ప్రభుత్వం, నవయుగ కంపెనీకి షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనుల నుంచి వైదొలగాలని చెప్తూ నవయుగ కంపెనీకి ఏపీ జలవనరులశాఖ నోటీసులు జారీ చేసింది.
ఈపీసీ విధానానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నవయుగకు కాంట్రాక్ట్ పనులు ఇచ్చిందని జగన్ ప్రభుత్వం చెప్తుంది. 60సీ కింద నోటీసులు వేరే సంస్థలకు పనులు అప్పగించడం, రూల్స్ కి విరుద్ధమని నిపుణుల కమిటీ చెప్పిందని, పోలవరం విషయంలో రీటెండరింగ్ వెళ్లాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచింది. అయితే ఇప్పటికే నవయుగ కంపెనీ 14 శాతం తక్కువకు పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా, అప్పుడు నవయుగని పెట్టింది కేంద్రం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం ఏంటి అనే వాదన కూడా వినిపిస్తుంది. కేంద్రం ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా ? అనేది కూడా చూడాలి. ఇప్పటికే విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి, నవయుగని తప్పించాలని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని పై చంద్రబాబు స్పందించారు. ఒక పక్క వరద సమయంలో ప్రాజక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలను వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం నోటీసులు పంపడం సరికాదంటూ చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ పై జగన్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందొ ఇక్కడ అర్ధమవుతుందని అన్నారు.