రాష్ట్ర జీవనాడి, 70 ఏళ్ళ ప్రజల కల అయిన పోలవరం ప్రాజెక్ట్ పై కూడా, జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నవయుగ కంపెనీని పోలవరం ప్రాజెక్ట్ నుంచి తప్పించటం పై, ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి, చివరకు పోలవరం ప్రాజెక్ట్ పై కూడా పోలవరం పంచాయతీ చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలు విషయంలో ఇలాగే కాంట్రాక్టర్ లను బెదిరించారని, వారికి డబ్బులు ఇవ్వకుండా, కరెంట్ తీసుకోకుండా భయపెట్టి, వారిని లొంగదీసుకోవాలని చూసారని, చివరకు వారు హైకోర్ట్ కు వెళ్ళాల్సిన పని వచ్చిందని అన్నారు. అమరావతి విషయంలో కూడా ఇలాగే కాంట్రాక్టర్ లను భయపెట్టి వెళ్ళగోట్టారని దేవినేని ఉమా అన్నారు.
ఇప్పుడు పోలవరం పై కూడా ఇలాగే చేస్తున్నారని, నవయుగ కంపెనీకి, ప్రభుత్వం రాసిన లేఖ బయట పెట్టి, ఇది పులివెందుల పంచాయతీ కాదా అని ప్రశ్నించారు. తమకు ఇష్టం లేకపోతె ఆ కంపనీని వేధించటం, బెదిరించటం, లొంగదీసుకోవటం, కుదరకపోతే బయట తోసేయటం చేసి, ప్రతి విషయంలో పులివెందుల పంచాయతీ చేస్తున్నారని, దేవినేని ఉమా అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన మనుషులకు కట్టబెట్టేందుకే ఉన్నట్టు ఉంది, జగన్ ప్రభుత్వం మట్టి పనులను ఆపేసిందని ఆరోపించారు. నవయుగకి రాసిన లెటర్ చూపిస్తూ, 15 రోజుల్లో అకౌంట్ సెటిల్ చేసుకోవాలని, లేకపోతె వెళ్లిపోవాలి అంటూ బెదిరిస్తూ జగన్ పంచాయితీ చేశారన్నారు. ఇది రాష్ట్రం అనుకున్నారా, పులివెందుల పంచాయతీ అనుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెట్టారు.
పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిపోయింది అంటూ జగన్ ప్రభుత్వంలోని పెద్దలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ అంతా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేతిలో, కేంద్రం పర్యవేక్షణలో ఉంది అనే విషయం మర్చిపోయారని అన్నారు. అప్పట్లో పనులు ఆలస్యం అవుతున్నాయని, చంద్రబాబు గడ్కరీ దగ్గరకు వెళ్లి అన్నీ చెప్తే, అదే రేట్ కు పనులు చేస్తే, ఎవరైతే ఏంటి అని గడ్కరీ అన్నారని, తరువాతే ట్రాన్స్ ట్రాయ్ నుంచి నిబంధనలకు అనుగుణంగా నవయుగకు పనులు అప్పగించామని దేవినేని ఉమా అన్నారు. పోలవరం పవర్ ప్లాంట్ పై జగన మోహన్ రెడ్డికి, 10 ఏళ్ళ నుంచి కన్ను ఉందని, ఇప్పుడు దాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగానే, ఇవన్నీ చేస్తున్నారని, కాని ఇప్పుడు పోలవరం కేంద్రం చేతిలో ఉండనే విషయం మర్చిపోయారని దేవినేని ఉమా అన్నారు.