వారం క్రితం, లోక్‌సభ ఎన్నికల్లో, ఈవీఎం విధానంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పాటు, దాని మిత్రపక్షాలు, రహస్య మిత్రులు, ఏకపక్షంగా ఎలా గెలిచారో చూసాం. అయితే, ఆ జోష్ మీద ఉన్న బీజేపీకి, బ్యాలట్ విధానంలో జరిగిన కర్ణటక స్థానిక సంస్థల ఫలితాలు స్పీడ్ బ్రేక్ వేశాయి. దాదాపు తుడిచిపెట్టుకు పోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీ వారం రోజుల్లోనే పుంజుకుంది. బ్యాలెట్ విధానంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీని వెనక్కునెట్టి దూసుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 పట్టణ పంచాయతీలు, 7 నగర సభలు, 30 పురసభలతో పాటు పలు పాలికెలో ఖాళీగా వుండే వార్డులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. 19 పట్ణణ పంచాయతీలకుగాను 8 చోట్ల బీజేపీ, మూడు చోట్ల కాంగ్రెస్, ఇతరులు 8 చోట్ల గెలుపొందారు. పురసభలో 30 చోట్లకుగాను బీజేపీ ఆరు స్థానాలతో సరి పెట్టుకోగా.. కాంగ్రెస్ ఏకంగా 12 చోట్ల తిరుగులేని రికార్డు నమోదు చేసింది. జేడీఎస్ రెండింటికే పరిమితం కాగా ఇతరులు 10 చోట్ల గెలుపొందారు.
7 నగర సభలకుగాను రెండు చోట్ల కాంగ్రెస్, 5 చోట్ల ఇతరులు గెలుపొందారు. వార్డుల ప్రకారం పరిశీలిస్తే 714 పురసభల్లో కాంగ్రెస్ 322, బీజేపీకి 184, జేడీఎస్ 102, ఇతరులు 107 చోట్ల గెలుపొందారు. పట్టణ పంచాయితీల పరిధిలో 290 వార్డులకు గాను కాంగ్రెస్ 97, బీజేపీ 126, జేడీఎస్ 34, ఇతరులు 33 చోట్ల, నగరసభల పరిధిలో 217కు గాను కాంగ్రెస్ 90, బీజేపీ 56, జేడీఎస్ 38, ఇతరులు 33 చోట్ల గెలుపొందారు. మొత్తంగా వార్డులను పరిశీలిస్తే 1221కిగాను కాంగ్రెస్ 509, బీజేపీ 365, జేడీఎస్ 174, స్వతంత్రులు 172 చోట్ల గెలుపొందారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడయ్యాయి. బెంగళూరులో పాలికెలో సగయపుర వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పళణియమ్మ గెలుపొందగా కావేరిపుర వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి పల్లవి చెన్నప్ప విజయం సాధించారు. రెండు వా ర్డులకు గాను జరిగిన కౌంటింగ్ కేంద్రాల వద్ద బీజేపీ, కాంగ్రెస్ సంబరాలు చేసుకున్నారు.
బళ్లారి జిల్లాలో మే 29వ తేదీన జరిగిన నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఆయా తాలుకా తహసీల్దారు కార్యాలయాల్లో జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలలో హొసపేటె తాలుకా కమలాపురం పట్టణపంచాయతికి జరిగిన ఎన్నికల్లో మొ త్తం 20 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగ్గా... ఇందులో కాంగ్రె్‌సపార్టీ 14స్థానాల్లో, ఒక స్థానం బిజేపీ, మిగిలిన ఐదు స్థానాల్లో ఇండిపెండెండ్లు గెలుపొందారని జిల్లా ఎన్నికల అధికారి డా.రామ్ ప్రసాత్ మనోహర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 28స్థానాలకు గాను బీజేపీ 25 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెరో సీటు మాత్రమే సాధ్యమైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన స్థానిక సమరంలోను బీజేపీకి తిరుగులేని రీతిలో ఫలితాలు ఉంటాయని భావించిన ఆ పార్టీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్‌లు కలిసి పోటీ చేయగా.. స్థానికంలో మాత్రం ఎవరికివారుగానే పోటీ చేశారు. అయినా బీజేపీ మాత్రం వెనుకబడింది.